RSS

పెరిగిన ముస్లిం బాలల బడిబాట నమోదు

07 Jan

* కేంద్ర మంత్రి పల్లంరాజు
న్యూఢిల్లీ: దేశంలో ముస్లింల జనాభాతో పోలిస్తే..పాఠశాలల్లో ఆ వర్గం బాలల నమోదు పెరిగిందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు తెలిపారు. 2006-07లో ప్రాథమిక పాఠశాలల్లో 9.4 శాతం ఉన్న ముస్లిం బాలల నమోదు 2012-13లో 14.2 శాతానికి, ప్రాథమికోన్నత స్థాయిలో 7.2 శాతం నుంచి 12.1 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. మైనారిటీల విద్యకు సంబంధించి జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీఎంఈ) వార్షిక సమావేశంలో జనవరి 6న ఆయన మాట్లాడారు. 20 శాతం అంతకన్నా ఎక్కువ ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో 270 ఆదర్శ (మోడల్‌) పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలం (2012-17)లో ఏర్పాటుకు ప్రతిపాదించిన 378 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో.. 196 విద్యాలయాలను ముస్లింలు ఎక్కువగా ఉన్న, ప్రత్యేక హోదా జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు రాజు వెల్లడించారు. బడి బయట ఉన్న ముస్లిం బాలలకు విద్య కల్పించేందుకు సర్వశిక్షాఅభియాన్‌లో మదర్సాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు.
”ఈ విద్యా సంవత్సరంలో మదర్సాల్లోని 17.3 లక్షల మంది విద్యార్థులకు అభియాన్‌లో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, 40 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ, 8,325 మదర్సాలకు పాఠశాల నిధులు” కేటాయించినట్లు పల్లంరాజు తెలిపారు. నాణ్యమైన విద్య అందించేందుకు 2012-13లో 9,905 మదర్సాల్లో 23,146 మంది ఉపాధ్యాయులను నియమించామన్నారు.

 
Comments Off on పెరిగిన ముస్లిం బాలల బడిబాట నమోదు

Posted by on January 7, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: