RSS

Daily Archives: January 16, 2014

162 ఆప్కో పోస్టుల భర్తీకి 20లోగా ప్రకటన


* మంత్రి ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంఘం(ఆప్కో)లో 162 పోస్టుల భర్తీ ప్రక్రియను సత్వరమే చేపట్టాలని చేనేత శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ జనవరి 16న ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 20లోపు నోటిఫికేషన్ జారీచేయాలని చెప్పారు. శాఖ ముఖ్యకార్యదర్శి, సంచాలకుడు, ఆప్కో ఎండీ తదితరులతో ఆయన గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆప్కో పోస్టులను ఆరు నెలలుగా భర్తీ చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అన్ని కోణాల్లో పరిశీలించి, పోస్టుల భర్తీకి అనుమతించినట్లు తెలిపారు. అయినా భర్తీలో జాప్యమెందుకని ప్రశ్నించారు. భర్తీలో జోనల్ విధానం పాటించాలని, ఖాళీలను అన్ని ప్రాంతాలకు సమానంగా విభజించాలని సూచించారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.

Advertisements
 
Comments Off on 162 ఆప్కో పోస్టుల భర్తీకి 20లోగా ప్రకటన

Posted by on January 16, 2014 in Uncategorized

 

ఈ ఉద్యోగాలన్నీ నిండేవేనా?


* వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు స్వల్ప వ్యవధిలో నియామకాలతో పరేషాన్‌
* రెండింట్లో ఉద్యోగం సంపాదించి ఒకదాన్ని వదిలేసే వాళ్లే ఎక్కువ
* గ్రూప్‌-1, 2 అభ్యర్థులకూ సరదా ప్రయత్నం
* అయ్యే ఖాళీలకు మళ్లీ నోటిఫికేషన్‌ వేయాల్సిందే
ఈనాడు – హైదరాబాద్‌: వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ ప్రకటనల జారీలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం ఉద్యోగార్థులను ముప్పతిప్పలు పెడుతోంది. లక్షల మంది పోటీ పడుతున్నా ఈ ఉద్యోగాలన్నీ భర్తీ అవుతాయా? ఎంపికైన వారు ఆ ఉద్యోగాల్లో ఎంతకాలం ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఉద్యోగాలు పొందిన వారు స్వల్ప కాలంలోనే మరో ఉద్యోగానికి వెళ్లిపోతున్నందున ఖాళీలు అనివార్యం అవుతున్నాయి. ఇలాంటి వాటిని భవిష్యత్తులో జారీచేసే ప్రకటన (క్యారీ ఫార్వర్డ్‌) ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. దాంతో వీఆరోవో, పంచాయతీ కార్యదర్శి పోస్టులు మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు ఉద్యోగాల నియామకాల ప్రకటనలు స్వల్ప వ్యవధిలో జారీ కావడమే ఈ పరిస్థితికి కారణం. ఈ రెండు పరీక్షలకు ఫిబ్రవరిలో 20 రోజుల వ్యవధిలో రాత పరీక్షలు జరగబోతున్నాయి. వీఆరోవో పోస్టులకు 11 లక్షల దరఖాస్తులు రాగా.. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు 4-5 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. వీఆర్‌వోకు ఇంటర్‌, పంచాయతీ కార్యదర్శికి డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనలపై ఆశలు పెట్టుకోని వేలమంది రెండేళ్లుగా ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శుల ప్రకటనలు వెలువడ్డాయి. దాంతో గ్రూపు-1, గ్రూపు-2, అధ్యాపకులు, ఇతర ముఖ్య ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారు కూడా వీటికి పోటీ పడుతున్నారు. మెజారిటీ ఉద్యోగాలను వారే దక్కించుకోనున్నారు. చేరేది మాత్రం అనుమానమే. తాజా నోటిఫికేషన్ల ద్వారా 1657 వీఆర్‌వో, 2677 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష ద్వారా అర్హత సాధించిన వారి జాబితాలను జిల్లా కలెక్టర్‌ కార్యాలయం విడివిడిగా స్వల్ప వ్యవధిలోనే ప్రకటించనుంది. తొలుత వీఆర్‌వో, తర్వాత పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. రెండింట్లో ఉద్యోగం సంపాదించే వారు ఒక పోస్టును వదులుకుంటారు. గ్రూప్‌ పరీక్షల ఆశావహులు ఈ ఉద్యోగాలు సాధించినా ఏపీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని చేరకుండా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు గతంలోనూ ఎదురైనా ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు.
ఏపీపీఎస్సీ 2011లో గ్రూపు-2, గ్రూపు-4, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌, స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌, ఇతర ఉద్యోగాల భర్తీకి ఒకేసారి ప్రకటనలు జారీ చేసింది. గ్రూపు-2, గ్రూపు-4, మరికొన్ని పరీక్షలు జులై నుంచి ఆగస్టు మధ్య జరిగాయి. డీఎస్సీ రాతపరీక్షలు సైతం ఆగస్టులోనే జరిగాయి. డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగ ప్రకటనలు వెలువడున్నందున ఒకే అభ్యర్థి వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. గ్రూపు-4 ఉద్యోగాలకు ఎంపికైన వారు గ్రూపు-2 ఉద్యోగాలకు వెళ్లిపోయారు. డిగ్రీ, బీఎడ్‌ అర్హతతో జరిగే స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌, అధ్యాపకుల పోస్టుల భర్తీలోనూ ఇటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. డీఎస్సీ-2012 అనుసరించి ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారు సైతం గ్రూపు-2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇలాంటి పరిస్థితులను పూరిస్థాయిలో నివారించ లేకున్నా.. ఉద్యోగ ప్రకటనల జారీలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ పని చేయదలచుకున్న వారికే ఉద్యోగాలు దొరుకుతాయి. మానవ వనరులు పూర్తి స్థాయిలో ఉంటే ఆయా శాఖల కార్యకలాపాలూ వేగంగా జరుగుతాయి. యూపీఎస్సీ సివిల్స్‌ నోటిఫికేషన్‌ జారీలో ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉద్యోగుల వలసలను నివారించే చర్యల్లో భాగంగానే కేలండర్‌ను రూపొందించుకొని ఉద్యోగాలను భర్తీచేయాలని ప్రభుత్వం 2012 డిసెంబరులో ఆదేశాలు జారీ చేసింది. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

 
Comments Off on ఈ ఉద్యోగాలన్నీ నిండేవేనా?

Posted by on January 16, 2014 in Uncategorized

 

పుస్తకాలు చదవండి.. మార్పును స్వాగతించండి..


హైదరాబాద్‌: మీ మెదడు ఆలోచన విధానాలు ఎప్పుడూ ఒకేలా ఉంటున్నాయా? ఎలాంటి మార్పు కనబడకపోతే పుస్తకాలు, నవలలు చదవడం ద్వారా మీ మెదడు ఆలోచన విధానాలను మార్చుకోవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. పలువురు పరిశోధకులు వాషింగ్టన్‌లోని ఎమోరీ విశ్వవిద్యాలయానికి చెందిన డిగ్రీ విద్యార్థులపై చేసిన పరిశోధనల్లో ఈ నూతన విషయాలు వెల్లడైనట్లు తెలిపారు. ఎప్పుడూ తమ పాఠ్య పుస్తకాలను మాత్రమే చదివే విద్యార్థులకు కొన్ని నవలలు ఇచ్చి చదవమనడం ద్వారా వారు ఆ నవలలోని సారాంశాన్ని గ్రహించి తమ ఆలోచన విధానంతో పాటు వ్యవహారశైలిలోనూ మార్పు చెందారని వారు వెల్లడించారు. పోంపి-2013 అనే ఇటలీ నవలను చదవడం ద్వారా ఎంతో మార్పు చెందినట్లు వారు తెలిపారు. 19 మంది విద్యార్థులు నవలను చదవడం ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత వారికి జరిపిన స్కానింగ్‌ పరీక్షలో అనేక మార్పులను గమనించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. విద్యార్థులపై తొమ్మిది రోజులు జరిపిన పరిశోధనల ద్వారా ఎంతో పరిణతి చెందడమే కాకుండా చదువుపట్ల, ఆలోచన విధానం పట్ల ఎంతో వృద్ధిని సాధించినట్లు తెలిపారు. వీరికి అంతకు ముందు పుస్తుకాలను, నవలలను చదవడంపై ఏ మాత్రం ఆసక్తి ఉండేది కాదని తమ పరిశోధనలో వెల్లడైనట్ల న్యూరో సైంటిస్టు గ్రేగోరి బెర్న్స్‌ తెలిపారు. ప్రస్తుతం వారి బ్రెయిన్‌ కనెక్టివిటి బాగా వృద్ధి సాధించినట్లు తెలిపారు. వీరు ఇలాగే పుస్తకాలు, నవలలను చదవితే అనేక అద్భుత ఫలితాలను సాధించగలరని ఆయన పేర్కొన్నారు.

 
Comments Off on పుస్తకాలు చదవండి.. మార్పును స్వాగతించండి..

Posted by on January 16, 2014 in Uncategorized

 

క్యాట్‌లో తెలుగు తేజాలు


క్యాట్‌లో తెలుగు తేజాలు

ఆల్‌ ఇండియా టాపర్లుగా 8 మంది
నలుగురు మన రాష్ట్రానికి చెందినవారే
వీరందరికీ 100 పర్సంటైల్‌ స్కోరు
ఈనాడు- హైదరాబాద్‌, వరంగల్‌
ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఉద్దేశించిన సాధారణ ప్రవేశ పరీక్ష (క్యాట్‌) 2013లో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. 2014లో ప్రవేశాలు కల్పించేందుకు గత ఏడాది నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇందులో ఆల్‌ ఇండియా టాపర్లుగా మొత్తం 8 మంది నిలిచినట్టు క్యాట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రోహిత్‌ కుమార్‌ తెలిపారు. వీరు 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారని వివరించారు. వీరంతా అబ్బాయిలేనని చెప్పారు. అందులో ఆరుగురు ఐఐటీల్లో చదివినవారని పేర్కొన్నారు. ఎనిమిది మంది టాపర్లలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఉండటం విశేషం. ఒకరు ఢిల్లీకి చెందినవారు కాగా మిగతా ముగ్గురు ముంబయి వాసులు. పదిమందికి 99.9 పర్సంటైల్‌ లభించింది. వీరిలో ఒక అమ్మాయి ఉంది. పరీక్షా ఫలితాలను, వారికి వచ్చిన పర్సెంటైల్‌లను మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఈ ఏడాది చివరివరకూ అవి అందుబాటులో ఉంటాయి.
మన రాష్ట్ర విద్యార్థుల ప్రతిభ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కస్తూరి తేజస్వి (జగిత్యాల, కరీంనగర్‌ జిల్లా), పి.కృష్ణ (హైదరాబాద్‌), టి.శివసూర్యతేజ (సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా), ఐ.కుమార్‌ కార్తిక్‌ (విజయవాడ, కృష్ణా జిల్లా)కు 100 పర్సెంటైల్‌ లభించింది.
కస్తూరి తేజస్వి ప్రస్తుతం చెన్నైలోని ఐఐటీలో ‘డ్యుయల్‌ డిగ్రీ’ స్కీం కింద బీటెక్‌ (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌), ఎంటెక్‌ (మైక్రో ఎలక్ట్రానిక్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌) చివరి సంవత్సరం చదువుతున్నాడు. తేజస్వి తండ్రి కస్తూరి వామన్‌బాబు వరంగల్‌ జిల్లా సహకార శాఖలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా, తల్లి స్వర్ణరేఖ హైదరాబాద్‌లోని సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. పి.కృష్ణ హైదరాబాద్‌లోనే విద్యను అభ్యసించి ప్రస్తుతం ముంబయి ఐఐటీలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఎక్కడ చేరాలన్నదానిపై ఇంకా ఓ అవగాహనకు రాలేదని అతడు చెప్పాడు.
టి.శివసూర్యతేజ హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడు ఇంజినీరింగ్‌ విద్యను జేఎన్టీయూ అనంతపురంలో అభ్యసించాడు. లెక్కలకు సంబంధించి కాన్సెప్ట్‌పై దృష్టి సారించి, ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా పరీక్షించడం తన విజయానికి కారణమని శివ తెలిపాడు.
15వేల మందికి కాల్‌లెటర్లు?
దేశవ్యాప్తంగా 1.74 లక్షల మంది విద్యార్థులు క్యాట్‌ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షను 2013 అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 11 వరకు నిర్వహించారు. ఇండోర్‌లోని ఐఐఎం దీన్ని నిర్వహించింది. 11 ఐఐఎంల్లో 3335 సీట్లు ఉన్నాయి. కిందటేడాది కంటే వంద సీట్లు ఈ ఏడాది పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఐఎంల నుంచి 15వేల మందికిపైగా విద్యార్థులకు కాల్‌లెటర్లు రావచ్చునని భావిస్తున్నారు. స్కోరు కార్డుకు సంబంధించిన ప్రింటెడ్‌ కాపీని అభ్యర్థులు భద్రపరచుకోవాలని పరీక్ష నిర్వాహకులు తెలిపారు.

 
Comments Off on క్యాట్‌లో తెలుగు తేజాలు

Posted by on January 16, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: