RSS

ఉన్నత విద్యలో ప్రమాణాలు అధమం

08 Feb

ఉన్నత విద్యలో ప్రమాణాలు అధమం
* రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు
ముంబయి: ప్రపంచంలోని 200 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో భారతదేశంలోని ఒక్క ఉన్నత విద్యాసంస్థ కూడా లేకపోవడం శోచనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. తెలివైన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇక్కడి విద్యావ్యవస్థలో ఉండేలా చూడాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ముంబయిలోని కిషన్‌చంద్ చెల్లారం ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కళాశాల (కేసీ కాలేజీ) వజ్రోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ఫిబ్రవరి 8న ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ ప్రతిభ లేదన్న మాటే లేదు.. అమర్త్యసేన్, హరగోవింద్ ఖొరానా, చంద్రశేఖర్, వెంకటరామన్ లాంటి నోబెల్ బహుమతి గ్రహీతలు భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నవారేనని.. కానీ దురదృష్టవశాత్తు వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నప్పుడు నోబెల్ పురస్కారాలకు ఎంపికయ్యారని’ అన్నారు. దేశంలోని చాలా విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు అత్యల్ప స్థాయిలో ఉండటంపై ప్రణబ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 650 విశ్వవిద్యాలయాలు, 33 వేల కళాశాలలు ఉన్నాయని… భారత విద్యావ్యవస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదని ఆయన గుర్తు చేశారు. వివిధ కోర్సుల్లో చేరే 18 నుంచి 24 ఏళ్ల వయస్కుల శాతం అమెరికాలో 34, జర్మనీలో 21 ఉండగా మన దేశంలో మాత్రం అది కేవలం 7 శాతమేనని వెల్లడించారు. ఏడు శతాబ్దాల కిందట ఉన్నత విద్యకు భారతదేశం చిరునామాగా ఉండేదని, ఆ వైభవం మళ్లీ సాధించాలని అన్నారు. ఈ ఉత్సవాల్లో మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణ్, ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్, నటుడు అమితాబ్ బచ్చన్, రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ పాల్గొన్నారు. కేసీ కాలేజిలోనే చదివిన అనిల్ అంబానీ అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తన పేరు చివరన ‘ని’ అని ఉండటంతో తనను అంతా సింధీగా భావించి ఆ భాషలో మాట్లాడేవారని చెప్పి నవ్వులు పూయించారు.

Advertisements
 
Comments Off on ఉన్నత విద్యలో ప్రమాణాలు అధమం

Posted by on February 8, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: