RSS

మన విద్యార్థులు మెరికలే

06 Feb

మన విద్యార్థులు మెరికలే

* సత్య నాదెళ్ల ఇందుకో ఉదాహరణ
* ఆర్థిక మంత్రి చిదంబరం ప్రశంస
న్యూఢిల్లీ : భారతీయ విద్యార్థులు ఎంత సమర్థులో మైక్రోసాఫ్ట్‌ కొత్త సీఈఓగా నియమితుడైన సత్య నాదెళ్లను చూస్తే తెలుస్తోందని ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రశంసించారు. ఇక్కడి శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎస్‌ఆర్‌సీసీ) విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ మాటలన్నారు. ప్రపంచంలో అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ఫిబ్రవరి 4న సత్య నాదెళ్లను కొత్త సీఈఓగా ఎంపిక చేసుకొన్న సంగతి తెలిసిందే. 38 ఏళ్ల చరిత్ర ఉన్న మైక్రోసాఫ్ట్‌ పగ్గాలను ఒక భారతీయుడు చేపట్టడం ఇదే మొదటిసారి. ‘కొంతమంది భారతీయ విద్యార్థులు.. అమెరికా, లేదా చైనాలో మాదిరిగానే.. ఏమాత్రం తీసిపోరు.. అలా లేకపోతే, మైక్రోసాఫ్ట్‌ అధిపతిగా ఓ 46 ఏళ్ల భారతీయుడికి స్థానం దక్కేదే కాద’ని చిదంబరం అనగానే సమావేశంలో పాల్గొన్న విద్యార్థులంతా ఒకటే చప్పట్లు మోగించారు. సత్య వృత్తిపరంగా ఉండవలసిన ప్రావీణ్యాన్ని కష్టపడి సంపాదించుకుని చైనాలోనో, అమెరికాలోనో, ఐరోపాలోనో తనకు సాటి రాగలిగిన వారి కన్నా ఒక మెట్టు పైన నిలబడినందుకే మైక్రోసాఫ్ట్‌లో ఉన్నత స్థానానికి ఎదిగారని చిదంబరం అన్నారు. మరింత ఎక్కువ విజ్ఞానాన్ని సముపార్జించే ఇతర దేశాల విద్యార్థులతో పోటీ పడి నెగ్గుకు రావలసి ఉంటుందన్న సంగతిని భారతీయ విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి అని కూడా ఆయన అన్నారు. ‘అమెరికా, లేదా చైనాలలో.. మరీ ముఖ్యంగా చైనాలో ఎక్కడో ఒక చోట ఉండే ఒక అజ్ఞాత విద్యార్థితో మీరు పోటీ పడాల్సి వస్తుంది. ఆ విద్యార్థి ఇప్పటికే ప్రపంచంలో అగ్రగామి తొలి 10 విశ్వవిద్యాలయాలలో ఒక దానిలో చదువుతూ ఉంటాడు. మీరు ప్రపంచంలో అగ్రగామి 200 విశ్వవిద్యాలయాల జాబితాలోకి కూడా చేరుకోని విశ్వవిద్యాలయంలో చదవాల్సి వస్తుండవచ్చు. ఈ ప్రపంచానిది- మీకు నచ్చినా లేదా నచ్చకపోయినా- అంతర్జాతీయ స్థాయి. అన్ని నైపుణ్యాలనూను ఇక ఒకే కొలబద్దతో కొలుస్తారు.. అదే అంతర్జాతీయ ప్రమాణం. ఈ విషయాన్ని గ్రహించాల’ని చిదంబరం వివరించారు.

 
Comments Off on మన విద్యార్థులు మెరికలే

Posted by on February 6, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: