RSS

Daily Archives: January 18, 2014

ప్రాథమిక అంశాలపై అవగాహనే ప్రధానం


ప్రాథమిక అంశాలపై అవగాహనే ప్రధానం

* క్యాట్ 2014 టాపర్ తోటకూర శివసూర్య తేజ
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ( ఐఐఎం)లు, ఇతర ప్రఖ్యాత బిజినెస్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఎంబీఏ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)లో ర్యాంక్ సాధించడం అంత సులభం కాదని చాలామంది భావిస్తుంటారు. కానీ సబ్జెక్టు ప్రాథమిక భావనలపై పూర్తి అవగాహన పెంచుకుంటే క్యాట్ రాయడం, టాపర్‌గా నిలవడం కష్టమేమీ కాదని అంటున్నారు క్యాట్- 2014 టాపర్ తోటకూర శివసూర్య తేజ.
ఐఐఎంలలో 2014లో ప్రవేశాలు కల్పించేందుకు 2013లో నిర్వహించిన క్యాట్ ఫలితాలు జనవరి రెండో వారంలో వెలువడ్డాయి. వీటిలో 100 పర్సెంటైల్‌తో టాపర్లుగా 8 మంది నిలిచారు. వారిలో ఒకరుగా రాణించిన శివసూర్య తేజ ‘ఈనాడుతో పంచుకున్న పలు విశేషాలు…
మీ కుటుంబ వివరాలు చెప్పండి?
జ. నాన్నగారు సాయిరామ్‌కృష్ణ తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అమ్మ గంగాభవాని గృహిణి. తమ్ముడు అభిషేక్ చెన్నైలోని టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
మీ విద్యాభ్యాసం?
జ. నేను 7వ తరగతి వరకు సామర్లకోటలోనే చదివాను. 8 నుంచి ఇంటర్ వరకు కాకినాడలో చదివాను. ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. టెన్త్‌లో 92.2 శాతం, ఇంటర్లో 95.7 శాతం మార్కులు సాధించాను. డిగ్రీ బీటెక్ (కంప్యూటర్ సైన్స్) కోర్సును అనంతపురంలోని జేఎన్‌టీయూలో చేశాను. 81.5 శాతం మార్కులు వచ్చాయి.
ఇప్పుడు అందరూ సివిల్స్ దారిపడుతుంటే మీరు క్యాట్ పరీక్షే ఎందుకురాయాలనుకున్నారు?
జ. నాకు చిన్నప్పటినుంచి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్‌లో మంచి పునాది పడటానికి మా తండ్రి ప్రోత్సాహం బాగా ఉండేది. దాంతో పలుసార్లు పోటీపరీక్షల్లో మంచి ప్రతిభ చూపాను. నాలోని ప్రతిభను గమనించిన టీచర్లు, లెక్చరర్లు నన్ను బాగా ప్రోత్సహించారు. మ్యాథ్స్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటూ సైన్స్‌పై దృష్టి పెట్టాను. తద్వారా టెన్త్, ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇక డిగ్రీ బీటెక్ చేశాను. బీటెక్ తర్వాత కేవలం నాన్ టెక్నికల్ సబ్జెక్టులపై దృష్టిపెడితే బాగుంటుందనిపించింది. మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌వైపు నడవాలనుకున్నాను. దీనిగురించి శోధించి చివరకు ఎంబీఏ చేయాలని నిర్ణయించి క్యాట్‌కు సిద్ధమయ్యాను. మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ చదివితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. తద్వారా భారత ఆర్థిక పురోగతికి నా వంతు కృషి చేయవచ్చనే ఆలోచన కలిగింది.
* ఐఐఎం, అహ్మదాబాద్ నా కల.
క్యాట్‌లో ర్యాంకు సాధించి అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో చేరాలనేది నా లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. దీనికి కారణం ఏమిటంటే దేశంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులుగా రాణించిన వారిలో ఎక్కువ శాతం ఐఐఎం, అహ్మదాబాద్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. అలాంటి సంస్థలో చేరితే మేధావులను గమనించడమేకాదు వారితో నా ఆలోచనలను పంచుకున్నట్లు అవుతుంది. తద్వారా నా ఆలోచనా పరిధి కూడా పెరుగుతుంది. అందుకనే నేను క్యాట్, అహ్మదాబాద్‌లో చేరాలనుకున్నాను.
క్యాట్‌కు ఎలా ప్రిపేర్ అయ్యారు?
జ. క్యాట్ లాంటి పరీక్షల ప్రస్తావన వస్తే చాలామంది అలాంటివి మనలాంటి వారికి కాదులే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామనే దానిపై స్పష్టత ఉంటే ఎంచుకునే దారి సులభంగా మారుతుంది. నేను చేసింది కూడా అదే. మొదట క్యాట్ పరీక్ష గురించి పూర్తి అవగాహన ఏర్పర్చుకున్నాను. క్యాట్‌లో మ్యాథ్స్, ఇంగ్లిష్ రెండు ప్రధానమైన సెక్షన్లు ఉంటాయి. వీటిలో మ్యాథ్స్‌ ప్రశ్నలన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి చదివిన ఫండమెంటల్స్‌పైనే ఆధారపడి ఉంటాయి. అందుకని ప్రాథమిక అంశాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకుంటే ప్రశ్న ఎలా వచ్చినా సమాధానం గుర్తించవచ్చు. మ్యాథ్స్ అనేది లాజిక్‌తో కూడినది. ప్రశ్న అర్థమైతే సమాధానం కూడా వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ముందు సబ్జెక్టు ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. దీనికోసం ఒకటి నుంచి 6 వరకు ఉన్న సబ్జెక్టులపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పరుచుకున్నాను. దీంతో ప్రశ్న ఎలా వస్తుందనే భయం పోయింది.
ఇక పరీక్షలో సమయం తక్కువ ఉంటుంది కాబట్టి నేను మాక్ టెస్టులు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) ఎక్కువ చేశాను. ప్రతి మాక్ టెస్టు తర్వాత ప్రశ్నలన్నింటీ విశ్లేషించుకునే వాడిని. ఎన్ని మార్కులు వచ్చాయి. ఎక్కడ తప్పులు వచ్చాయి. ఎందుకు తప్పులు వచ్చాయో తెలుసుకునే వాడిని. దీనికోసం సంబంధిత పుస్తకాలను, నెట్‌ను ఆశ్రయించాను. తప్పులను అర్థం చేసుకున్నాను. తర్వాత టెస్టులు చేస్తున్నప్పుడు తప్పులు తక్కువ వచ్చాయి. అదే సమయంలో వేగం కూడా పెరిగింది. కనీసం 5 నుంచి 6 నెలలపాటు ఈ విధంగా మాక్ టెస్టులు చేస్తూ వచ్చాను. దీంతో ఏకకాలంలో సబ్జెక్టుల మీద అవగాహన, సమాధానాన్ని వేగంగా గుర్తించే నైపుణ్యం బాగా అలవడ్డాయి.
* ఇక ఇంగ్లిష్ విషయానికొస్తే ఇక్కడ కూడా బేసిక్ అంశాలపై ఎంత అవగాహన ఉందనేది ముఖ్యం. దీనికోసం ఇంగ్లిష్ రాదనే ఆలోచనను, భయాన్ని దూరం చేసుకోవాలి. రీడింగ్ కాప్రిహెన్షన్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకు అందులో ఉన్న సమాచారం ఆధారంగా సమాధానాన్ని గుర్తించాలేగానీ, మనకు తెలిసిన విషయాలను ఆధారం చేసకుని సమాధానం ఇవ్వకూడదు.
* ఏ పోటీ పరీక్షకైనా ప్రిపేర్ అవుతుంటే ఎన్ని గంటలకు కేటాయించామనేది ముఖ్యం కాదు. ఎంతమేరకు సబ్జెక్టును అర్థం చేసుకున్నామనేది ముఖ్యం. అంటే క్వాలిటీ టైమ్ ఎంత కేటాయించామనేది అవసరం.
కొత్త వారికి మీరిచ్చే సలహా…
జ. మొదట ఏం చేయాలనుకుంటున్నామో, లేదా ఏం కావాలనుకుంటున్నామో దానిపై స్పష్టత ఉండాలి. దీనికోసం మనమీద మనకు నమ్మకం ఏర్పరచుకోవాలి. అలాగే లక్ష్యం గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంతేకానీ కనిపించిన, తోచిన ప్రతి పరీక్షకు సిద్ధం కాకూడదు. లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత కొన్నిసార్లు ఇతరులు నిరుత్సాహపరచవచ్చు. దాంతో కుంగిపోకూడదు. పట్టుదలతో ముందుకు వెళ్లాలి. పోటీ పరీక్ష రాస్తుంటే సబ్జెక్టు మూలాలను తెలుసుకోవాలి. లాజికల్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ఏం ఇచ్చాడు. ఏం అడిగాడు, ఏం రాయాలి? అని ఆలోచించాలి. అప్పుడే విజయం సాధించగలం.
మీ లక్ష్యం ఏమిటి?
జ. నేను ఎంబీఏ చేసి బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించి తర్వాత సివిల్స్ ద్వారా ఇండియన్ ఫైనాన్షియల్ అడ్వయిజరీ సర్వీసెస్‌లోకి వెళ్లాలనుకుంటున్నాను. తద్వారా భారత ఆర్థిక పురోగతిలో నావంతు సహకారం అందించగలనని నమ్ముతున్నాను.

Advertisements
 
Comments Off on ప్రాథమిక అంశాలపై అవగాహనే ప్రధానం

Posted by on January 18, 2014 in Uncategorized

 

వీఆర్‌ఏల వేతనం రూ.6 వేలకు పెంపు * మంత్రి రఘువీరారెడ్డి


వీఆర్‌ఏల వేతనం రూ.6 వేలకు పెంపు
* మంత్రి రఘువీరారెడ్డి

హైదరాబాద్‌: గ్రామ రెవిన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి శాసనసభలో ప్రకటించారు. దీనికి సంబంధించిన దస్త్రం సీఎం పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.

 
Comments Off on వీఆర్‌ఏల వేతనం రూ.6 వేలకు పెంపు * మంత్రి రఘువీరారెడ్డి

Posted by on January 18, 2014 in Uncategorized

 

అధ్యాపక నియామకాలకు పాలకమండలి పచ్చజెండా


తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నూతనంగా చేపట్టనున్న అధ్యాపక నియామకాలకు వర్సిటీ పాలకమండలి పచ్చజెండా వూపింది. జనవరి 17న హైదరాబాద్‌లో ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య ఉదయగిరి రాజేంద్ర అధ్యక్షతన.. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రమేష్‌, కాలేజియేట్‌ కార్యదర్శి సునీత, రెక్టార్‌ ఆచార్య సుకుమార్‌, రిజిస్ట్రార్‌ సత్యవేల్‌రెడ్డితో కూడుకున్న ఈసీ బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన పోస్టులన్నింటికీ పాలకమండలి అనుమతిచ్చినట్లు పరిపాలన విభాగం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సుదీర్ఘకాలం తర్వాత నోటిఫికేషన్‌కు అనుమతి రావడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి నియోజకవర్గం పీలేరులో పీజీ సెంటర్‌ స్థాపనకు సైతం పాలకమండలి ఆమోదాన్ని తెలిపింది.

 
Comments Off on అధ్యాపక నియామకాలకు పాలకమండలి పచ్చజెండా

Posted by on January 18, 2014 in Uncategorized

 

24, 25 తేదీల్లో ట్రిపుల్ఐటీల్లో ప్రాంగణ ఎంపికలు


కడప జిల్లా (వేంపల్లె):
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీల్లో జనవరి 24, 25తేదీల్లో ప్రాంగణ ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలను టీసీఎస్ కంపెనీ బృందం ఇక్కడి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదివే అన్ని బ్రాంచీల విద్యార్థులకు ఆన్‌లైన్, మౌఖిక పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు అవసరమయ్యే ఏర్పాట్లు చేస్తున్నట్లు డైరెక్టర్ కృష్ణారెడ్డి వెల్లడించారు.

 
Comments Off on 24, 25 తేదీల్లో ట్రిపుల్ఐటీల్లో ప్రాంగణ ఎంపికలు

Posted by on January 18, 2014 in Uncategorized

 

ఫిబ్రవరి 9న టెట్


ఫిబ్రవరి 9న టెట్

– ఆమోదం తెలిపిన ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఫిబ్రవరి 9న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని విద్యాశాఖ సంచాలకులు వాణీమోహన్ జనవరి 17న తెలిపారు. పూర్తి వివరాలను శనివారం చెబుతామన్నారు. టెట్‌కు సుమారు 4.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరీక్ష జరిగాక ఫలితాల వెల్లడికి కనీసం రెండు వారాలు పడుతుంది. డీఎస్సీ-2014 ప్రకటన జారీపై స్పష్టత రావాల్సి ఉంది. టెట్ ఫలితాలు వెలువడ్డాక డీఎస్సీ నిర్వహణకు కనీసం నెల రోజుల సమయం అవసరమవుతుంది. డీఎస్సీ ప్రకటనను టెట్ ఫలితాల వెల్లడికి ముందుగానే జారీచేస్తారా, లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఫిబ్రవరి ఆఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూలు రావొచ్చని భావిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 
Comments Off on ఫిబ్రవరి 9న టెట్

Posted by on January 18, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: