RSS

ఐటీకి భవిష్యత్‌ బంగారమే

09 Jan

దిగ్గజ సంస్థల విస్తరణ బాట
* ఇంక్యుబేషన్‌ కేంద్రాల్లో కొత్త సంస్థలు
* సానుకూల సూచనలు అంటున్న నాస్‌కామ్‌ అధ్యక్షుడు
ఈనాడు – హైదరాబాద్‌: రాబోయే రోజుల్లో ఐటీ రంగం వృద్ధి మరింత బాగుంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం అవసరం, అనేక రంగాల్లో ఐటీ వ్యాప్తి పెరగడం వంటివి ఇందుకు దోహదపడనున్నాయి. దిగ్గజ సంస్థలు విస్తరణ పథంలో ఉండగా, కొత్తగా వస్తున్న కంపెనీలు తక్కువ సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. కొత్త సంస్థల ప్రారంభానికి ఉన్నత విద్యావంతులు, అనుభవజ్ఞులు కూడా ఉత్సాహం చూపించడం దేశీయ ఐటీ రంగ భవితకు నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. నాస్‌కామ్‌ కొత్త అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దేశీయ ఐటీ రంగ వృద్ధి గతంలో ఆశించిన దానికన్నా అధికంగా ఉంటుందనే నమ్మకం పెరుగుతోంది. 2012-13లో దేశీయ ఐటీ ఎగుమతులు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 10.6 శాతం వృద్ధిని సాధిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12- 14% మేర వృద్ధి లభిస్తుందని గతంతో నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్‌కామ్‌) అంచనా వేసింది. ఇప్పుడీ అంచనాలను సవరించి, ఈ రంగం మరింత మెరుగైన గణాంకాలు నమోదు చేయవచ్చని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు గల కారణాలనూ విశ్లేషిస్తున్నారు.
కొత్త సంస్థలతో సెంటిమెంటు పటిష్టం
వేల మంది సిబ్బందితో కార్యకలాపాలు నెలకొల్పే బహుళ జాతి సంస్థలు ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి క్రమంగా విస్తరిస్తున్నాయి కూడా. ఇప్పుడు కొత్తగా విదేశాల నుంచి వస్తున్న సంస్థలు ఎక్కువగా వినూత్న ఐటీ ఉత్పత్తులు/సేవల్లో నిమగ్నమైనవే. ఇవి కార్యకలాపాలను తక్కువ మంది సిబ్బందితోనే మొదలుపెడుతున్నాయి. విదేశాల నుంచి కొత్త ఐటీ సంస్థలు దేశంలో కార్యకలాపాలు ఆరంభించడం సానుకూల దృక్పథం ఇనుమడించేందుకు ఉపకరిస్తుందని, అధిక వృద్ధి మాత్రం భారీగా విస్తరణ పథంలో ఉన్న దిగ్గజ సంస్థల నుంచే వస్తుందని పేర్కొంటున్నారు. దేశీయ ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు అధికంగా లభించే అమెరికాలో పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో పాటు దేశీయంగా ఐటీ వినియోగం విభిన్న రంగాల్లో పెరగడం కొత్త ఐటీ సంస్థల ప్రారంభానికి ఉత్సాహాన్నిస్తోంది.
12-18 నెలల అవసరాలకు అనుగుణంగా
దిగ్గజ సంస్థలు విస్తరణపై దృష్టి సారించాయి. కొత్తగా విశాల ఆవరణల్లో వేల మంది నిపుణులు పనిచేసేందుకు అనువుగా భవన సముదాయాలు నిర్మిస్తున్నాయి. వీటిల్లో కార్యాకలాపాలు ఆరంభమైతే, వృద్ధి ఇంకా జోరు అందుకొంటుంది. సాధారణంగా ఐటీ సంస్థలు రాబోయే ఏడాది, ఏడాదిన్నర కాలం అవసరాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు దిగుతుంటాయి. రాబోయే 5-10 ఏళ్లలో కార్యకలాపాల విస్తరణకు సరిపడేలా వీటిని నిర్మిస్తున్నా, వినియోగం మాత్రం సమీప కాలంలోనే ఉంటుంది. ఈ విధంగా చూస్తే హైదరాబాద్‌లో టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, యాక్సెంచర్‌ వంటి సంస్థలు ఇదే పంథాలో ఉన్నాయి. పోచారంలో ఇన్ఫోసిస్‌ నూతన ప్రాంగణం ఇప్పటికే వినియోగంలోకి వచ్చింది. కొన్ని సంస్థలు వివిధ ప్రాంతాల్లోని కార్యకలాపాలను ఒకే సముదాయంలోకి తీసుకువచ్చేందుకూ ఇలా చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, ఇతర సంస్థలు నిర్వహిస్తున్న ఇంక్యుబేషన్‌ కేంద్రాల్లో కొత్త ఐటీ సంస్థల ఏర్పాటు పుంజుకొంది. హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో ఇప్పటికే 50 కొత్త సంస్థలు కొలువుదీరితే, అయిదారు నెలల క్రితమే బిట్స్‌ (హైదరాబాద్‌)లో నెలకొల్పిన ఇంక్యుబేషన్‌ కేంద్రంలో ఇప్పటికే 4-5 సంస్థలు శ్రీకారం చుట్టాయి. ఐఐటీ (హైదరాబాద్‌)లోనూ ఐటీతో పాటు లైఫ్‌ సైస్సెస్‌ రంగానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థలు ఏర్పాటవుతున్నాయి. బయో టెక్నాలజీ రంగంలో పరిశోధన-అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే వేసవికి ఐఐటీ కొత్త ఆవరణ సిద్ధం అయ్యాక, మరిన్ని కొత్త సంస్థలకు చోటిచ్చేందుకు ఐఐటీ సిద్ధంగా ఉంటుంది. గత ఏడాదే ఆరంభమైన టై (ది ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌) ఇంక్యుబేషన్‌ కేంద్రం 2014లో మరింత ముందంజ వేస్తుందని చెబుతున్నారు.
వివిధ రంగాల్లో ఐటీ సేవల వినియోగం
విద్య, రిటైల్‌, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు వంటి వివిధ రంగాల్లో సామాజిక మాధ్యమాలు, క్లౌడ్‌, అనలిటిక్స్‌, మొబిలిటీ సాంకేతికతను వినియోగించడం పెరుగుతోంది. కొత్త కంపెనీలు ఐటీ ఉత్పత్తులను తీసుకురాకపోయినా, ఉత్పత్తి లాంటి ఐటీ సేవలలో నిమగ్నం అవుతున్నాయి. ఉదాహరణకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటివి ఐటీ ఉత్పత్తులను అందించే సంస్థలు కాదు. కానీ ఇలాంటి విభిన్న తరహా సంస్థలు అధికంగా వెలుస్తున్నాయి. రాష్ట్రంలోని ఐటీ సంస్థల వార్షికోత్సవంలో చూస్తే ఏటా 100 వరకు కొత్త కంపెనీలు తమ సేవలు/ఉత్పత్తులను చూపుతుంటే 2-3 ఆకర్షణీయంగా ఉండేవని, 2013 చివరిలో మాత్రం 10-15 కంపెనీలు అందరినీ ఆకర్షించాయని ఇట్స్‌ఏపీ ఉపాధ్యక్షుడు రమేశ్‌ లోగనాధన్‌ ‘ఈనాడు’తో చెప్పారు. మిగిలిన ప్రధాన ఐటీ నగరాల్లోనూ కొత్త ఐటీ సంస్థలకు ఉత్సాహభరిత వాతావరణం నెలకొందని నాస్‌కామ్‌ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే 108 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.70 లక్షల కోట్ల) స్థాయిలోని దేశీయ ఐటీ రంగం 2020 నాటికి 300 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.18.60 లక్షల కోట్ల)కు చేరడం కష్టమేమీ కాదు.

Advertisements
 
Comments Off on ఐటీకి భవిష్యత్‌ బంగారమే

Posted by on January 9, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: