RSS

Daily Archives: February 10, 2014

రాష్ట్రంలో 98652 కొత్త ఉద్యోగాలు


 

 

* ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి ఆనం
ఈనాడు, హైదరాబాద్ :రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన రంగాల్లోని అన్ని అభివృద్ధి సూచీలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 98652 ఉద్యోగ ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు అనుమతించామని తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 10న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,346 కొత్త ఉద్యోగాలను మంజూరు చేశామని, మిగిలిన ఖాళీలను భర్తీ చేయడం ద్వారా మానవనరుల కొరత పరిష్కారమవుతుందని, ప్రభుత్వ సేవలు మెరుగ్గా అందుతాయని తెలిపారు.

 

Advertisements
 
Comments Off on రాష్ట్రంలో 98652 కొత్త ఉద్యోగాలు

Posted by on February 10, 2014 in Uncategorized

 

వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల తుది కీ విడుదల


వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల తుది కీ విడుదల * వీఆర్వో పరీక్షలో ఒక ప్రశ్న తొలగింపు
* రెండు సమాధానాల్లో ఏదీ రాసినా మార్కు
* వీఆర్ఏ కీ యథాతథం
* 20న ఫలితాల విడుదల
ఈనాడు, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పరీక్షల తుది కీని ఫిబ్రవరి 10న విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఫిబ్రవరి 2న జరిగాయి. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వీఆర్వో ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నను తొలగించారు. వీఆర్వో ప్రశ్న పత్రంలోనే ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు సరైనవి కావడంతో రెండు సమాధానాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. తుది కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ నెల 20న వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల ఫలితాలను ప్రకటిస్తారు. ఇప్పటికే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తికావడంతో ఇక ఫలితాలపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 1657 మంది వీఆర్వోలు, 4305 మంది వీఆర్ఏలను నియమించేందుకు ఈ పరీక్షలు జరిగాయి.
* తొలగించిన ప్రశ్న
ఒక ఘనపు మీటరు ఘన పరిమాణం గల అల్యూమినియంను ఉపయోగించి 1000 చదరపు అడుగుల అల్యూమినియం రేకును తయారు చేశారు. ఆ రేకు మందం సెంటీమీటర్లలో? అనే ప్రశ్నను తొలగించారు.
* రెండు సమాధానాలూ సరైనవే…
కింది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కి సరిహద్దుగా లేనిది? అనే ప్రశ్నకు రెండు సమాధానాలూ సరైనవి కావడంతో ఈ రెండింటిలో ఏది రాసినా మార్కు ఇచ్చేలా కీని సవరించారు. మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఏది రాసినా సరైన సమాధానమే అవుతుంది.

 
Comments Off on వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల తుది కీ విడుదల

Posted by on February 10, 2014 in Uncategorized

 

యువతకు ఆధునిక విద్య అందించాలి


 

* ప్రణబ్‌ముఖర్జీ
గోండియా (మహారాష్ట్ర): దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న యువతకు ఆధునిక విద్య అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉద్ఘాటించారు. వారు ఆకాంక్షిస్తున్న మార్పును తీసుకురావడానికి ఇది అవసరమన్నారు. గోండియా ఎడ్యుకేషన్‌ సొసైటీ వార్షికోత్సవంలో ఫిబ్రవరి 9న ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారు జనాభాలో 40 శాతానికి పైగా ఉన్నారన్నారు. 2030 నాటికి ప్రపంచంలో పనిచేసే వారిలో అత్యధికులు భారతదేశంలో ఉంటారన్నారు. నూతన శకాన్ని ఆవిష్కరించే ఈ విశాల యువ శక్తి తప్పనిసరిగా విద్యావంతులై, సాధికారిత కలిగి ఉండాలన్నారు.

 

 
Comments Off on యువతకు ఆధునిక విద్య అందించాలి

Posted by on February 10, 2014 in Uncategorized

 

20 లక్షల కొత్త ఉద్యోగాలు !


బ్యాంకింగ్‌ విస్తరణే నేపథ్యం..
*  మానవ వనరుల సంస్థల అంచనా
న్యూఢిల్లీ: వచ్చే 5- 10 ఏళ్లలో బ్యాంకింగ్‌ రంగంలో 20 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకువచ్చే అవకాశం ఉంది. కొత్తగా బ్యాంకింగ్‌ లైసెన్సుల జారీకి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవల విస్తరణకు రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం కలసి పలు చర్యలు తీసుకుంటుండడమే దీనికి నేపథ్యమని నిపుణులు అంటున్నారు. రాబోయే కొన్నేళ్లలో సగానికి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది పదవీవిరమణ చేయనున్నారు కూడా. ఫలితంగా నూతన నౌకరీల సంఖ్య పెరిగే వీలుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మానవ వనరుల సేవల దిగ్గజం రాండ్‌స్టడ్‌ ఇండియా అంచనాల ప్రకారం.. వచ్చే పదేళ్లలో బ్యాంకింగ్‌ రంగం 7లక్షల నుంచి 10 లక్షల కొత్త కొలువులను సృష్టింవచ్చు. 2014లో అత్యధికంగా ఉద్యోగాలను సృష్టించే రంగం బ్యాంకింగేనని చెబుతోంది. మరో పక్క, మణిపాల్‌ అకాడమీ అయితే బ్యాంకింగ్‌ రంగంలో వచ్చే అయిదేళ్లలో 18-20 లక్షల ఉద్యోగాలు రావొచ్చని అంచనా వేస్తోంది. నేరు నియామకాలకు తోడు బ్యాంకింగ్‌కు మద్దతునిచ్చే వివిధ రంగాల్లోనూ ఉద్యోగ సృష్టికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
‘ఇప్పటి వరకూ బ్యాంకింగ్‌ సేవలు అందని గ్రామీణ ప్రాంతాలపై దిగ్గజ బ్యాంకులు కన్నేస్తున్నాయి. తద్వారా వృద్ధి, లాభదాయకతను పెంచుకోవాలని ఆశిస్తున్నాయ’ని రాండ్‌స్టడ్‌ ఇండియా అంటోంది. ‘వచ్చే కొన్నేళ్లలో బ్యాంకింగ్‌లో నియామకాలు పెరగవచ్చని.. కొత్త బ్యాంకుల రాకతో పాటు సగానికి పైగా సిబ్బంది పదవీవిరమణ చేస్తుండడం కలిసివచ్చే అంశమ’ని మెరిట్‌ట్రాక్‌ సర్వీసెస్‌ చెబుతోంది.

 
Comments Off on 20 లక్షల కొత్త ఉద్యోగాలు !

Posted by on February 10, 2014 in Uncategorized

 

రైల్వే కొలువులకు.. మీరు సిద్ధమేనా?


 

భారతీయ రైల్వేలో 26,570 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల అయింది. దీనిలో దక్షిణమధ్య రైల్వేకి 2297 అసిస్టెంట్‌ లోకో పైలట్ల ఖాళీలూ, 542 టెక్నీషియన్ల ఖాళీలూ ఉన్నాయి. వీటి ఉమ్మడి రాతపరీక్షకు సమగ్రంగా ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం!
అసిస్టెంట్‌ లోకో పైలట్స్‌కు విద్యార్హత పదో తరగతితోపాటు ఐ.టి.ఐ. / మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లలో 3 సం|| డిప్లొమా. ఉన్నతస్థాయి కోర్సులు పూర్తిచేసినవారు కూడా అర్హులే. టెక్నీషియన్‌ సిగ్నల్‌ గ్రేడ్‌-3, టెలికమ్యూనికేషన్‌ మెయింటైనర్‌ గ్రేడ్‌-3 పోస్టులకు పదో తరగతితోపాటు ఐటీఐ ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత అవసరం. లేదా డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 పోస్టులకు పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసుండాలి.
వయః పరిమితి: 2014 జులై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు సం||, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సం|| సడలింపు ఉంటుంది.
మక్కువ ఎక్కువ…
అసిస్టెంట్‌ లోకో పైలట్లకు ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. అందుకే ఎక్కువమంది అభ్యర్థులు ఈ పోస్టులపై మక్కువ చూపిస్తారు. ముందుగానే పరీక్ష తేదీని ప్రకటించడం వల్ల నియామకాలు త్వరగా జరిగే అవకాశం ఉంది. జోన్‌లవారీగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి కాబట్టి ఎవరికి నచ్చిన బోర్డుకు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని పరీక్షలూ ఒకేరోజునే జరుగుతాయి.
టెక్నీషియన్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు ఉమ్మడి రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు మాధ్యమంలో ఉంటుంది. ఐ.టి.ఐ. అభ్యర్థులు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం
అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు మొదటి స్థాయిలో రాత పరీక్ష, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండో స్థాయిలో ఆప్టిట్యూడ్‌ పరీక్ష నిర్వహిస్తారు. మూడో దశలో A-1 మెడికల్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు B-1/C-1 మెడికల్‌ పరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష: అసిస్టెంట్‌ లోకోపైలట్‌, టెక్నీషియన్‌ పోస్టులకు ఉమ్మడి రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్షలో 100 లేదా 120 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రంలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ప్రశ్నలు సమంగా ఉంటాయి.
పదోన్నతులు: రాబోయే కాలంలో పదవీ విరమణలు ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా ఈ పోస్టుల్లో చేరినవారు త్వరగా పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. అసిస్టెంట్‌ లోకో పైలట్‌గా చేరిన అభ్యర్థే తరువాత సీనియర్‌ అసిస్టెంట్‌ లోకో పైలట్‌, లోకో పైలట్‌, సీనియర్‌ లోకో పైలట్‌గా పదోన్నతి పొందుతారు.
లోకో పైలట్లు ప్రతిభ ఆధారంగా లోకో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలుంటాయి.
టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 భర్తీ అయిన అభ్యర్థులకు తరువాత స్థాయిలో గ్రేడ్‌-II, గ్రేడ్‌-I, సీనియర్‌ టెక్నీషియన్లుగా పదోన్నతులుంటాయి.
సిలబస్‌
టెక్నికల్‌ విభాగం: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అందరికీ ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి అన్ని బ్రాంచిల నుంచీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
నాన్‌ టెక్నికల్‌ విభాగం:
అరిథ్‌మెటిక్‌: సంఖ్యలు, గ.సా.భా. & క.సా.గు., సూక్ష్మీకరణం, వర్గమానాలు, సగటు, శాతం, నిష్పత్తి- అనులోమానుపాతం, వయసులు, భాగస్వామ్యాలు, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, రైళ్ళు, పడవలు-ప్రవాహాలు, పైపులు-తొట్టెలు, వడ్డీలు, క్షేత్రగణితం, ఎత్తులు-దూరాల మీద ప్రశ్నలు ఉంటాయి.
రీజనింగ్‌: కోడింగ్‌-డీకోడింగ్‌, శ్రేణులు, భిన్న పరీక్ష, పోలిక పరీక్ష, రక్త సంబంధాలు, దిశ పరీక్ష, వెన్‌ డయాగ్రమ్స్‌, మ్యాథమేటికల్‌ ఆపరేషన్స్‌, మిసింగ్‌ నంబర్స్‌ మీద ప్రశ్నలుంటాయి. గమనిక: ఈ రెండు విభాగాల్లో అభ్యర్థులు 100% మార్కులు సాధించే అవకాశం ఉంది.
జనరల్‌ స్టడీస్‌
* స్టాక్‌ జనరల్‌నాలెడ్జ్‌: రైల్వే సంబంధిత ప్రశ్నలుంటాయి. ఇంకా భారత భూగోళశాస్త్రం, ప్రపంచ భూగోళశాస్త్రం, అంతర్జాతీయ సరిహద్దులు, భారత రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలు, జాతీయ చిహ్నాలు, క్రీడలు, బిరుదులు, రచయితలు, పక్షి సంరక్షణ కేంద్రాలు, కేంద్ర సంస్థలు, విద్యుత్‌ కేంద్రాలు, నదులు, డ్యాములు, కాల్వలు, సరస్సులు, ప్రసిద్ధ కట్టడాలు, మొదటి వ్యక్తులు, భారత ఆర్థిక వ్యవస్థ మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి.
* భారతీయ ప్రాచీన చరిత్ర: స్వాతంత్య్ర ఉద్యమం వరకు ప్రశ్నలు అడుగుతారు. ఆధునిక చరిత్ర నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
* పాలిటీ: భారత రాజ్యాంగం గురించి ప్రాథమిక భావనలు, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, చట్టబద్ధేతర సంస్థల గురించి తెలుసుకోవాలి.
* జాగ్రఫీ: విశ్వం, భూమి, ఖండాలు, మహాసముద్రాలు, నదులు, ఖనిజాలు, రవాణా వ్యవస్థ, జనాభా, వ్యవసాయం, భూకంపాలు, తుపానులు, గడ్డిభూములు, పర్వతాలు, పీఠభూములు, జలసంధులు, కాలువల గురించి తెలుసుకోవాలి.
* జనరల్‌సైన్స్‌: భౌతిక, రసాయన, జీవశాస్త్ర అంశాలను చదవాలి. ముఖ్యంగా భౌతికశాస్త్ర అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
* కరెంట్‌ ఎఫైర్స్‌: పరీక్ష జరిగేముందు ఒక ఏడాది కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు, సమావేశాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, క్రీడా పతకాల గురించి తెలుసుకోవాలి.
సంప్రదించాల్సిన పుస్తకాలు
Technical: Mechanical & Automobile Objective Type R.K. Jain, Kurmi
Electrical & Electronics: S.S. Gupta
Non-Technical:
Arthemattic: R.S. Agawrwal, Arihant
Reasoning: R.S. Agarwal
General Studies: Arihant, S.K. Publication
ఎలా సన్నద్ధం కావాలి?
ప్రతిరోజూ ప్రతి సబ్జెక్టు మీదా శ్రద్ధ చూపాలి
* ఒక నిర్ణీత సమయాన్ని ఒక్కో విభాగానికి కేటాయించుకోవాలి
* మనకు తెలియని విభాగాన్ని చదివేటపుడు తెలిసినవారితో బృందచర్చ చేయటం మేలు.
* ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను 3 నెలల్లో పూర్తిచేసి, మిగిలిన నెల రోజుల్లో పునశ్చరణ చేసుకోవాలి * ముందుగానే ప్రాక్టీస్‌/ నమూనా పేపర్ల జోలికి పోకూడదు. ముందు సబ్జెక్టు నేర్చుకొని తరువాత ఎక్కువ నమూనా పేపర్లు సాధన చేయాలి
* అభ్యర్థులు టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ అంశాలకు సమప్రాధాన్యం ఇవ్వాలి.
* అవగాహన లేని విభాగాన్ని ఎక్కువసార్లు అభ్యసిస్తే తొందరగా నేర్చుకొనే అవకాశం ఉంది.
* ‘ఎంతసేపు చదివాం’ అనేది కాకుండా ‘ఎంత నేర్చుకున్నాం’ అన్నది ముఖ్యం
* ఎక్కువగా ప్రాథమికాంశాలు (basics) అడుగుతారు. అందుకని అన్ని విభాగాల్లో వీటిని నేర్చుకోవడం మంచిది.
* రుణాత్మక మార్కులున్నందున పరీక్ష రాసేటప్పుడు తెలిసింది మాత్రమే జవాబుగా గుర్తించాలి.
* ‘ఉద్యోగం సంపాదించాలి’ అనే పట్టుదలను అది సాధించేవరకూ మరచిపోకూడదు.

 
Comments Off on రైల్వే కొలువులకు.. మీరు సిద్ధమేనా?

Posted by on February 10, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: