RSS

అమ్మభాషతోనే భవిత

21 Feb

అమ్మభాషతోనే భవిత
* సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముక్తేశ్వరరావు వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: ‘మాతృభాషకు దూరమైతే సహజంగా ఆలోచించలేం. సృజనాత్మకత లోపిస్తుంది. సమాజంలో అంతరాలు ఏర్పడతాయి. ఆత్మీయత, ఆప్యాయతలకు దూరమవుతాం. సంస్కృతి, సమాజం అర్థం కావడానికి మాతృభాష దోహదపడుతుంది. మాతృభాషను అభివృద్ధి చేయడానికి, దాని వాడకాన్ని పెంచడానికి భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటయింద’ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్‌.ముక్తేశ్వరరావు అన్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘ఈనాడు’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
చిన్నారులను తెలుగుకు చేరువ చేయాలి: భాష అనగానే అధికార భాషా సంఘమే గుర్తుకొస్తుంది. కానీ, నిజానికది అధికార భాషను పాలన భాషగా వాడుతున్నారా, లేదా అన్నది చూసేందుకు ఏర్పడిన సంస్థ మాత్రమే. పాలన భాష అన్నది కేవలం ప్రభుత్వానికి సంబంధించింది. పిల్లలు నేర్చుకునే భాష, ప్రజల భాష, సాహిత్య భాష… ఈ మూడూ పరస్పరం ఆధారపడి ఉంటాయి. పిల్లల్లో భాషా శక్తి పెరగాలి. ఎందుకంటే వాళ్లే ప్రజలుగా ఎదుగుతారు. వారు మాట్లాడే భాషే పెద్దల భాషగా మారుతుంది. అదే సాహిత్యభాష కూడా అవుతుంది.
మాతృభాషలో బోధిస్తే: ఇంగ్లిషులో చదువుకుంటేనే రాణిస్తామని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం సరికాదు. చైనా, జపాన్‌ వంటి దేశాల్లో వారి మాతృభాషలోనే ఉన్నత విద్యాబోధన జరుగుతోంది. ఆ కారణం వల్లే వారు ఎన్నో సృజనాత్మక ప్రయోగాలు చేస్తున్నారు.
శాఖ ద్వారా ఏమేమి చేస్తారు?: ఇంగ్లిషును ఒక అంశంగా నేర్చుకుంటూనే… మిగతా విషయాల్ని మాతృభాషలో నేర్చుకునే అవకాశం కల్పించాలి. తెలుగు మాధ్యమం పాఠశాలలు, కళాశాలల్లో ఇంగ్లిషు విభాగాలను పటిష్ఠం చేయాలి. తెలుగు మాధ్యమంలో చదువుకు ప్రాధాన్యమిచ్చి, ఆంగ్లాన్ని ఒక అంశంగా చక్కగా నేర్పించాలి. ఇదే జరిగితే విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న దానికంటే బాగా రాణిస్తారు. పాలనా పదకోశాన్ని మరింత సమగ్రంగా రూపొందిస్తాం. రాబోయే నియామకాల్లో తెలుగులో రాయగలిగేవారికే ప్రాధాన్యమిస్తాం.
అకాడమీల పునరుద్ధరణతో: భాష పునరుజ్జీవానికి, ఉత్తమ సాహిత్యం కోసం ప్రభుత్వ వ్యవస్థలు చాలా అవసరం. సాహిత్య అకాడమీ, లలితకళ అకాడమీ, సంగీత, నాటక జానపద అకాడమీలు 1985లో రద్దయ్యాయి. మళ్లీ ఇప్పుడు వీటి పునరుద్ధరణ జరుగుతోంది. వీటితో ఆయా రంగాల అభ్యున్నతికి అవకాశం ఉంటుంది. అభినయ రంగాన్ని ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.

తెలుగులోనే వెలుగుదాం!

 
Comments Off on అమ్మభాషతోనే భవిత

Posted by on February 21, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: