RSS

క్యాట్‌లో తెలుగు తేజాలు

16 Jan

క్యాట్‌లో తెలుగు తేజాలు

ఆల్‌ ఇండియా టాపర్లుగా 8 మంది
నలుగురు మన రాష్ట్రానికి చెందినవారే
వీరందరికీ 100 పర్సంటైల్‌ స్కోరు
ఈనాడు- హైదరాబాద్‌, వరంగల్‌
ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు, ఇతర బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఉద్దేశించిన సాధారణ ప్రవేశ పరీక్ష (క్యాట్‌) 2013లో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. 2014లో ప్రవేశాలు కల్పించేందుకు గత ఏడాది నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇందులో ఆల్‌ ఇండియా టాపర్లుగా మొత్తం 8 మంది నిలిచినట్టు క్యాట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రోహిత్‌ కుమార్‌ తెలిపారు. వీరు 100 పర్సంటైల్‌ స్కోరు సాధించారని వివరించారు. వీరంతా అబ్బాయిలేనని చెప్పారు. అందులో ఆరుగురు ఐఐటీల్లో చదివినవారని పేర్కొన్నారు. ఎనిమిది మంది టాపర్లలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఉండటం విశేషం. ఒకరు ఢిల్లీకి చెందినవారు కాగా మిగతా ముగ్గురు ముంబయి వాసులు. పదిమందికి 99.9 పర్సంటైల్‌ లభించింది. వీరిలో ఒక అమ్మాయి ఉంది. పరీక్షా ఫలితాలను, వారికి వచ్చిన పర్సెంటైల్‌లను మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఈ ఏడాది చివరివరకూ అవి అందుబాటులో ఉంటాయి.
మన రాష్ట్ర విద్యార్థుల ప్రతిభ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కస్తూరి తేజస్వి (జగిత్యాల, కరీంనగర్‌ జిల్లా), పి.కృష్ణ (హైదరాబాద్‌), టి.శివసూర్యతేజ (సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా), ఐ.కుమార్‌ కార్తిక్‌ (విజయవాడ, కృష్ణా జిల్లా)కు 100 పర్సెంటైల్‌ లభించింది.
కస్తూరి తేజస్వి ప్రస్తుతం చెన్నైలోని ఐఐటీలో ‘డ్యుయల్‌ డిగ్రీ’ స్కీం కింద బీటెక్‌ (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌), ఎంటెక్‌ (మైక్రో ఎలక్ట్రానిక్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌) చివరి సంవత్సరం చదువుతున్నాడు. తేజస్వి తండ్రి కస్తూరి వామన్‌బాబు వరంగల్‌ జిల్లా సహకార శాఖలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా, తల్లి స్వర్ణరేఖ హైదరాబాద్‌లోని సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. పి.కృష్ణ హైదరాబాద్‌లోనే విద్యను అభ్యసించి ప్రస్తుతం ముంబయి ఐఐటీలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఎక్కడ చేరాలన్నదానిపై ఇంకా ఓ అవగాహనకు రాలేదని అతడు చెప్పాడు.
టి.శివసూర్యతేజ హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడు ఇంజినీరింగ్‌ విద్యను జేఎన్టీయూ అనంతపురంలో అభ్యసించాడు. లెక్కలకు సంబంధించి కాన్సెప్ట్‌పై దృష్టి సారించి, ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా పరీక్షించడం తన విజయానికి కారణమని శివ తెలిపాడు.
15వేల మందికి కాల్‌లెటర్లు?
దేశవ్యాప్తంగా 1.74 లక్షల మంది విద్యార్థులు క్యాట్‌ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షను 2013 అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 11 వరకు నిర్వహించారు. ఇండోర్‌లోని ఐఐఎం దీన్ని నిర్వహించింది. 11 ఐఐఎంల్లో 3335 సీట్లు ఉన్నాయి. కిందటేడాది కంటే వంద సీట్లు ఈ ఏడాది పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఐఎంల నుంచి 15వేల మందికిపైగా విద్యార్థులకు కాల్‌లెటర్లు రావచ్చునని భావిస్తున్నారు. స్కోరు కార్డుకు సంబంధించిన ప్రింటెడ్‌ కాపీని అభ్యర్థులు భద్రపరచుకోవాలని పరీక్ష నిర్వాహకులు తెలిపారు.

Advertisements
 
Comments Off on క్యాట్‌లో తెలుగు తేజాలు

Posted by on January 16, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: