‘టెట్’పై త్వరగా నిర్ణయం తీసుకోవాలి
* అభ్యర్థుల విజ్ఞప్తి
ఈనాడు-హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో నాలుగో దఫా జారీచేసిన ప్రకటన అనుసరించి టెట్ రాసేందుకు సుమారు 4.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తుచేశారు. సెప్టెంబరులో ఈ పరీక్ష రాసేందుకు తేదీ ఖరారు చేయగా సీమాంధ్ర ఉద్యమం కారణంగా జరపలేని పరిస్థితులు తలెత్తడంతో వాయిదా అనివార్యమైంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి పది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఇందులో మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రశ్నపత్రాల ముద్రణ, పరీక్ష నిర్వహణ కోసం అవసరమైన ఇతర చర్యలను విద్యాశాఖనే తీసుకుంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఉద్యోగార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో బోధకులుగా చేరడంలో ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. టెట్ త్వరలో నిర్వహిస్తామన్న సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి వెలువడుతున్నందున ఉద్యోగార్థులు టెట్‌కు సన్నద్ధం అవుతూనే ఉన్నారు. విద్యా శాఖ తరపున కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు పెద్ద యంత్రాంగం ఉన్నందున పరీక్షను నిర్వహించడానికి ఆటంకం ఏమిటని ఉద్యోగార్థులు ప్రశ్నిస్తున్నారు. టెట్ నిర్వహణ అనంతర పరిస్థితులతో ముడిపెట్టకుండా తమ ఆవేదనను అర్థం చేసుకోని త్వరితగతిన తేదీని ఖరారు చేయాల్సిన అవసరం ఉందని అభ్యర్థులు కోరుతున్నారు.