RSS

Daily Archives: February 24, 2014

అక్షరక్రమంలో అలుపెరగని చిన్నారులు


 

* పోటీలోపదాలుఅడగలేకఆగినన్యాయనిర్ణేతలు

 

షికాగో: అమెరికాలో ఇటీవల నిర్వహించిన అక్షరక్రమ పోటీ (స్పెల్లింగ్ బీ).. 13 ఏళ్ల భారత సంతతి బాలుడు, 11 ఏళ్ల బాలిక మధ్య ఫలితం తేలకుండానే ముగిసింది. 66 రౌండ్లపాటు సాగిన పోటీలో ఇద్దరు ఏ మాత్రం తగ్గకుండా న్యాయనిర్ణేతలు అడిగిన పదాల అక్షరక్రమాన్ని చెప్పేశారు. చివరికి వారిని అడిగేందుకు న్యాయనిర్ణేతలకు పదాలే కరవయ్యాయి. ఫ్రాంటియర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో ఏడో తరగతి చదువుతున్న కుష్ శర్మ, హైలాండ్ పార్క్ ఎలిమెంటరీలో ఐదో తరగతి చదువుతున్న సోఫియా హాఫ్‌మన్‌లు మిస్సోరి కౌంటీ వార్షిక అక్షరక్రమ పోటీలో తమకు ఇచ్చిన ప్రతీ పదానికి సరిగ్గా అక్షరక్రమాన్ని వివరించారు. చివరకు వీరిని అడిగేందుకు న్యాయమూర్తులకు పదాలే దొరకలేదు. దీంతో వచ్చే నెల ఎనిమిదో తేదీన వాషింగ్టన్‌లో జరిగే స్క్రిప్స్ జాతీయ అక్షరక్రమ పోటీలో వీరికి పోటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

Advertisements
 
Comments Off on అక్షరక్రమంలో అలుపెరగని చిన్నారులు

Posted by on February 24, 2014 in Uncategorized

 

కొత్త రాష్ట్రాల్లోనే ఇక ఉద్యోగాల భర్తీ


విభజన నోటిఫికేషన్‌తోనే ఆంక్షలు అమల్లోకి
* అప్పటికి ఎంపికైన వారికి మాత్రం వెసులుబాటు
* మార్గదర్శకాల్లో తెలపనున్న కేంద్రం
ఈనాడు – హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇప్పటికే నత్తనడకలో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే పూర్తిగా నిలిచిపోనుంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక నోటిఫికేషన్‌ వెలువడ్డప్పటి నుంచి నియామకాలపై ఆంక్షలు అమల్లోకి వస్తాయి. కేవలం అప్పటికి అభ్యర్ధుల ఎంపికలు కూడా పూర్త్తె ఉంటేనే అటువంటి వారి నియామకాలను చేపట్టేందుకు వీలవుతుంది. మిగతా అన్ని రకాల పోస్టుల భర్తీని కొత్త రాష్ట్రాలే చేపడతాయి. రాష్ట్ర విభజన సమయంలో అర్హత గల ఖాళీ పోస్టులనూ పంచుతారు.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా ప్రభుత్వం గత మూడేళ్లగా ప్రచారం చేస్తూ వచ్చినా వాటిలో చాలావరకు వివిధ ఎంపికల దశల్లో మాత్రమే ఉన్నాయి. గత ఏడాది రాష్ట్ర విభజన కసరత్తు మొదలైనప్పటి నుంచి నియామకాల ప్రక్రియ మరింత మందగించింది. ఇప్పుడిక అది కూడా పూర్తిగా నిలిచిపోతుంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనపై కేంద్రం మార్గదర్శకాలను పంపిస్తుంది. వీటితో పాటుగానే ఉద్యోగాల భర్తీపైనా ఆంక్షలను అమల్లోకి తెస్తుంది. నిర్దిష్ట నిష్పత్తిలో ఉద్యోగులను ఉభయ రాష్ట్రాలకు విభజించి అందుకు సంబంధించిన తుది జాబితా వెలువడే వరకు ఖాళీల భర్తీ ప్రక్రియను పక్కన పెడతారు. ఇంతకు ముందు 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలు మొత్తం 6 రాష్ట్రాలుగా మారినప్పుడు వాటికి అనుసరించిన విధానాలే దాదాపుగా ఇప్పుడూ ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర విభజనపై నోటిఫికేషన్‌, ఆ వెనువెంటనే కేంద్రం నుంచి మార్గదర్శకాల జారీఅయ్యే సమయానికే కొన్ని పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ సగం వరకు మాత్రమే పూర్తయి ఉంటే దాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. అంటే అప్పటికే పోస్టులకు అర్హుల జాబితాలు(ప్యానల్‌) తయారయ్యి వాటినింకా ప్రచురించకుండా ఉంటే వాటిని రాష్ట్రాలు అవతరించే వరకు(అపాయింటెడ్‌ డే) నిలిపివేస్తారు. అర్హుల జాబితాలు తయారై, వాటిని ఇటీవలే ప్రచురించి ఉంటే ఎంపికైన అభ్యర్ధులను అపాయింటెడ్‌ డే వరకు పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్‌లోనే వారిని నియమించవచ్చు. అయితే విభజన తర్వాత అవసరమైతే వారు కొత్త రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
నిలిచి పోనున్న పోస్టుల ఏర్పాటు
వివిధ శాఖల్లో కొత్త పోస్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా విభజన అమల్లోకి వచ్చేవరకు పక్కన పెడతారు. అదే విధంగా తాత్కాలిక పోస్టులను క్రమబద్ధీకరించే ప్రతిపాదనలు ఏవైనా ఉంటే వాటిని అమలు చేయరు. నిర్ణీత కాలవ్యవధిలో సమీక్షిస్తూ కొనసాగించే ఉద్యోగుల వ్యవహారాలనూ చేపట్టకూడదు. ఇటువంటి నిబంధనలు రానున్నందునే ఆర్థిక శాఖ ఇటీవల వివిధ శాఖల్లోని తాత్కాలిక పోస్టుల గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భూ సేకరణ వంటి విభాగాల్లోని తాత్కాలిక పోస్టులు, అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పోస్టుల కొనసాగింపుపై ఆయా శాఖాధిపతులే ప్రతిపాదనలను పంపి పొడిగింపును కోరాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ పేర్కొన్నందున నోటిఫికేషన్‌లోగా ప్రతిపాదనలు వెళ్లకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు స్థంభించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులను ఉభయ రాష్ట్రాలకు విభజించేటప్పుడే ఖాళీగా ఉన్న పోస్టులనూ పంచుతారు. అందువల్ల ఆయా ఖాళీలను కొత్త రాష్ట్రాల్లోని ప్రభుత్వాలే భర్తీ చేసుకోవటానికి వీలవుతుంది.

 
Comments Off on కొత్త రాష్ట్రాల్లోనే ఇక ఉద్యోగాల భర్తీ

Posted by on February 24, 2014 in Uncategorized

 

పరీక్షల సమయం విలువైనది – యండమూరి


కడప నగరం, న్యూస్‌టుడే :
పరీక్షల సమయంలో ఉబుసుపోని కబుర్లు కట్టేయండి. మితమైన శాకాహారం మాత్రమే తినండి. పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రం జాగ్రత్తగా చదివి గట్టిగా ఊపిరిపీల్చి వదలి ఆత్మవిశ్వాసంతో పరీక్షరాయండి. ఇంకేముంది మీరు ఊహించినన్ని మార్కులు వస్తాయంటూ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ పిల్లల్లో ప్రేరణ నింపారు. గుంటూరు మాస్టర్‌మైండ్ సీఏ అకాడమీ ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను కడప శివారుల్లోని ఓ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 23న జరిగింది. ఈ సందర్భంగా పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు వచ్చిన యండమూరి వీరేంద్రనాధ్ మాట్లాడారు. పిల్లల తల్లి మదర్‌థెరిసాలా, తండ్రి అబ్దుల్‌కలాంలా ఆలోచనలతో ఉంటే చక్కటి బంగారులోకం తయారవుతుందన్నారు. వ్యక్తిగతంగా ఆరు ఆస్తులు ప్రతి విద్యార్థి సంపాదించుకోవాలని చెప్పారు. చదువు, వ్యక్తిత్వం, ఉత్సాహం, మానసిక ఆరోగ్యం, కీర్తి, ప్రేమ అలవర్చుకోవాలన్నారు. మనిషిలో చెడు అనే దెయ్యాన్ని వదిలేయాలని మంచి అనే దేవుడిని ఆహ్వానించాలన్నారు. అమ్మ, నాన్న, అవ్వతాతలతో ఆత్మీయంగా ఉంటూ వారి ప్రేమాభిమానాలు పొందాలన్నారు. పరీక్షల సమయంలో ఆతృత పనికిరాదని, ఏదైనా పనిచేసే ముందుకు ఒకటిరెండు సార్లు ఆలోచించాక కానీ ప్రారంభించకూడదన్నారు. పిల్లలకు మేథోపరమైన ప్రశ్నలడిగి ఉత్సాహాన్ని నింపారు. గుంటూరు మాస్టర్ మైండ్ సీఏ అకాడమీ సంచాలకులు సంచాలకులు మట్టుపల్లి మోహన్ పిల్లల పది అంశాలను గురించి వివరించి ప్రేరణ నింపారు. భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం, లక్ష్య నిర్దేశికత, సానుకూల దృక్ఫథం, సమయపాలన, ఆలోచన విధానం, జ్ఞాపశక్తి పెంపుదల, లక్ష్య నిర్దరణ, బలం, బలహీనత, అవకాశాలు, అడ్డంకులను అధిగమించటం వంటి అంశాలపై విశ్లేషణ చేశారు. పరీక్షల పట్ల భయం పోగొట్టేందుకు చదువులు ఎలా సాగించాలి ఎలా చదివితే గుర్తు ఉంటుంది అనేది వివరించారు.

 
Comments Off on పరీక్షల సమయం విలువైనది – యండమూరి

Posted by on February 24, 2014 in Uncategorized

 

20 లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రణాళిక


20 లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రణాళిక

* 2017 నాటికి నూరు శాతం అక్షరాస్యతే లక్ష్యం
* కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి పళ్లంరాజు వెల్లడి
కాకినాడ – న్యూస్‌టుడే : విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా దేశంలో 20 లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు వెల్లడించారు. ఫిబ్రవరి 23న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీబీఎస్ఈ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ టీచర్స్)ను ఆయన ప్రారంభించారు. విద్య, బోధనా ప్రమాణాలు, సదుపాయాల విస్తృతికి 12వ పంచవర్ష ప్రణాళికలో రూ.6,500 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వ సాక్షరతా కార్యక్రమాల ద్వారా దేశంలో అక్షరాస్యత 74 శాతానికి చేరుకుందన్నారు. ఇందుకు యునెస్కో పురస్కారం లభించిందన్నారు. 2017 నాటికి భారత్‌తోపాటు ఉప ఖండంలో నూరు శాతం అక్షరాస్యత సాధనకు రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ కృషి చేస్తోందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సంస్థలో సీబీఎస్ఈ బోధించే పాఠశాలలే కాకుండా అన్ని విద్యాబోర్డుల ఉపాధ్యాయులు శిక్షణ పొందవచ్చన్నారు. కేంద్ర పాఠశాల విద్య,సాక్షరతా శాఖ కార్యదర్శి ఆర్.భట్టాచార్య మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు 8 సీబీఎస్ఈ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉన్నాయన్నారు.

 
Comments Off on 20 లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రణాళిక

Posted by on February 24, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: