RSS

Daily Archives: December 26, 2013

సెయింట్ జేవియర్స్ ఆధ్వర్యంలో ‘బయో’పరిశోధక కేంద్రం


కోల్‌కతా: అత్యాధునిక జీవ సాంకేతిక విజ్ఞాన, సూక్ష్మ జీవశాస్త్ర పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిష్ఠాత్మక సెయింట్ జేవియర్స్ కళాశాల శ్రీకారం చుట్టింది. రూ.250 కోట్లు వెచ్చించి, ఇక్కడి రాజర్‌హాట్ వద్ద 17 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబరు 27న శంకుస్థాపన చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ ఫెలిక్స్ రాజ్ తెలిపారు. ఇక్కడి నుంచి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములను అందిస్తామని ఫాదర్ చెప్పారు.

Advertisements
 
Comments Off on సెయింట్ జేవియర్స్ ఆధ్వర్యంలో ‘బయో’పరిశోధక కేంద్రం

Posted by on December 26, 2013 in Uncategorized

 

బీఈడీ, ఎంఈడీ కోర్సుల కాలవ్యవధి పెంపు!


ఈనాడు, హైదరాబాద్: 2015-16 విద్యా సంవత్సరం నుంచి బీఈడీ, ఎంఈడీ కోర్సుల కాలవ్యవధిని పెంచే దిశగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్‌డీ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) కసరత్తు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా హెచ్ఆర్‌డీ శాఖ కార్యదర్శి భట్టాచార్య, అదనపు కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్, ఎన్‌సీటీఈ ఛైర్మన్ సంతోష్‌పాండా డిసెంబరు 26న సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో తీసుకురావాల్సిన మార్పులపై జస్టిస్ వర్మ వెలువరించిన నివేదికపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమల్లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వారిలో వీరిలో అత్యధికులు ఉపాధ్యాయ విద్యలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీఈడీని రెండేళ్లు చేయడమా? లేదా బీఏ, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల్లో ఉపాధ్యాయ విద్యను సమ్మిళితం చేసి, నాలుగేళ్ల కాలవ్యవధిగా నిర్ణయించడమా అనే దిశగా విద్యామండలి వర్గాలు యోచిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎంఈడీని రెండేళ్ల కోర్సుగా నిర్వహించే దిశగానూ సమాలోచన చేస్తున్నారు. డీఈడీ కోర్సు రెండేళ్ల వ్యవధిలో ఎలాంటి సమస్యలు లేకపోయినా నిర్వహణ తీరులోని లోపాలను పరిహరించే అంశంపైనా చర్చిస్తున్నారు.

 
Comments Off on బీఈడీ, ఎంఈడీ కోర్సుల కాలవ్యవధి పెంపు!

Posted by on December 26, 2013 in Uncategorized

 

ఈ ఏటి పట్టభద్రుల్లో 47% ‘పనికి రారు


న్యూఢిల్లీ: ఫలానా ఐఐటీ విద్యార్థికి ఏడాదికి కోటి రూపాయల జీతం; ఫలానా ఐఐఎం విద్యార్థులకు 50 లక్షల జీతం… అంటూ వచ్చే వార్తలు చూసి అబ్బో అని మురిసిపోతాం! కానీ ఈ వేళ్ళమీద లెక్కించేంత మందిని చూసి మురిసిపోకూడదనీ… మన విద్యారంగ గొప్పతనం వేరే ఉందనీ మన విద్యారంగ మేడిపండును పొట్టవిప్పి చూపిస్తోందో సర్వే! ఈ ఏడాది (2013) మనదేశంలోని పట్టభద్రుల్లో (గ్యాడ్యుయేట్లు) దాదాపు సగం మంది (47%) ఉద్యోగాలకు పనికిరారని డిసెంబరు 26న ఆ సర్వే తేల్చిచెప్పింది. ఉపాధి పరిష్కార రంగంలోని ప్రముఖ కంపెనీ ఆస్ఫైరింగ్ మైండ్స్ 2013లో ఉద్యోగావకాశాల ధోరణులపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఆంగ్ల భాషా పరిజ్ఞానం, సంజ్ఞాత నైపుణ్యాల పరంగా చూస్తే 47 శాతంమంది పట్టభద్రులు ఏ ఉద్యోగాలకూ పనికిరారని తేల్చారు. ఆంగ్లంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవటం; మౌలిక విషయావగాహనలో లోపాలు వీరికి ఉద్యోగార్హతల్లో అడ్డంకిగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువుంది. గ్రామీణ, రెండోశ్రేణి పట్టణాల్లోని విద్యార్థుల మధ్య ఇంగ్లిష్, కంప్యూటర్ నైపుణ్యాల్లో అంతరం ఎక్కువుంది.

 
Comments Off on ఈ ఏటి పట్టభద్రుల్లో 47% ‘పనికి రారు

Posted by on December 26, 2013 in Uncategorized

 

వైదిక గణితంపై వర్క్‌షాప్ 27 నుంచి


హైదరాబాద్: వైదిక గణితంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను డిసెంబరు 27 నుంచి మూడురోజులపాటు నిర్వహిస్తున్నట్లు నిశ్చల్ సంస్థ డిసెంబరు 26న ఒక ప్రకటనలో తెలిపింది. వైదిక గణిత ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్న శిక్షా సంస్కృతి ఉద్ధాన్‌తో కలిసి నిశ్చల్ స్మార్ట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని కాచిగూడలో ఉన్న నరేంద్రభవన్‌లో నిర్వహిస్తారు.

 
Comments Off on వైదిక గణితంపై వర్క్‌షాప్ 27 నుంచి

Posted by on December 26, 2013 in Uncategorized

 

గురుకులాలకు మహర్దశ


కొత్త భవనాలకు రూ.40 కోట్ల నిధులు
పటాన్‌చెరు, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబాల పిల్లలు విద్యనభ్యసిస్తున్న గురుకులాలకు కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు విద్యార్థులు పడ్డ కష్టాలు తొలగనున్నాయి. భవనాలతో పాటు ఫర్నిచర్ కూడా సమకూరనుంది. నిధులు మంజూరు కావడంతో ఆరు గురుకులాల్లో త్వరలో భవనాల నిర్మాణాలు ప్రారంభించనున్నారు.
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. రెండు దశల్లో వీటిని నిర్మించనున్నారు. జిల్లాలోని ఆరు గురుకులాలకు ఇవి సమకూరనున్నాయి. చిట్కుల్ గురుకుల పాఠశాలను పూర్తిగా రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారు. ఇందులో 640 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడంతో బాలికలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. గతంలో పరిశ్రమలో పనిచేసే వారికి శిక్షణ కేంద్రంగా ఉండేది. కేంద్రాన్ని ఎత్తివేసిన తరవాత గురుకులానికి ఇచ్చారు. 1984లో ఏర్పాటు చేసినప్పటి నుంచి పాడుబడిన షెడ్లలోనే కొనసాగుతోంది. వీటిని పూర్తిగా కూలగొట్టి కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఇందుకు రూ.10 కోట్ల నిధులు మంజూయ్యాయి. భవనాలతో పాటు మంచాలు, ఫర్నిచర్, సిబ్బందికి నివాసగృహాలు కూడా రానున్నాయి. అలానే అందోలు, ములుగు, ఆల్వాల్, మెదక్, మిట్టపల్లి గురుకులాల్లో భవనాలు ఉన్నప్పటికీ వసతి సౌకర్యం లేదు. దీంతో అక్కడే సర్దుబాటు చేసుకుంటున్నారు. దీనివల్ల తరగతుల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని ఉన్నతస్థాయి అధికారులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి వసతి గదులు నిర్మించనున్నారు. ఒక్కో భవనానికి రూ.6 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.
పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు..
– సుదర్శన్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కన్వీనర్
అన్ని గురుకులాలకు కొత్త భవనాలు నిర్మించనున్నాం. అవసరమైన నిధులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద మంజూరవుతున్నాయి. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

 
Comments Off on గురుకులాలకు మహర్దశ

Posted by on December 26, 2013 in Uncategorized

 

ఒక్క అడ్మిషన్‌.. రెండు డిగ్రీలు


* ఇక్కడ మొదలెట్టి.. విదేశాల్లో పూర్తి
* ఐదేళ్లలోనే ‘పట్టాల’దారు
* కళాశాలలతో విదేశీ విశ్వవిద్యాలయాల ఒప్పందాలు
*
డ్యూయల్‌ డిగ్రీలపై పెరుగుతున్న మోజు!

ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నది పాత సామెత!
ఒక్క అడ్మిషన్‌తో రెండు డిగ్రీలన్నది నయా ధోరణి!
ఐదేళ్లలోనే డిగ్రీ, పీజీ.. రెండు పట్టాలు!
అది కూడా ఒకటి దేశీ, మరోటి విదేశీ!
ఒక్క మొబైల్‌లో రెండు సిమ్‌లన్నా ఎగబడ్డారు!
ఇప్పుడు ఒక్క అడ్మిషన్‌తో.. రెండు డిగ్రీలన్నా అంతే మోజు!
అవును.. యువతరం కొత్తదనాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తుంది!
అది సరదా అయినా.. కెరీర్‌ అయినా.. ఈతరం తీరే వేరు.
ఏమిటా రెండు డిగ్రీలు.. ఏమా కథ?

ప్రశాంత్‌ ఎంసెట్‌ రాశాడు. ఇంజినీరింగ్‌ చేసి.. విదేశాల్లో పీజీ చేయాలన్నది లక్ష్యం. అది కాస్తా ఒక్క అడ్మిషన్‌తోనే తీరింది. ఇక్కడ జేఎన్‌టీయూ, హైదరాబాద్‌లో బీటెక్‌.. బ్యాంకాక్‌ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తిచేసేలా అడ్మిషన్‌ సంపాదించాడు. ఐదేళ్లు.. ఖర్చులన్నీ కలిపి రూ.20 లక్షలు.. ఎలాంటి వీసా గొడవలు లేకుండానే తను బ్యాంకాక్‌లో చదువుకునే అవకాశం లభించింది.

       ..ఇదొక ఉదాహరణే! ఇప్పుడు యువతరం డ్యూయల్‌ డిగ్రీల వైపు పరుగులుపెడుతోంది. నాలుగేళ్లు బీటెక్‌, ఆ తర్వాత విదేశాల్లో పీజీ కోసం రెండేళ్లు.. అక్కడ సీటు సంపాదించడానికి నానా అగచాట్లు, వీసా సమస్యలు, నిర్వాహక సంస్థలతో తలనొప్పి.. ఇవేవీ లేకుండా విదేశాల్లో పీజీ సీటు లభిస్తుండడంతో విద్యార్థులు డ్యూయల్‌ డిగ్రీల వైపు దృష్టి పెడుతున్నారు.
సీటు సవాలే!
      
ఒకప్పుడు ఒకేసారి రెండు కోర్సులు చేయడమంటే అభ్యంతరం పెట్టేవాళ్లు. ఉద్యోగం కోసం వెళ్తే ఇదెలా సాధ్యమని ఎగాదిగా చూసేవాళ్లూ. విద్యా విధానం, బోధనలో వచ్చిన మార్పులు.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని.. ఒకేసారి రెండు విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు అందుకునే అవకాశం వచ్చేసింది. విదేశీ విశ్వ విద్యాలయాలు ఇక్కడ మన రాష్ట్రంలోని జేఎన్‌టీయూ, ఐఐటీ, ఐఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం.. వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో పాటు.. కొన్ని ప్రైవేటు కళాశాలలతో కూడా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. కంప్యూటర్‌ సైన్సు, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, సివిల్స్‌.. తదితర విభాగాల్లో పీజీ కోర్సుకు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో బ్రాంచీలో సుమారు 60 వరకూ సీట్లు ఉంటాయి. పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇందులో సీటు సంపాదించడం ఓ విధంగా సవాలే!
కొత్తదనం ఏమిటి?
      
కొంచెం వైవిధ్యంగా, పరిశోధనాత్మకంగా ఉండే కోర్సులు చేయాలనుకునేవారికి సరైన కోర్సు డ్యూయల్‌ డిగ్రీ. ఏయూ, జేఎన్‌టీయూ(హైదరాబాద్‌)లు స్వీడన్‌లోని బ్లెకింగె ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో చేరితే బీటెక్‌తో పాటు ఎంటెక్‌ను ఐదేళ్లలోనే పూర్తిచేయొచ్చు. సాధారణంగా విడివిడిగా చేయాలంటే కనీసం ఆరేళ్లు పడుతుంది. డ్యూయల్‌ డిగ్రీలో భాగంగా మూడున్నరేళ్లు స్థానిక విశ్వవిద్యాలయంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ) పూర్తిచేసి.. మిగతా ఏడాదిన్నర విదేశీ విశ్వవిద్యాలయంలో చదవాల్సి ఉంటుంది. వీటి కరిక్యులమ్‌ సాధారణ డిగ్రీలతో పోల్చితే భిన్నంగా ఉంటాయి. యూజీ స్థాయి విద్యార్థులు సైతం పరిశోధనల్లో పాల్గొనేలా వీటిని రూపకల్పన చేశారు. విదేశాల్లో చదవబోయే కోర్సుకు అనుగుణంగా యూజీ పాఠ్యాంశాలుంటాయి. కంప్యూటర్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, సివిల్‌, కెమికల్‌ తదితర విభాగాల్లో ఎక్కువగా విద్యార్థులు డ్యూయల్‌ డిగ్రీలను ఎంపికచేసుకుంటున్నారు. ”మా జేఎన్‌టీయూతో బ్యాంకాక్‌, స్వీడన్‌ విశ్వవిద్యాలయాలు ఒపందం కుదుర్చుకున్నాయి. ఇంటర్మీడియేట్‌ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. ఎంసెట్‌ నిబంధనలు, సెలబస్‌లే దీని ప్రవేశ పరీక్షకు ఉంటాయి. ప్రతి ఏడాది ఎంసెట్‌ పరీక్ష తర్వాత దీనికి పరీక్ష నిర్వహిస్తున్నాం” అని చెబుతున్నారు జేఎన్‌టీయూ, హైదరాబాద్‌ ప్రిన్సిపల్‌, ఎ. వినయ్‌బాబు.
ఫీజుల సంగతి!
      
సాధారణ కోర్సులతో పోల్చితే వీటి ఫీజులు ఎక్కువేనని చెప్పొచ్చు. అయితే విదేశాల్లో చదువుకుంటే అయ్యే ఖర్చంత ఉండదు. మూడున్నరేళ్లు స్థానికంగానే అభ్యాసన ఉంటుంది కాబట్టి.. ఆ మేరకు ఆర్థిక భారం తగ్గినట్లే! ఏడాదికి సుమారు రూ.రెండున్నర లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంటే ఐదేళ్ల చదువుకు రూ.12.5 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. ఇతర వసతులు, ప్రయాణ ఖర్చుల్ని చూసుకుంటే.. రూ.20 లక్షల వరకూ ఖర్చు అవ్వొచ్చు. విదేశాల్లో చదివేటప్పుడు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకునే వెసలుబాటు ఉండొచ్చు. ప్రతిభను బట్టి ఫెలోషిప్‌ కూడా అందుకోవచ్చు. బోధన, పరిశోధనల్లో అక్కడి అధ్యాపకులకు సహాయకులుగా పనిచేసే అవకాశమూ దక్కుతుంది. ప్రతిగా వేతనం ఇస్తారు. ఇవి ఆయా విద్యా సంస్థల మధ్య ఒప్పందాలను బట్టి ఉంటాయి. ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు సంబంధిత విద్యా సంస్థల అధికారులతో మాట్లాడి అవగాహన కలిగించుకోవడం మంచిది.
ఇవీ లాభాలు..
* సాధారణ డిగ్రీల కంటే డ్యూయల్‌ డిగ్రీ కోర్సులతో చాలా లాభాలే ఉంటాయి. ఐదేళ్లలోనే బ్యాచిలర్‌, పీజీ డిగ్రీలు అందుకోవచ్చు.. ఏడాది సమయం కూడా మిగులుతుంది.
* స్థానిక విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ అందిస్తే.. విదేశీ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా పొందొచ్చు. వీటికి దేశ, విదేశాల్లో గుర్తింపు ఉంటుంది. డ్యూయల్‌ డిగ్రీ కోర్సుల్లో చేరితే.. జీఆర్‌ఈ, టోఫెల్‌ వంటి పరీక్షలు రాయకుండానే విదేశాల్లో చదువుకోవచ్చు.
* చివరి ఏడాది విదేశీ విద్యార్థులతో కలిసి ప్రాజెక్టు వర్కు చేయాల్సి ఉంటుంది కాబట్టి.. కోర్సు పూర్తయ్యాక దేశ, విదేశాల్లో ఉద్యోగావకాశాలుంటున్నాయి. పరిశోధనల్లోనూ అవకాశాలెక్కువ.

 
Comments Off on ఒక్క అడ్మిషన్‌.. రెండు డిగ్రీలు

Posted by on December 26, 2013 in Uncategorized

 

రూ.10,000 కోట్లు ఖర్చుపెట్టారు


¤ విదేశాల్లోఉన్నతవిద్యకుమనవిద్యార్థులు
¤
ఇక్కడిపరిమితసీట్లేకారణం: అసోచామ్‌

కోల్‌కతా: రవి చురుకైన విద్యార్థి. ఇంటర్‌ వరకు చదివిన అన్ని తరగతుల్లోనూ మంచి మార్కులే సంపాదించాడు. ఐఐటీలో సీటు సంపాదించాలనే లక్ష్యంతో ప్రవేశ పరీక్ష రాశాడు. ర్యాంకు కూడా మంచిదే వచ్చింది. అయితే పరిమిత సీట్ల కారణంగా ప్రవేశం దక్కలేదు. దీంతో విదేశాల్లో ఆ స్థాయి విద్యను అభ్యసించేందుకు పయనమయ్యాడు. కేవలం రవి మాత్రమే కాదు.. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో సీట్లు తక్కువగా ఉండటంతో ప్రవేశం దొరకక చాలా మంది విద్యార్థులు విదేశీ బాట పడుతున్నారు. 2012-13లో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు రూ.10,000 కోట్లకు పైగా వెచ్చించారని అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌) అధ్యయనంలో వెల్లడైంది. ఉన్నత విద్యా వ్యవస్థ నిబంధనలను సరళీకరించడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి (పీపీపీ) పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని అసోచామ్‌ ప్రధాన కార్యదర్శి డి.ఎస్‌.రావత్‌ తెలిపారు. అధ్యయనంలోని ముఖ్యాంశాలు..
* ఒక ఐఐటీ విద్యార్థి సరాసరి నెలకు 150 డాలర్లు ఫీజు చెల్లిస్తుండగా.. ఆ స్థాయి విద్యకోసం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లో 2,000 – 6,000 డాలర్లు చెల్లిస్తున్నారు.
* భారత్‌లో ఉన్నత విద్యను అభ్యసించేవారు కేవలం 12 శాతంగా నమోదు కాగా.. 82 శాతంతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్‌లో 5 శాతం, చైనాలో 20 శాతం, బ్రెజిల్‌లో 24 శాతం మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
* పరిమిత సీట్ల కారణంగా ఐఐటీ, ఐఐఎం ప్రవేశ పరీక్ష రాసిన వారిలో దాదాపు 95% మంది ప్రవేశం పొందలేకపోతున్నారు. వారిలో చాలా మంది విద్యకోసం విదేశాలకు వెళుతున్నారు.
* ఉన్నత విద్యా వ్యవస్థను సరళీకరించడం ద్వారా భారత్‌కు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఈ మొత్తంతో ఇక్కడే అత్యున్నత విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేసుకోవచ్చు. తద్వారా ఇతర దేశాల విద్యార్థులకు భారత్‌ ముఖ్య గమ్యస్థానం అవుతుంది. విద్యారంగంలో లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయి.
* ప్రస్తుతం భారత్‌లో 90 కోట్ల ఉద్యోగాలున్నాయి. ఇందులో దాదాపు 90 శాతం నైపుణ్య ఆధారితానివే. విజ్ఞాన ఆధారితమైనవి 9 శాతం కాగా.. రెండింటికి సంబంధించినవి ఒక శాతం.
* పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ విద్య విషయంలో అమెరికానే ఉత్తమ గమ్యస్థానం కాగా వొకేషనల్‌ శిక్షణకు ఆస్ట్రేలియా, ఏడాది కాలం కోర్సులకు బ్రిటన్‌, వైద్య విద్యకు రష్యా, చైనా అనువుగా ఉన్నాయి. చైనాలో వైద్య విద్యను పూర్తి చేసినప్పటికీ.. భారత్‌లో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులయితే తప్ప ఇక్కడ వైద్యసేవలను ప్రారంభించకూడదు. ఉన్నత విద్యా రంగంలో పరిమిత అవకాశాల కారణంగా విలువైన వనరులను భారత్‌ కోల్పోతుందనడానికి ఇది నిదర్శనం.

 
Comments Off on రూ.10,000 కోట్లు ఖర్చుపెట్టారు

Posted by on December 26, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: