RSS

ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోగాల లేమి!

08 Jan

ఈనాడు, గుంటూరు: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు ప్రతిభ కనబరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరం, ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం సైన్సు సబ్జెక్టుల సిలబస్‌ను మార్పు చేసింది. విద్యార్థుల సన్నద్ధతకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్థాయికి మించి ఉన్న సిలబస్‌ అగ్నిపరీక్షలా మారింది. ప్రయోగాల నిర్వహణకు సంబంధించి అవసరమైన కొన్ని సామగ్రి మార్కెట్లో లభ్యమవడం లేదు. రసాయన, భౌతిక, వృక్షశాస్త్రాల్లో కొన్ని పాఠ్యాంశాల ప్రయోగాలకు స్థానికంగా సామగ్రి అందుబాటులో లేకపోవడంతో చెన్నై, హైదరాబాద్‌, ముంబై వంటి ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. విజయవాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల నుంచి కూడా ప్రయోగాలకు అవసరమైన సామగ్రిని తెచ్చుకోవాల్సి వస్తోంది.
ప్రత్యామ్నాయమేదీ ? : ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రంలో ప్రమేయ సమూహాన్ని నిర్ధారించడానికి ఇథైల్‌ ఆల్కహాల్‌ అవసరం. ఇది ప్రయోగశాల్లో ద్రావణిగా ఉపయోగపడుతుంది. లైసెన్సు లేకుండా దీని విక్రయాలను నిర్వహించరాదని ప్రభుత్వం నిషేధించింది. ఆంక్షల దృష్ట్యా ఇది లభ్యం కావడం లేదు. దీంతో ఈ ప్రయోగాన్ని విద్యార్థులకు పరిచయం చేయలేని పరిస్థితి పలు కళాశాలల్లో నెలకొంది.
* బేరియమ్‌ బ్రోమైడ్‌, అయోడైడ్‌ లవణాల ప్రయోగానికి విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇది వూపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది.
* వృక్షశాస్త్రంలో పైసమ్‌ నిర్ధారణకు మొలకెత్తిన బఠాని గింజలు అవసరం. ఇవి అన్ని సీజన్లలో లభ్యంకావు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి జరగబోతున్నాయి. ఆ సమయంలో రాయలసీమ జిల్లాల్లో ఈ గింజలు దొరకవని అధ్యాపకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయంలోనే ఇవి లేకపోతే ప్రయోగాలు ఎలా చేయించాలని తలలు పట్టుకుంటున్నారు.
* లిల్లీఏస్‌ అనే కుటుంబ నిర్ధారణకు ఉల్లి వేరు అవసరం. ఇది లభ్యంకాక కొన్ని కళాశాలల్లో బోటనీ విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం లేదు. ఫేబ్‌సే అనే ప్రయోగానికి వేరుసెనగ, జనుము మొక్కలు అవసరం. వీటి లభ్యత అంతంత మాత్రంగానే ఉంటోందని చెబుతున్నారు. వీటికి అత్యధికంగా ఆరు మార్కులు కేటాయించారు.
* భౌతికశాస్త్రంలో ప్రయోగాలకు ట్రాన్సిస్టర్‌, స్ప్రింగ్‌ కానిస్టెంట్‌ వంటి రెండు పరికరాలు తప్పనిసరి. వీటి ఖరీదు రూ.6 వేలు.
* యాసిడ్‌ దుర్వినియోగం నేపథ్యంలో ప్రిన్సిపాళ్ల ధ్రువీకరణతో పరిమితంగా లేబొరేటీలు అందజేస్తున్నాయి.
నిధులకు ససేమిరా.. మారిన సిలబస్‌ ప్రకారం ప్రయోగాల నిర్వహణకు రూ.30-40 వేలు అవసరం. అయితే పాత కళాశాలల్లో మినహా కొత్త వాటిలో అంత మొత్తంలో నిధులు ఉండని పరిస్థితి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వసూలైన ప్రత్యేక ఫీజుల నుంచే ప్రయోగ ఖర్చులను అధిగమించాలి. ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు తక్కువగా ఉండడంతో ప్రయోగాలకు అవసరమైన నిధులు కూడా కొన్ని కళాశాలల్లో ఉండడం లేదని ఓ ప్రిన్సిపల్‌ తెలిపారు. రాష్ట్రంలో 500లకు పైగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా వీటిలో సగం కాలేజీల్లో నిధుల కొరత ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక్కో సబ్జెక్టులో 20 ప్రాక్టికల్స్‌ ఉంటాయి. వీటికి 100 తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇన్ని ప్రయోగాలకు చాలా ఖర్చవుతుంది.

 
Comments Off on ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోగాల లేమి!

Posted by on January 8, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: