ఆప్కోలో ఖాళీ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!
* ఎన్నికల కమిషన్ అనుమతి కోరనున్న అధికారులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంస్థ (ఆప్కో)లోని 162 పోస్టుల భర్తీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత (2013) ఆగస్టులో ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించగా ఇటీవలే నియామకాలకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నియమావళి వంటి ఆంక్షలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఖాళీల భర్తీపై దస్త్రం సిద్ధమైన వెంటనే ఆప్కో అధికారులు దానిని ఎన్నికల కమిషన్కు పంపించనున్నారు. ఆప్కోలో ఖాళీలు నెలనెలా పెరుగుతున్నాయి. సిబ్బంది సంఖ్య 500 కంటే తక్కువగా ఉంది. మరో మూడు నెలల్లో 150 మంది పదవీ విరమణ చేయనున్నారు. ఈ తరుణంలో సత్వరమే ఖాళీలను భర్తీ చేయకపోతే దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోస్టుల భర్తీపై అధికారులపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. దీంతో వారు నియామకాల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. నియామకాలను సంస్థ ద్వారా లేదా చేనేత శాఖ ద్వారా లేదా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలనే ప్రతిపాదనలున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.