ఈనాడు-హైదరాబాద్: చిత్తూరు జిల్లా కలికిరి సైనిక స్కూలు నిర్మాణ పనుల కోసం అదనంగా 20 కోట్ల రూపాయలను మంజూరుచేస్తూ విద్యాశాఖ ఫిబ్రవరి 5న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Daily Archives: February 5, 2014
ఎవరికీ మినహాయింపుల్లేవ్
* టెట్, ఎన్నికల విధులకు సహకరించం
ఈనాడు, హైదరాబాద్: సమ్మె నుంచి ఏ ఒక్క విభాగానికీ మినహాయింపు ఉండరాదని ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 5న నిర్ణయించాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు (టెట్), ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల విధులకు ఉద్యోగులు హాజరు కాబోవడంలేదు. ఇదే విషయాన్ని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్, ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేశారు.
మన విద్యార్థులకు రూ.10 కోట్ల ఉపకారవేతనాలు
* గ్రేట్ స్కాలర్షిప్ పై బ్రిటీష్ కౌన్సిల్ ప్రచారం
ఈనాడు, హైదరాబాద్: భారత విద్యార్థులకు బ్రిటీష్ కౌన్సిల్ ఫిబ్రవరి 4న గ్రేట్ స్కాలర్షిప్ను ప్రకటించింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లోని 260 యూజీ, పీజీ కోర్సులకు రూ.10 కోట్ల విలువైన 370 ఉపకారవేతనాలను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బ్రిటీష్ కౌన్సిల్ ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో గ్రేట్ స్కాలర్షిప్, గ్రేట్ కెరీర్ గైడ్‌ను ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మార్కెటింగ్ సౌత్ ఆసియా ప్రాంతీయ సంచాలకురాలు ఒట్టోలీ వెకెజెర్ ఈ గైడ్‌ను ఆవిష్కరించారు. 2014 సెప్టెంబరు- 2015 జనవరి మధ్య ప్రవేశాలు పొందే వారికి ఈ ఉపకారవేతనాలను అందజేస్తారని తెలిపారు. బ్రిటన్‌లో మొత్తం 4.30 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుతుండగా భారతీయులు 30 వేల మంది ఉన్నారని పేర్కొన్నారు.
గురుకులాల్లో మరో వినూత్న ప్రయోగం
ఈనాడు, హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యాలయాల సంస్థ మరో వినూత్న నిర్ణయం ఫిబ్రవరి 3న తీసుకుంది. హైదరాబాద్‌లోని ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇంగ్లిష్, అండ్ ఫారిన్ ల్యాంగేజెస్ యూనివర్సిటీ)లోని బి.ఇడి.విద్యార్థులతో గురుకుల విద్యార్థులకు బోధన కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో ప్రత్యేక తరగతులను ప్రారంభించింది. ఇఫ్లులో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అభ్యాసంలో భాగంగా విద్యాసంస్థలకు వెళ్లి బోధించడం ఆనవాయితీ. తాజాగా 65 మంది శిక్షణార్థులు అభ్యాసాలకు సిద్ధమైనట్లు తెలిసి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ విశ్వవిద్యాలయాల అధికారులను సంప్రదించారు. వారితో తమ గురుకులాల్లోని విద్యార్థులకు బోధించేందుకు అనుమతి కోరారు. దీనికి విశ్వవిద్యాలయాల అధికారులు అనుమతించారు. ఈ మేరకు 65 మంది ఇఫ్లు విద్యార్థులు మంగళవారం నుంచి గురుకుల విద్యార్థులకు బోధన ప్రారంభించారు. పూర్తిగా ఆంగ్లంలో బోధన నడుస్తోంది.
విడివిడిగా కంటే… కలిసి చదివే బడులే మేలు!
వాషింగ్టన్: బాలురు, బాలికలకు విడివిడిగా పాఠశాలలు ఉండటం వల్ల ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనమేదీ ఉండదు. ముఖ్యంగా కో-ఎడ్యుకేషన్ పాఠశాలలతో పోల్చి చూస్తే…. ఈ విడివిడి విద్యాలయాల వల్ల సమకూరుతున్న లాభాలేమీ లేవని వెల్లడైనట్లు పరిశోధకులు ఫిబ్రవరి 3న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల 60 వేలకు పైగా విద్యార్థినీ విద్యార్థులపై అధ్యయనం నిర్వహించామన్నారు. అత్యంత విస్తృతంగా సమాచారాన్ని సేకరించి….. క్రోడీకరించి విశ్లేషించినట్లు వారు తెలిపారు. చదువు విషయంలో కానీ… ఇతరత్రా ప్రవర్తనా పరమైన అంశాల దృష్ట్యా కానీ కో-ఎడ్యుకేషన్ బడుల్లో చదువుకున్న వారితో పోలిస్తే…ఇలా విడివిడిగా ప్రత్యేకించిన పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో చెప్పుకోదగిన అంశాలేవీ గోచరించలేదని అన్నారు.
టెట్‌కు సమ్మె నుంచి మినహాయింపు?
టెట్‌కు సమ్మె నుంచి మినహాయింపు?
* పరిశీలిస్తున్నామన్న అశోక్‌బాబు
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సమైక్య ఉద్యోగుల సమ్మె నుంచి మినహాయింపు పొందే విషయమై పరిశీలన జరుగుతోంది. ఈ నెల 9వ తేదీన జరగనున్న టెట్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రశ్నపత్రాల బట్వాడా ప్రాథమిక దశలో ఉంది. సుమారు 4.50 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయబోతున్నారు. ఈ తరుణంలో సీమాంధ్రలోని వివిధ విభాగాల ఉద్యోగులు బుధవారం అర్థరాత్రి నుంచి సమ్మెబాట పడుతున్నారు. దీనివల్ల టెట్ నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ఉద్యోగుల సమ్మె కారణంగానే కిందటేడు జరగాల్సిన టెట్ వాయిదా పడింది. అవరోధాలు అధిగమించి ఈ నెల 9వ తేదీన టెట్ నిర్వహించనుండగా.. మళ్లీ గతేడాది సమస్యే ఎదురైంది. లక్షలాది మంది అభ్యర్థులకు చెందిన టెట్ విషయంలో మినహాయింపు ఇవ్వాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికతో చర్చలు జరిపేందుకు పభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు, టెట్, ఇతర పరీక్షల నిర్వహణకు సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్ అశోక్‌బాబు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలకు కూడా సమ్మె నుంచి మినహాయింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* ఎలాంటి ఇబ్బందిలేకుండా రాసుకోవచ్చు- విద్యార్థి ఐకాస
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఈ నెల 6 నుంచి చేపట్టనున్న బంద్‌కు టెట్, జాతీయ పరీక్షలు ఉన్నందున తొమ్మిదో తేదీన మినహాయింపు ఇస్తున్నట్లు సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస పేర్కొంది. నిరుద్యోగులు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మినహాయింపు ఇస్తున్నామని, అభ్యర్థులు టెట్, జాతీయ పరీక్షలను ఎలాంటి ఇబ్బంది లేకుండా రాసుకోవచ్చని ఐకాస కన్వీనర్ అడారి కిషోర్‌కుమార్ తెలిపారు.