RSS

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల పోస్టులకు డిమాండ్‌

06 Feb

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల పోస్టులకు డిమాండ్‌

* పీజీలో రిజర్వేషన్ల విధానమే కారణం
ఈనాడు, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖ చేపడతున్న తాజా నియామకాల్లో గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇదేంటి ఈ కొత్త పోకడ.. ఎంబీబీయస్‌ పూర్తిచేసిన వైద్యుల్లో సామాజిక స్పృహ పెరిగిందనుకుంటున్నారా?… అదేం లేదు, అసలు కారణం వేరే ఉంది. ప్రభుత్వం గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వారికి పీజీ వైద్య కోర్సుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తుండడంతో మారుమూల ప్రాంతాలపై ఈ మమకారం ఏర్పడుతోంది.. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే మూడేళ్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే ఆరేళ్లు పనిచేసిన వారు పీజీలో ఇన్‌సర్వీసు కోటా సీట్లు పొందడానికి అవకాశం కల్పించారు. దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నియామకాలు పొందిన రెండుమూడు నెలలకే పట్టణాలకు తరలిపోతుండడాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు.
235 గిరిజన ప్రాంత వైద్యపోస్టులకు 1300 మంది పోటీ:
గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో 235 వైద్యుల ఖాళీలున్నాయి. వైద్యఆరోగ్యసంచాలకులు తాజాగా చేపట్టిన ఎంపిక జాబితాలోని దాదాపు 1300 మంది ఈ పోస్టుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సారి మహిళా వైద్యులు కూడా గిరిజన ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తరువాత గ్రామీణ ప్రాంతాల్లోని 1025 ఖాళీలకు మొగ్గు చూపుతున్నారని వైద్యఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఈ రెండు చోట్ల అవకాశంలేని వారు మాత్రమే పట్టణ ప్రాంతాల్లో చేరడానికి ఇష్టపడుతున్నారని తెలిపారు.
పీజీ వైద్య సీట్లు తక్కువగా ఉండడం:
ఎంబీబీయస్‌ పూర్తిచేసిన వారంతా ఆసక్తి చూపుతుండడం వల్ల పీజీ వైద్యకోర్సులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో ఇటీవల పెంచినవాటితో కలిపి ప్రస్తుతం కన్వీనరు కోటాలో 1190 పీజీ సీట్లున్నాయి. వీటి కోసం ఏటా కనీసం 25వేల మందికి పైగా వైద్యులు పోటీ పడుతున్నారు. ఇన్‌సర్వీసు కోటా కింద క్లినికల్‌ విభాగాల్లో 30శాతం, నాన్‌క్లినికల్‌ విభాగాల్లో 50 శాతం సీట్లు కేటాయిస్తారు. నామమాత్రపు ఫీజులు మినహా… ప్రభుత్వ కళాశాలల్లో పీజీ సీటు వస్తే ప్రత్యేక ఫీజులు ఉండవు. ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీటు వచ్చినా వార్షిక ఫీజులు చెల్లించాలి. యాజమాన్య కోటా సీట్లకైతే అదనంగా రూ.లక్షల్లో డొనేషన్లుంటాయి. మన రాష్ట్రంలో పీజీలో ఉన్న సీట్లు 2532 ఉండగా, ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 1190, కన్వీనరు కోటా కింద ప్రైవేటు కళాశాలల్లో 710 కలిపి 1900 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఎక్కువ మంది క్లినికల్‌ విభాగాలైన జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, పిడియాట్రిక్స్‌ లాంటి కోర్సులను ఇష్టపడుతున్నారు. ఈ సీట్లు 500 మాత్రమే ఉండడంతో ఇన్‌సర్వీసు కోటాలో అర్హత పొందడానికి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో నియామకాల కోసం వైద్యులు పోటీ పడుతున్నారు.
వృత్తిలో స్థిరపడేటప్పటికీ 40 ఏళ్లు:
ఎంబీబీయస్‌ కోర్సు ఆరేళ్లు, ఆ తరువాత పీజీ మూడేళ్లు. అనంతరం సూపర్‌స్పెషాలిటీ కోర్సు మరో మూడేళ్లు. ఇలా వైద్యకోర్సులు పూర్తిచేసేటప్పటికీ తక్కువంటే ఒక అభ్యర్థికి 30 ఏళ్ల వయసు వస్తుంది. వైద్యుడిగా స్థిరపడడానికి కనీసం మరో పదేళ్లు కలిపి 40 ఏళ్లు పడుతుంది. ఈ కారణంగానే పీజీ కోర్సులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని వైద్యులు ఆరాటపడుతున్నారు. అందుకే ఇన్‌సర్వీసు కోటా సీటు కోసం ప్రభుత్వ సర్వీసులో చేరడానికి మొగ్గుచూపుతున్నారు.

 
Comments Off on గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల పోస్టులకు డిమాండ్‌

Posted by on February 6, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: