RSS

అనిశ్చితిలో ‘సెట్‌’లు

26 Dec

* విధి విధానాలపై ఏడాదిలోగా తేల్చుకోవాలి
* రెండు రాష్ట్రాలు అవగాహనకు రావాలి
*
లేదంటే జోక్యం చేసుకుంటామంటున్న కేంద్రం
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులో విద్యా సంస్థల వ్యవహారంపై చర్చ జరుగుతోంది. విభజన జరిగిన నాటి నుంచి ఏడాది లోగా ఉభయ రాష్ట్రాలు విధి విధానాలపై ఓ నిర్ణయానికి రాలేని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ముసాయిదాలో ఉభయ రాష్ట్రాల్లోనూ ప్రస్తుత ఉన్న విధానాలే ఐదేళ్లకు మించకుండా అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి పంపిన బిల్లులో పదేళ్లకు మించకుండా అని మార్చారు. దానికి అదనంగా కేంద్రం మరో మెలిక పెట్టింది. రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన ఏడాదిలోపు ఉభయ రాష్ట్రాలు సంయుక్తంగా విధి విధానాలను రూపొందించుకోవాలని చెప్పింది. రెండు రాష్ట్రాల్లో విద్యా సంస్థల కార్యకలాపాలు ఎలా ఉండాలన్న దానిపై ఏడాదిలోగా నిర్ణయించుకోకుంటే కేంద్రమే జోక్యం చేసుకుంటుందని పేర్కొంది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై స్పష్టత లోపించిందని విద్యావేత్తలు అంటున్నారు.
ఉన్నత విద్యా మండలి ద్వారా ఏటా ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, మెడిసిన్‌), ఐసెట్‌ (ఎంబీఏ, ఎంసీఏ), ఎడ్‌సెట్‌ (బీఎడ్‌), లాసెట్‌(లా), పీజీఈసెట్‌ (ఎంటెక్‌), ఈసెట్‌ (బీటెక్‌లో ద్వితీయ సంవత్సరానికి ప్రవేశాలు), పీసెట్‌ (వ్యాయామ విద్య) ద్వారా ప్రవేశాలు జరుగుతున్నాయి, ఓయూ, ఎస్వీయూ, ఏయూ పరిధిలో స్థానిక, స్థానికేతర కోటా కింద ఈ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. దీని ప్రకారమే ఉన్నత విద్యా మండలి 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ప్రవేశ పరీక్షల తేదీలను డిసెంబరు 26న వెల్లడించబోతుంది. బీటెక్‌ కోర్సు కాల వ్యవధి నాలుగేళ్ల వరకు ఉంది. ఎంబీఏ, ఎంసీఏ, ఇతర కోర్సుల వ్యవధి రకరకాలుగా ఉంది. ఇరు ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించుకోవాలని కేంద్రం చెప్పడంతో భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో పదో షెడ్యూలులో పేర్కొన్న శిక్షణ సంస్థలు, కేంద్రాల జాబితాలో విద్యాశాఖ పరిధిలోనివి కూడా ఉన్నాయి. ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్య శిక్షణ సంస్థ(ఉన్నత విద్యా శాఖ పరిధిలో), స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ, ఇంటర్‌ బోర్డు, ఏపీ ఓపెన్‌ స్కూలు సొసైటీ, గురుకుల విద్యాలయాల సంస్థ (విద్య, మాధ్యమిక విద్యాశాఖ) ఉన్నాయి. విభజన జరిగిన నాటి నుంచి ఏడాదిలోగా ఇవన్నీ విడివిడిగా తమ కార్యకలాపాలు కొనసాగించాలి. దీనికి అనుగుణంగానే ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలు, ఇతర కార్యకలాపాలపై స్పష్టత వస్తే 2014-15 విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తామేమీ చెప్పలేమని, వచ్చే ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.

 
Comments Off on అనిశ్చితిలో ‘సెట్‌’లు

Posted by on December 26, 2013 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: