RSS

పరీక్షల తర్వాతే బోధనా రుసుం.. ఉపకార వేతనం..

29 Jan

పరీక్షల తర్వాతే బోధనా రుసుం.. ఉపకార వేతనం..
ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు బోధనా రుసుము, ఉపకార వేతనాల మంజూరు ప్రక్రియలో అసాధారణ జాప్యం నెలకొంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాతే నిధులు విడుదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇంకా దరఖాస్తుల సేకరణ జరుగుతుండగా, మరోవైపు వాటి పరిశీలన నత్తనడకన సాగుతోంది. ఇప్పటిదాకా 15శాతం దరఖాస్తుల పరిశీలనే జరిగింది.
ఉపకార వేతనాలు, బోధనా రుసుములకు ఇప్పటివరకూ 24.56 లక్షల దరఖాస్తులొచ్చాయి. వాటికి గడువును ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటంవల్ల మంజూరుకు విఘాతం కలుగుతోందని అధికారులు పేర్కోనడంతో ప్రభుత్వం సమాంతరంగా వాటి పరిశీలన చేపట్టింది. కళాశాలల్లోని ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన మొదలైంది. నెల రోజుల్లో మొత్తం పరిశీలన పూర్తవుతుందని అధికారులు భావించినా ఇప్పటిదాకా 15శాతమే జరిగింది. బీసీ సంక్షేమశాఖ పరిధిలో 13 లక్షల దరఖాస్తులు రాగా కేవలం 1.46 లక్షల పరిశీలనే పూర్తయింది. ఈబీసీ నుంచి వచ్చిన 3.35 లక్షల దరఖాస్తుల్లో 80వేల పరిశీలనే జరిగింది. ఆధార్‌, బ్యాంకు ఖాతాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. యుద్ధ ప్రాతిపదికన పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినా అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. కళాశాలల్లో పరిమిత సిబ్బంది ఉండగా వారికి ఇతర విధులున్నాయి. వారిని పరిశీలనలో భాగస్వాములను చేయడానికి యాజమాన్యాలు సుముఖత చూపడం లేదు. హడావుడిగా దరఖాస్తులను పూర్తిచేస్తే అనర్హులు నమోదయ్యే ప్రమాదం ఉంది.
మంజూరు సమస్యే: ఉపకార వేతనాలకు నాలుగు విడతల్లో నిధుల మంజూరు విధానం రాష్ట్రంలో ఉంది. ఇప్పటిదాకా దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కానందున ఆర్థికశాఖ నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. మూడో విడత నిధులు మంజూరు కావాల్సి ఉన్నా కేవలం మొదటి విడత నిధులే విడుదలయ్యాయి. దరఖాస్తులకు అనుగుణంగా బిల్లులను తయారు చేసి సంక్షేమ శాఖలు నిధులను పొందాల్సి ఉంది. బీసీ సంక్షేమశాఖలో రూ.3347 కోట్ల బడ్జెట్‌కుగానూ ఇప్పటిదాకా రూ.1356 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటిదాకా పరిశీలన జరిపిన దరఖాస్తులకు రూ.681 కోట్లు అవసరం కాగా వాటిలో రూ.125 కోట్ల బిల్లులనే బీసీ సంక్షేమశాఖ సిద్ధం చేసింది.
మార్చి దాటితే ఇబ్బందులు: మార్చి నెలలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆ లోపే నిధులన్నీ మంజూరు చేయించుకోవాలి. గడువు ముగిస్తే మళ్లీ కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ నుంచి నిధులు పొందాలి. ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ వస్తోంది. అప్పుడు ఉపకార వేతనాల నిధుల పొందడం ఇబ్బందికరంగా మారుతుంది. దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను కళాశాలలకు అప్పగించడంవల్ల యాజమాన్యాల నుంచి ప్రస్తుతానికి ఒత్తిళ్లు లేనప్పటికీ పరీక్షల సమయంలో ఇబ్బందులు పెడతారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

 
Comments Off on పరీక్షల తర్వాతే బోధనా రుసుం.. ఉపకార వేతనం..

Posted by on January 29, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: