RSS

గ్రూప్-1 మెయిన్స్ రాసిన వారందరికీ మళ్లీ మెయిన్స్

21 Jan

గ్రూప్-1 మెయిన్స్ రాసిన వారందరికీ మళ్లీ మెయిన్స్

* ఏపీపీఎస్సీకి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఈనాడు, న్యూఢిల్లీ: గ్రూప్-1 మెయిన్స్‌కు హాజరైన వారందరికీ తిరిగి పరీక్ష నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు జనవరి 20న స్పష్టం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైనప్పటికీ 2012 సెప్టెంబర్‌లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్‌కు హాజరుకాని 7 వేల మంది అభ్యర్థులకు తిరిగి మెయిన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రిలిమ్స్ కీలో జరిగిన తప్పుల కారణంగా మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని గత ఏడాది (2013) అక్టోబర్ 7వ తేదీన జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే, జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కొన్ని మార్పులు కోరుతూ ఏపీపీఎస్సీ దాఖలుచేసిన పిటిషన్‌పై అదే ధర్మాసనం సోమవారం స్పష్టత ఇచ్చింది. ప్రిలిమ్స్ కీలో జరిగిన తప్పుల ప్రభావం కేవలం 209 మందిపై మాత్రమే పడింది కాబట్టి వారికి మాత్రమే తిరిగి మెయిన్స్ నిర్వహించేలా ఉత్తర్వులు జారీచేయాలన్న ఏపీపీఎస్సీ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తాజాగా తోసిపుచ్చింది. ఇప్పుడు దాదాపు 9వేల పైచిలుకు మందికి మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి వస్తుందని ఏపీపీఎస్సీ తరుఫు న్యాయవాది తెలిపారు.
ఏమిటీ నేపథ్యం…
2011లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకారం 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. అయితే ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీలో ఆరు తప్పులున్నాయంటూ ఇద్దరు విద్యార్థులు పరిపాలనా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ విచారణ జరుగుతుండగానే 2012 సెప్టెంబర్ 18 నుంచి 30 వరకు ఏపీపీఎస్సీ మెయిన్స్ నిర్వహించేసింది. అభ్యర్థులు లేవనెత్తిన ఆరు ప్రశ్నలకుగాను నాలుగింటిపై నిపుణుల కమిటీవేసి, తాము ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఇంటర్వ్యూలు జరుపుకోవచ్చని 2013 జనవరి 4న పరిపాలన ట్రైబ్యునల్ సదరు పరీక్షపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అందుకు అనుగుణంగానే 2013 జనవరి 28 నుంచి మార్చి 22 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆ మధ్యలోనే అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు వివాదాస్పద ఆరు ప్రశ్నలపై యూపీఎస్సీ నివేదిక కోరుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ నివేదిక రాకముందే ఏపీపీఎస్సీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా… ప్రిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో తప్పులున్న ఆరు ప్రశ్నలను రద్దుచేసి, మిగిలిన 144 ప్రశ్నలను పరిగణనలోకి తీసుకొని, దాని ప్రకారమే మెరిట్‌లిస్ట్ తయారుచేసి, దాని ఆధారంగా మళ్లీ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాలని గత ఏడాది అక్టోబర్ 7న సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే ఆ ఆరుప్రశ్నల ప్రభావం కేవలం 209 మందికి ప్రభావం పడినందున వారికి మాత్రమే మెయిన్స్ నిర్వహించేలా గత ఉత్తర్వులను సవరించాలని ఏపీపీఎస్సీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

 
Comments Off on గ్రూప్-1 మెయిన్స్ రాసిన వారందరికీ మళ్లీ మెయిన్స్

Posted by on January 21, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: