RSS

వీఆర్వో పరీక్షలో లక్ష మందిపై అనర్హత వేటు?

20 Feb

ఓఎంఆర్‌’లో వివరాలు, జవాబుల వృత్తాలు నింపడంలో తప్పిదాలు
కొందరు ఇన్విజిలేటర్ల బాధ్యతారాహిత్యం!
రెండ్రోజుల్లో ఫలితాల వెల్లడి!

ఈనాడు – హైదరాబాద్‌ : గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల కోసం పరీక్షలు రాసినవారి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రకారం సుమారు లక్ష మంది వరకు అనర్హులైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఓఎంఆర్‌ షీటులో వ్యక్తిగత వివరాల నమోదు, జవాబుల కింద వృత్తాలను పూరించడంలో అభ్యర్థులు చేసిన తప్పిదాల కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలియవచ్చింది. పరీక్షా కేంద్రాల్లో అప్రమత్తం చేయాల్సిన ఇన్విజిలేటర్లలో కొందరి బాధ్యతారాహిత్యంవల్ల అభ్యర్థులు పెద్దఎత్తున నష్టపోయారు. గ్రామ పరిపాలన అధికారుల (వీఏఓ) పరీక్ష రాసిన అభ్యర్థుల కంటే వీఆర్వో పరీక్ష రాసిన వారిలోనే ఎక్కువ మంది నష్టపోయినట్లు తెలియవచ్చింది. వీఆర్వో ఉద్యోగ ప్రకటన అనుసరించి సుమారు 14 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ నెల రెండో తేదీన పరీక్ష నిర్వహించారు. ఇంటర్‌ విద్యార్హతవల్ల వీఆర్వో ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన కనిపించింది. వీరి జవాబు పత్రాలను మూల్యాంకనంచేసే క్రమంలో అభ్యర్థులు చేసిన తప్పిదాలు వెలుగులోకి వచ్చాయి.
       నమోదు సంఖ్య (రిజిస్ట్రేషన్‌ నెంబరు), అంశం (సబ్జెక్టు), సీరీస్‌, ఇతర వివరాల నమోదుకు గుర్తుగా ఓఎంఆర్‌షీటులో పేర్కొన్న నిర్దేశిత గడుల్లో మాత్రమే వృత్తాలను ఒక పద్ధతి ప్రకారం నింపాలి. అయితే..అనేక మంది అభ్యర్థులు వీటిని పూరించే సమయంలో తప్పులు చేశారని తెలియవచ్చింది. రిజిస్ట్రేషన్‌ నెంబరు ప్రకారం సంబంధిత వృత్తాలను వరుసక్రమంలో పూరించాల్సి ఉండగా కొందరు వరుసక్రమంలో తప్పు చేసినందున నమోదులో తప్పులు అనివార్యమయ్యాయి. ఇక జవాబుల కింద వృత్తాలను నింపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలోనూ అభ్యర్థులు తప్పులు చేశారు. వృత్తాన్ని ఒకసారి మాత్రమే నింపాలి. ఇందుకు భిన్నంగా వ్యవహరించినందున అభ్యర్థులు అధిక సంఖ్యలో నష్టపోయారు. జవాబుల కింద గుర్తించిన వృత్తంలో కాకుండా..పొరబాటున కొందరు మరొక వృత్తాన్ని నింపేశారు. ఆ తరువాత తప్పును గుర్తించి రసాయనం (వైట్నర్‌) సాయంతో చెరిపివేసి, మరొక వృత్తాన్ని నింపారు. ఇలాంటి వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం ఇలా చేయనేకూడదు. ఇలా చేసినట్లయితే..ఆ జవాబుపత్రాన్ని మూల్యాంకనం చేయరు. మాల్‌ప్రాక్టీసు కేసు కింద పరిగణించే అవకాశమూ ఉంది. ఈ విధానంలో వేలమంది అభ్యర్థులు నష్టపోయారని సమాచారం.
       ఐచ్ఛికాల (అబ్జెక్టివ్‌) కింద ఇచ్చిన జవాబులకు గుర్తుగా ఓఎంఆర్‌ షీట్లను స్కాన్‌చేసి, మూల్యాంకనం చేస్తున్నారు. ఈ విధానంలో అభ్యర్థులు నిబంధనలను అనుసరించకుండా ఉంటే అది మూల్యాంకనానికి పనికిరాదని అధికారులు నిర్థారిస్తున్నారు. ఇలా చేయకుండా ఉంటే..అక్రమాలు చోటుచేసుకుంటాయన్నది వారి ఆందోళన. ఈ వివరాలపై అభ్యర్థులకు పదేపదే చెబుతున్నా వారిలో మార్పు కనిపించడంలేదని అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ ఇన్విజిలేటర్ల బాధ్యత కూడా ఉంది. వివిధ శాఖలకు చెందిన వారిని ఇన్విజిలేటర్లుగా వినియోగిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లోవీరు అభ్యర్థులకు ఓఎంఆర్‌షీటు ప్రాధాన్యం, వ్యక్తిగత వివరాలు నమోదు, జవాబుల కింద వృత్తాలను ఎలా నింపాలన్న దానిపై అవగాహన కల్పించకుండానే ముందుకుపోతున్నందువల్ల తప్పిదాలు భారీఎత్తున చోటుచేసుకుంటున్నాయి. అదనంగా ఓఎంఆర్‌ షీటు ఒక దానిని వీరికి అందచేసి అభ్యర్థులకు వివరాలు తెలియచేసేలా ఏర్పాట్లు జరిగినా, ఇందుకు తగిన సమయం ఉన్నా ఇన్విజిలేటర్లలో అత్యధికులు పట్టించుకోవడంలేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామీణ నేపథ్యం నుంచి వస్తున్నవారు, తొలిసారి ఇలాంటి విధానంలో పరీక్ష రాస్తున్నవారు తడబడి మొత్తానికి నష్టపోతున్నారు.
21 లేదా 22న ఫలితాలు!
వీఆర్వో, వీఏఓ పరీక్ష ఫలితాలను ఈ నెల 21 లేదా 22న వెల్లడించబోతున్నారు. ఇప్పటివరకు పది జిల్లాల ఫలితాలు సిద్ధమయ్యాయి. ఇతర జిల్లాల ఫలితాలు సిద్ధమౌతున్నాయి. ఒకవేళ..సమయం మించిపోతున్నట్లయితే…ఫలితాల వెల్లడికి సిద్ధంగా ఉన్న జిల్లాల వరకు ముందుగా తెలియచేసే అవకాశాలు ఉన్నాయి. ఆయా జిల్లాల ప్రతినిధులను పిలిపించి వారికి ఏపీపీఎస్సీ అధికారులు సీడీ అందచేసే అవకాశాలు ఉన్నాయి. గ్రూపు-4 ఉద్యోగాల భర్తీ విషయంలో ఇదే విధానాన్ని అనుసరించారు.

Advertisements
 
Comments Off on వీఆర్వో పరీక్షలో లక్ష మందిపై అనర్హత వేటు?

Posted by on February 20, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: