RSS

ఎవరూలేని అభాగ్యులకు చదువుకునే అవకాశం

30 Jan

* జనన ధ్రువీకరణ పత్రాలు జారీ
* ఎస్సీలకు వర్తించే విద్యా రాయితీల వర్తింపు
* ప్రయోగాత్మకంగా రాజధాని నగరంలో అమలు
* ఇక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాల్లో..!
ఈనాడు, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: వారు దిక్కూ మొక్కూలేని అనాథలు.. ఎక్కడ పుట్టారో.. తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థితి. భవిష్యత్తు అగమ్యగోచరమైన ఇలాంటి నిర్భాగ్యుల జీవితాల్లో విద్యా వెలుగులు నిండనున్నాయి. వీరికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర రాజధానిలో అధికారులు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో వేలాది మంది అనాథలకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడమే కాకుండా జీవితంపై వారికి భరోసా కల్పించనున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మొదలుపెట్టనున్న ఈ కార్యక్రమంలో.. విద్యాపరంగా ఎస్సీలకు వర్తింపజేసే రాయితీలన్నీ వీరికి వర్తింపజేయాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అనాథలు.. ప్రభుత్వ అనాథ శరణాలయాలు, తదితర చోట్ల ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క రాజధాని నగరంలోనే వీరి సంఖ్య 20 వేలదాకా ఉంటుందని అంచనా. ఎప్పుడు పుట్టారో తెలియక పోవడంతో వీరికి అధికారికంగా జనన ధ్రువీకరణ పత్రాలు కూడా ఉండటం లేదు. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక తోడ్పాటుగానీ, విద్యాపరంగా ఇతరత్రా సహకారంగానీ లభించని పరిస్థితి నెలకొంది. విద్యాపరంగా షెడ్యూల్‌ కులాలకు ఇచ్చే అన్ని రకాల సౌకర్యాలను వీరికి ఇవ్వొచ్చంటూ ప్రభుత్వం పదేళ్ల కిందటే ఆదేశాలు జారీ చేసినా కలెక్టర్లు పట్టించుకోలేదు. కొద్దిమంది మాత్రమే విద్యార్జన చేస్తుండగా చాలామంది చదువులకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ అంశంపై దృష్టిసారించారు. నగరంలో అనాథలు ఎంతమంది ఉన్నారో పరిశీలించే బాధ్యతను అదనపు సంయుక్త కలెక్టర్‌ రేఖారాణికి అప్పగించారు. మొదటి దశ కింద ఏపీ బాలసదన్‌లోని 189 మంది అనాథలకు జనన ధ్రువీకరణ పత్రాలను జారీచేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు. ముందుగా హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ నుంచి వీరికి ఎలాంటి జనన ధ్రువపత్రాలు లేవని ధ్రువీకరించుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక వైద్యుల బృందం సాయంతో దంత పరీక్షలు నిర్వహిస్తారు. దంతాల ఎదుగుదల ఆధారంగా వయసును నిర్ధరించి జులైలో పుట్టినట్లు ఒక తేదీని నిర్ణయించి అందరికీ జనన ధ్రువపత్రాలను జారీ చేస్తారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వీరందరికీ ఎస్సీలకు అందించే విద్యాపరమైన రాయితీలను వర్తింపజేసేలా ప్రత్యేకంగా ధ్రువపత్రాలను కూడా ఇస్తారు. ఉపకార వేతనాల నుంచి ఉన్నత విద్య వరకు అన్నింటినీ వీరికి వర్తింపజేసి ఉన్నత చదువుల దిశగా పయనింప చేయడమే కాకుండా ఆ తరువాత ఉద్యోగ భరోసాను కల్పించేందుకూ ప్రయత్నాలు సాగుతున్నాయి. మొదటి విడతలో 189 మందికి వర్తింపజేసిన తర్వాత రాజధాని నగరంలో మిగతావారి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి అందరికీ అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ ముఖేష్‌కుమార్‌ మీనా ‘ఈనాడు’కు తెలిపారు. ఇది అనేక మందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమమైనందున వెంటనే అమలయ్యేలా చూస్తున్నామన్నారు. ఈ అనాథలకు ఎలాంటి సర్టిఫికెట్‌ లేదనే వివరాలతో ధ్రువీకరణ జారీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు అంగీకరించారని అదనపు సంయుక్త కలెక్టర్‌ రేఖారాణి తెలిపారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేసి అనాథలకు తోడ్పాటు అందించే ప్రణాళికను కొద్ది రోజుల్లోనే అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ ఇక్కడ విజయవంతంగా అమలైతే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

 
Comments Off on ఎవరూలేని అభాగ్యులకు చదువుకునే అవకాశం

Posted by on January 30, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: