RSS

ఇంటరు విద్యకు 90వేల మంది దూరం

29 Jan

ఇంటరు విద్యకు 90వేల మంది దూరం
ప్రవేశాల పెంపునకు ప్రత్యేక ప్రణాళిక
ఈనాడు, హైదరాబాద్‌: గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారిలో సుమారు 90వేల మంది ఇంటరు విద్యకు దూరమయ్యారు. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు కళాశాలల్లోని ప్రవేశాల ప్రక్రియపై ఇంటరు విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో పదో తరగతి ఉత్తీర్ణులైనవారంతా ఇంటరులో చేరేలా ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇంటరు విద్యాశాఖ, ఇంటరు బోర్డు కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి.
అధ్యయనంలోఏం తేలిందంటే…
2013లో 10,72,690 మంది పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అత్యధికులు ఇంటరువైపే దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు 5,851 ఉండగా వీటిలో 8,73,371 మంది చేరారు. వీరిలో అత్యధికులు ఎంపీసీలో చేరారు.
* ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 1,15,078 సీట్లుండగా 71.018 మందే ప్రవేశాలు పొందారు.
* ఐటీఐల్లో 1,07,668 సీట్లుండగా 69,798 మందే చేరారు.
* ఏపీ సార్వత్రిక విద్యాపీఠంద్వారా దూరవిద్యలో ఇంటరు చదివే అవకాశం ఉంది. కానీ ఇందులో చేరేవారు తక్కువ మందే ఉన్నారు.
సాంకేతిక కోర్సులవైపు మొగ్గు తక్కువే
ఐటీఐల్లో, పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సీట్లు ఎక్కువగా ఉన్నా విద్యార్థులు సంప్రదాయంగా ఇంటర్లోనే చేరిపోతున్నారన్న విషయం ఈ గణాంకాలద్వారా స్పష్టమవుతోంది. పాలిటెక్నిక్‌ కోర్సులో ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుగుతున్నాయి. ఐటీఐల్లో చేరే విద్యార్థులు అత్యధికం గ్రామీణ నేపథ్యం కలిగిన పేద కుటుంబాలకు చెందినవారు. ఐటీఐల్లో ఏడాదితోనే కాకుండా రెండేళ్ల వ్యవధితో కోర్సులు పూర్తిచేసే అవకాశం ఉంది. అయినప్పటికీ ఐటీఐవైపు విద్యార్థులు దృష్టి సారించడంలేదు.
ఇంటరు విద్యకు దగ్గర చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం
పదో తరగతి తరువాత ఎక్కడెక్కడ విద్యార్థులు చేరతారో ఆ వివరాలన్నింటినీ పరిశీలించాం. సంక్షేమ వసతి గృహాల్లో చేరేవారి వివరాలను సేకరించాం. వివరాలన్నింటినీ పరిశీలిస్తే 90వేల మంది వరకూ విద్యార్థులు ఇంటరు, తత్సమాన కోర్సులకు దూరమైనట్లుగా తేలింది. ఇంటరు బోర్డు, ఇంటరు విద్యాశాఖ, పాఠశాల విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టి వీరందరినీ ఇంటరు విద్యలో చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.   – అధర్‌సిన్హా, కమిషనరు, ఇంటరు విద్యాశాఖ

 
Comments Off on ఇంటరు విద్యకు 90వేల మంది దూరం

Posted by on January 29, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: