RSS

పరిశోధనలకు చేయూతనివ్వాలి

18 Feb

* బయోఏషియా సదస్సులో డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ జీవీ ప్రసాద్‌
హైదరాబాద్:
ఔషధాల తయారీ, టీకా మందులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో భారత్‌ అద్భుత ప్రగతిని సాధించినప్పటికీ ఈ రంగాల్లో మనదైన ఆవిష్కరణలు లేవని, దీనికి పరిశోధనా కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించకపోవడమే ప్రధాన కారణమని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఛైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ అన్నారు. ఫిబ్రవరి 17న సాయంత్రం ఇక్కడ ప్రారంభమైన బయోఏషియా- 2014 సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. బయోటెక్నాలజీ రంగంలో భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలను సృష్టించనుందని, ఈ రంగం అందించే అవకాశాలను తలుచుకుంటేనే ఎంతో ఉత్సుకత, ఆసక్తి కలుగుతుందని పేర్కొంటూ, జీన్‌ థెరపీ, వ్యక్తిగత ఔషధాలు, 3డీ ప్రింటింగ్‌, మానవ అవయవాలను కృత్రిమంగా తయారు చేయడం.. వంటి ఎన్నో వింతలను చూసే రోజు ఎంతో దూరంలో లేదని, ఈ ఆవిష్కరణల్లో పాల్గొనేందుకు భారత్‌ సిద్ధం కావాలని సూచించారు. కొత్త ఔషధాలను ఆవిష్కరించడం ద్వారా జెనిన్‌టెక్‌, ఆమ్‌జెన్‌ వంటి బహుళజాతి సంస్థలు అపారమైన సంపదను సృష్టించినట్లు, ఈ పని మనమెందుకు చేయలేమని ప్రశ్నించుకోవాలన్నారు. 1 ట్రిలియన్‌ డాలర్ల విలువైన ప్రపంచ ఔషధ మార్కెట్లో 700 బిలియన్‌ డాలర్ల వాటా కొత్త ఔషధాలదేనని ఈ సందర్భంగా ఉదహరించారు. మనం ప్రపంచ మార్కెట్‌కు ఎన్నో ఔషధాలు అందిస్తాం, కానీ ఇందులో కొత్త ఔషధాలు ఉండడం లేదని గుర్తు చేశారు. పరిశోధనలకు అనువైన పరిస్థితులను కల్పించేందుకు ప్రభుత్వం విద్య, శిక్షణ సదుపాయాలను పెంపొందించాలని, రిస్క్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లభించే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని కూడా విజ్ఞప్తి చేశారు. పరిశోధనా కార్యకలాపాలు లేకుండా మలి దశ అవకాశాలను అందిపుచ్చుకోలేమని గుర్తించాలని జీవీ ప్రసాద్‌ అన్నారు.

 
Comments Off on పరిశోధనలకు చేయూతనివ్వాలి

Posted by on February 18, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: