RSS

ఎయిమ్స్‌ స్థాయికి నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలు

18 Feb

* రూ. 150కోట్ల వంతున కేటాయింపు
ఈనాడు-వరంగల్‌: అఖిలభారత వైద్య, విజ్ఞాన సంస్థ(ఏఐఐఎంఎస్‌) స్థాయికి మన రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ధిపర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక్కో వైద్య కళాశాలకు రూ. 150కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30కోట్లు. మిగిలిన నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రధాన మంత్రి స్వస్థ సురక్ష యోజన(పీఎంఎస్‌ఎస్‌వై) కింద దేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏఐఐఎంఎస్‌ స్థాయిలో అభివృద్ధిపర్చడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్రం ఈ పథకాన్ని రచించింది. ఇందులో రాష్ట్రంలో విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల, అనంతపూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌, వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలలు ఉన్నాయి. పథకం నిధులతో కొత్త పరికరాలు, సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందిస్తారు. దీనికి సంబంధించిన లేఖ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేశవ దేశిరాజు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి(డీవో నెంబరు జడ్‌-28016/22/2012-ఎస్‌ఎస్‌హెచ్‌, తేదీ 2.01.2014) అందింది. దీనికి సంబంధించి త్వరగా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.

 
Comments Off on ఎయిమ్స్‌ స్థాయికి నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలు

Posted by on February 18, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: