RSS

Daily Archives: January 29, 2014

ఉపాధ్యాయ విద్యపై నిఘా..నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు


ఉపాధ్యాయ విద్యపై నిఘా..నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు
హైదరాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాల్సిన ఉపాధ్యాయుల్లో నాణ్యత తగ్గుతోంది. తూతూ మంత్రం చదువులతో టీచర్ పట్టాతో స్కూళ్లలోకి అడుగుపెడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తున్నారు! ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో నాణ్యత లోపించడం, నిబంధనలు పాటించకపోవడాన్ని ప్రాథమిక విద్యాశాఖ గుర్తించింది. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ప్రైవేటు కాలేజీల్లో తరగతులు జరక్కపోయినా ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేస్తున్నారు. ప్రాక్టికల్ తరగతులు నిర్వహించకపోయినా బాగా బోధిస్తారంటూ కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాయి. దీంతో ముందు ఇక్కడి నుంచి సంస్కరించడం ప్రారంభించాలని ప్రాథమిక విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎడ్ ప్రైవేటు కాలేజీల్లో పక్కా బోధన అందించేందుకు ప్రత్యేక నిఘావంటి పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగా వెబ్ ఆధారిత పర్యవేక్షణ చేపట్టనున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘సాక్షి’తో చెప్పారు. అలాగే, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఇప్పటికే 600 వరకు ఉన్నందున కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్సీటీఈ) రాశామని చెప్పారు.

డీఎడ్ కాలేజీల్లో పర్యవేక్షణ ఇలా..
-ప్రత్యేక వెబ్సైట్లో విద్యార్థులు, అధ్యాపకుల ఫొటోలతో వివరాలు .
– రోజువారీ హాజరు వివరాలను ప్రతినెలా ఆ సైట్లో అప్లోడ్ చేయాలి. పాఠ్యాంశాల వివరాలను కూడా పొందుపరచాలి.
– అధిక ఫీజులు డిమాండ్ చేస్తే విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారులు వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు.
– కలెక్టర్ చైర్మన్గా ఉండే కమిటీలు ప్రతి నెలా కాలేజీలను తనిఖీలు చేస్తాయి. సంబంధిత కాలేజీ అనుబంధ స్కూళ్లలో ప్రాక్టికల్స జరిగాయా? లేదా? పరిశీలిస్తాయి. టీచర్ల హాజరు, పాఠ్యాంశాల బోధనపై రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదికలిస్తాయి. ఈ చర్యల ద్వారా పాఠశాల విద్య నాణ్యత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు.

ఏప్రిల్లోనే ‘టెన్త్’ పాఠ్యపుస్తకాల పంపిణీ
పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, పాఠశాలలకు చివరి పని దినమైన ఏప్రిల్ 23కే పదో తరగతికి వెళ్లే 12 లక్షల మంది విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తామని పూనం మాలకొండయ్య చెప్పారు. సెలవుల్లో ముందుగానే చదువుకునే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామన్నారు. ఇతర తరగతులకు చెందిన 64 లక్షల మందికి జూన్ 12న స్కూళ్లు తెరిచే రోజున ఉచిత పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

Advertisements
 
Comments Off on ఉపాధ్యాయ విద్యపై నిఘా..నాణ్యత మెరుగుకు ప్రాథమిక విద్యా శాఖ చర్యలు

Posted by on January 29, 2014 in Uncategorized

 

ఐఐటీ హైదరాబాద్‌కు జపాన్ రుణం


ఐఐటీ హైదరాబాద్‌కు జపాన్ రుణం
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కొన్నేళ్ళకిందట కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) దశ తిరగబోతోంది. జపాన్ అంతర్జాతీయ సహాకార సంస్థ (జె.ఐ.సి.ఎ.) హైదరాబాద్ ఐఐటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికిగాను 1336 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈమేరకు జె.ఐ.సి.ఎ. ప్రతినిధి షిన్యా ఎజిమా, భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్ కుల్లార్‌లు జనవరి 29న ఒప్పందంపై సంతకాలు చేశారు. శాశ్వత ప్రాంగణ నిర్మాణానికి, అత్యున్నతస్థాయి పరిశోధన పరికరాల కొనుగోలుకు ఈ రుణాన్ని వెచ్చిస్తారు. 2018కల్లా ఈ పనులన్నీ పూర్తవుతాయని భావిస్తున్నారు.

 
Comments Off on ఐఐటీ హైదరాబాద్‌కు జపాన్ రుణం

Posted by on January 29, 2014 in Uncategorized

 

31న పర్యావరణ విద్యపై పరీక్ష


31న పర్యావరణ విద్యపై పరీక్ష

* మార్చి 12 నుంచి ఇంటర్ పరీక్షలు ఆరంభం

* బోర్డు కార్యదర్శి రామశంకరనాయక్ స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ బోర్డు పరీక్షలకు ఉపక్రమించింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో భాగంగా జనవరి 31న ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష జరగనుంది. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. గత 2007 నుంచి ఎవరైనా ఈ పరీక్ష రాయకుండా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకరనాయక్ వెల్లడించారు. నాటి హాల్‌టిక్కెట్ నంబరుతో ఈ పరీక్ష రాయవచ్చునని చెప్పారు. ఈ మేరకు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు.

తొలుత ప్రకటించిన విధంగానే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ముందుగా జరగవచ్చునని వస్తున్న ప్రచారాన్ని కార్యదర్శి కొట్టేశారు. తొలుత నిర్ణయించిన తేదీల్లోనే పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేశారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మొదలై.. మార్చి 4 వరకు జరగనున్నాయి. ఈ దఫా 19 నాన్-పారామెడికల్ వొకేషనల్ విద్యార్థులకు కంప్యూటరైజ్డ్ ప్రశ్నపత్రాన్ని (ప్రాక్టికల్స్ కోసం) కళాశాలలకు పంపనున్నారు. ప్రశ్నపత్రాన్ని గతేడాది వరకు స్థానికంగానే అధ్యాపకులు తయారుచేసేవారు. ఈ సారి నుంచి మార్పు తీసుకొచ్చారు.

 
Comments Off on 31న పర్యావరణ విద్యపై పరీక్ష

Posted by on January 29, 2014 in Uncategorized

 

శిశువులకు స్త్రీ విద్య శ్రీరామరక్ష!


శిశువులకు స్త్రీ విద్య శ్రీరామరక్ష!
ఐక్యరాజ్యసమితి: స్త్రీ విద్య అనేది ప్రాణరక్షణ వంటిదని ఐక్యరాజ్యసమితి నివేదిక జనవరి 29న పేర్కొంది. ముఖ్యంగా, భారత్, నైజీరియాల్లో స్త్రీవిద్య పెరిగితే అసంఖ్యాక ప్రాణాలు నిలబడతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాను చూస్తే…భారత్, నైజీరియాల్లో ఈ పరిస్థితి అత్యంత అధికంగా ఉంది. ఈ పరిస్థితి నుంచి బైటపడాలంటే కచ్చితంగా స్త్రీవిద్యావ్యాప్తి పట్ల దృష్టిసారించాల్సి ఉందని పేర్కొంది.

 
Comments Off on శిశువులకు స్త్రీ విద్య శ్రీరామరక్ష!

Posted by on January 29, 2014 in Uncategorized

 

మాతృభాషను ప్రేమించండి..


మాతృభాషను ప్రేమించండి….

న్యూస్‌టుడే, హైదరాబాద్: మారిషస్‌లో ఒకటో తరగతి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు తెలుగులో చదవడానికి, అధ్యయనం చేయడానికి అక్కడి ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంటే… సొంత రాష్ట్రంలోని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మైసూర్‌లోని దక్షిణ ప్రాంతీయ భాషా కేంద్రంలో తెలుగు కోర్సు చేస్తూ, అధ్యయనం నిమిత్తం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఉపాధ్యాయులతో జనవరి 29న తెలుగు విశ్వవిద్యాలయంలో ఇష్టాగోష్ఠి జరిగింది. ముఖ్య అతిథి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ… మాతృభాషను ప్రేమిస్తూనే, ఇతర భాషల్ని ఆదరించాలని, అన్ని భాషలకూ ప్రాధాన్యమున్నప్పుడే జాతీయ సమగ్రత సాధ్యమవుతుందన్నారు.

 
Comments Off on మాతృభాషను ప్రేమించండి..

Posted by on January 29, 2014 in Uncategorized

 

ఏడు యూజీ పాఠ్యాంశాలకు ‘ఈ-కంటెంట్’


* ప్రారంభించిన కేంద్రమంత్రి పళ్లంరాజు

న్యూఢిల్లీ: యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) కోర్సుల్లో ఏడు పాఠ్యాంశాల (సబ్జెక్టు)కు సంబంధించిన ‘ఈ-కంటెంట్‌’ను కేంద్ర మానవ వనరుల మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు జనవరి 29న ప్రారంభించారు. ఈ సంద్భంగా విద్యలో మరింత నాణ్యత పెంచాలని రాష్ట్రాల బోర్డులను ఆయన కోరారు. ”దేశంలోని విద్యావ్యవస్థలో మౌలికవసతులు అభివృద్ధి చేయాల్సి ఉంది. మరింత నాణ్యతతో కూడిన విద్య అందించడం అత్యవసరం అని పళ్లంరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం వృక్షశాస్త్రంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ-కంటెంట్ ఇకపై ఆంత్రోపాలజీ, ఆంగ్లం, హిందీ, గణితం, ఫొటోగ్రఫీ, పర్యావరణ విద్య, చరిత్రల్లో లభించనుంది. ఆయా పాఠ్యాంశాల ఈ-కంటెంట్‌ను యూజీసీలోని అంతర విశ్వవిద్యాలయ కేంద్రమైన కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సీఈసీ) అభివృద్ధి చేసింది. కోర్సుల వివరాలు, ప్రణాళికల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. సీఈసీ ప్రస్తుతం 90 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఈ-కంటెంట్‌ను అభివృద్ధి చేస్తోంది.

వెబ్ సైట్  www.cec-ugc.nic.inwww.sakshat.ac.in

 
Comments Off on ఏడు యూజీ పాఠ్యాంశాలకు ‘ఈ-కంటెంట్’

Posted by on January 29, 2014 in Uncategorized

 

రభుత్వ వసతిగృహాలలో ఆలనపాలన


రభుత్వ వసతిగృహాలలో ఆలనపాలన
ఈనాడు, హైదరాబాద్: విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు ప్రైవేటు విద్యాసంస్థలలో నిర్వహించడం ఆనవాయితీ. వారి సూచనలకు అనుగుణంగా యాజమాన్యాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ విధానాన్ని ప్రభుత్వ వసతిగృహాలలో ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ శాఖ జనవరి 29న నిర్ణయించింది. వసతిగృహాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులలో ప్రతీ నెలా సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో 1384 బీసీ బాలబాలికల వసతిగృహాలున్నాయి. 15 వేల మందికి పైగా వీటిలో వసతి పొందుతున్నారు. వసతిగృహాల నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి పర్యవేక్షణ లేదు. వసతిగృహాల అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. విద్యార్థుల సమస్యలు అపరిష్కృతంగా ఉంటున్నాయి. వసతిగృహాలను ప్రక్షాళన చేయాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. వాటి నిర్వహణలో ప్రజాభాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమయింది.

 
Comments Off on రభుత్వ వసతిగృహాలలో ఆలనపాలన

Posted by on January 29, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: