RSS

మెడికల్‌లో ‘అదనపు’ భారమెంత?

26 Feb

మెడికల్‌లో ‘అదనపు’ భారమెంత?

ఎంపీసీ, బైపీసీ గ్రూపుల ఇంటర్‌ సిలబస్‌లో కొన్ని మార్పులు జరిగాయి. బయాలజీలో ఇవి ఎక్కువ. సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులపరంగా చూస్తే ఈ మార్పుల ప్రభావం లేనట్టే. కానీ లాంగ్‌టర్మ్‌ విద్యార్థులు అధికంగా బైపీసీలోనే ఉంటారు కాబట్టి వీరు కొంత ఇబ్బంది పడుతున్నారు; ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మెడికల్‌ సీటు ధ్యేయంగా పరిశ్రమించే వీరు తమ ధ్యేయం నెరవేర్చుకోవాలంటే ప్రధానంగా ఏ అంశాలపై దృష్టిపెట్టాలి? నిపుణుల సూచనలివిగో…!
లాంగ్‌టర్మ్‌ విద్యార్థులు మారిన సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకోగలిగితే సమస్య ఉండదు. ఇప్పటికే కొంత కోచింగ్‌, అభ్యాసం చేయడం కూడా పూర్తిచేశారు కాబట్టి ఎంసెట్‌లో సులభంగానే నెగ్గవచ్చు.
ఎంసెట్‌ మెడికల్‌ విభాగంలో ఉత్తమ ర్యాంకులు సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు సాధిస్తారు. కానీ అత్యధిక ర్యాంకులు మాత్రం లాంగ్‌టర్మ్‌ విద్యార్థులకే వస్తాయి. సుమారుగా 80 శాతం ర్యాంకులను ఈ విద్యార్థులే పొందుతుంటారు. అయితే 100లోపు ర్యాంకుల్లో అధిక శాతం ర్యాంకులను సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులే సాధిస్తుంటారు.
స్వల్పం… అధికం
సిలబస్‌లో మార్పులు వివిధ సబ్జెక్టుల వారీగా పరిగణనలోకి తీసుకుంటే- భౌతిక, రసాయనిక శాస్త్రాల్లో స్వల్పంగానే ఉన్నాయి. అయితే ఈ మార్పుల్లో అధికభాగం విద్యార్థికి అవగాహన ఉన్నవే. అంటే ఈ విద్యార్థులు పోటీ పరీక్షల దృష్ట్యా చదివినపుడు ఈ అదనపు సిలబస్‌ కూడా చదివే ఉంటారు. అయితే వృక్షశాస్త్ర, జంతుశాస్త్రాల్లో మార్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మార్పులు ఒక భాగమైతే; గత అకాడమీ పుస్తకాలకూ, ఇప్పటి అకాడమీ పుస్తకాలకూ ఉన్న కాన్సెప్టుల తేడాల వల్ల కొంత ఆందోళనకు గురి కావలసివస్తోంది. వాటిని విపులంగా విడిగా తీసుకుని, జవాబులు కచ్చితమైనవి కనుక్కుని వాటి ఆధారంగానే తయారు కాగలిగితే బాగుంటుంది. ముద్రణ ఏ సంవత్సరమైనా తప్పు జవాబుకి మార్కులుండే అవకాశం లేదు. విద్యార్థులు సరైన సమాధానాలనే నేర్చుకోవాలి.
గణితం సిలబస్‌లో మార్పు స్వల్పం. మన గణితం సిలబస్‌ జాతీయ సిలబస్‌తో పోల్చితే ఎక్కువే. కాబట్టి దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడరు. ఇంజినీరింగ్‌ విభాగంలో లాంగ్‌టర్మ్‌ అవసరం విద్యార్థులకు లేదు కాబట్టి స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ వాటిని పరిగణించవలసిన అవసరం లేదు.
భౌతిక, రసాయన శాస్త్రాల్లో మార్పులు ఉమ్మడిగా బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు సంబంధించినవే. ముందుగా వాటి విశ్లేషణ చూసి బయాలజీలోని మార్పుల విశ్లేషణ పరిశీలించవచ్చు. ఈ మార్పుల నుంచి ఎక్కువశాతం విభాగాల్లో ప్రశ్నలు అడగరు. అవన్నీ గత సిలబస్‌కు పొడిగింపు కాబట్టి ఆ ప్రశ్నలు కచ్చితంగా గతంలో ఎంసెట్‌ తయారీలో చదివినవే అని చెప్పవచ్చు.
అధిక సీట్లు లాంగ్‌టర్మ్‌వారికే!
మెడికల్‌లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కలిపి దాదాపుగా 10,000 వరకు సీట్లున్నాయి. వీటిలో 2000కు పైగా సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు సాధిస్తూ ఉంటే సంవత్సరం రోజులు కేవలం ఎంసెట్‌పైనే పూర్తిగా కేంద్రీకరించి చదవడం వల్ల దాదాపు 8000 సీట్లు లాంగ్‌టర్మ్‌ వారు పొందుతున్నారు. సిలబస్‌ మారిన నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు మానసిక ఒత్తిడితో తెలిసిన అంశాలను కూడా ఎక్కువగా తప్పులు చేస్తున్నారు. అలా కాకుండా ఈ రెండు నెలలూ పూర్తిగా అకాడమీ పుస్తకాలకు పరిమితమై సిలబస్‌లో వ్యత్యాసాలపై అవగాహన ఏర్పరచుకుని సిద్ధమవ్వాలి. అప్పుడే గతంలో మాదిరే బయాలజీలో 75 మార్కులపైన, కెమిస్ట్రీలో 35 మార్కులపైన, ఫిజిక్స్‌లో 30 మార్కులపైన సులభంగా సాధించుకోవచ్చు. ఈ మార్కులు తెచ్చుకుంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించినట్లే!
భౌతికశాస్త్రం: 5-10 శాతమే!
మారిన సిలబస్‌ దృష్ట్యా లాంగ్‌టర్మ్‌ బైపీసీ విద్యార్థులు ఎంసెట్‌ ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించాలంటే నిలకడగా రెండు అంశాల్లో అభ్యాసం చేయాలి.
మొదటిది: అకాడమీ పుస్తకాల్లోని ముఖ్యమైన విషయాలు అండర్‌లైన్‌ చేసుకుంటూ చదవాలి. ప్రతి అధ్యాయం చివర ఇచ్చిన వివేచనీయాంశాలు చదవాలి. దీంతో సిద్ధాంతపరమైన సమాధానాలు కచ్చితంగా రాయగలరు. అధ్యాయం చివర ఇచ్చిన లెక్కలు, అదనపు లెక్కలు, ఆ అధ్యాయంలో పూర్వం ఎంసెట్‌ ప్రశ్నపత్రాల్లో ఇచ్చిన ప్రశ్నలు అభ్యాసం చెయ్యాలి. ఫలితంగా ముఖ్యమైన మాదిరి లెక్కల పునశ్చరణ జరుగుతుంది.
రెండోది: ప్రతి అధ్యాయం సారాంశం విశ్లేషణాత్మకంగా చదివి, ఫార్ములాలు రాసుకోవాలి. వారాంతపు అభ్యాస పరీక్షలు రాసి వాటిలో తప్పు చేసిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు నేర్చుకోవాలి. దీనివల్ల పరీక్షలో వేగం, కచ్చితత్వం పెరుగుతాయి.
ఈ సంవత్సరం లాంగ్‌టర్మ్‌ చదివే విద్యార్థులు తాము చదివిన పాఠ్యపుస్తకాలు మారటం వల్ల అకాడమీ పుస్తకాలు చదవటానికి వెనకాడుతూ విద్యాసంస్థల్లో ఇచ్చిన మెటీరియల్‌కు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇది మంచిది కాదు. ఫిజిక్స్‌లో సిలబస్‌ మార్పు 5-10 శాతం మాత్రమే. కాబట్టి పాఠ్యపుస్తకాలు చదవడం కష్టం కాదు.
అదనంగా చేర్చినవాటిలో అతిముఖ్యమైనవి
1. వాయువులు – ఉష్ణగతిక సిద్ధాంతం 2. దృశాశాస్త్రంలో అదనపు అంశాలు 3. సైక్లోట్రాన్‌, సోలినాయిడ్‌, టోరాయిడ్‌ 4. Q factor, power factor 5. విద్యుదయస్కాంత తరంగాలు
రసాయనశాస్త్రం: 10 శాతంలోపే
కెమిస్ట్రీలో మార్పులు 10 శాతంలోపే ఉన్నాయి అని చెప్పవచ్చు. వీటికి సంబంధించి కేవలం ఎస్‌సీఈఆర్‌టీ, XI, XII తరగతుల పుస్తకాలు మొత్తం పునశ్చరణ చేసుకోవాలి. గతంలో కానీ/ రాబోయే ప్రశ్నపత్రాల్లో కానీ కెమిస్ట్రీలో 80పైన ప్రశ్నలు అకాడమీ పుస్తకానికే పరిమితమవుతున్నాయి. ప్రస్తుత అకాడమీ పుస్తకాలకు మూలం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు. అదేవిధంగా గ్రూపుల నుంచి 10 పైన ప్రశ్నలు వస్తున్నాయి. వాటిలో ధర్మాలకే ఎక్కువ ప్రాధాన్యం. వాటిని పట్టికల రూపంలో తయారుచేసుకుని చదివితే ప్రయోజనకరం.
పాఠ్యపుస్తకాలను ఒకటికి రెండుసార్లు చదవగలిగితే సిద్ధాంతపరమైన ప్రశ్నలన్నీ సులభంగా చేయొచ్చు. స్త్టెకియోమెట్రీలో ఇప్పుడు పెరిగిన సిలబస్‌లో సగభాగం పైన గతంలో ఫిజిక్స్‌లో చదివినవే. ఉపరితల రసాయనశాస్త్రానికి కొంత ప్రాధాన్యం ఇవ్వాలి.
కర్బన రసాయనశాస్త్రంలోని మార్పులు చాలా స్వల్పమే. ఒకసారి అభ్యాసం చేయగలిగితే సరిపోతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పరచుకోవడానికి ఎక్కువ పరీక్షలు రాయాలి. సిలబస్‌లో చేర్చిన కొత్త అంశాలన్నిటినీ రెండుసార్లు చదివి పునశ్చరణ చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు

Advertisements
 
Comments Off on మెడికల్‌లో ‘అదనపు’ భారమెంత?

Posted by on February 26, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: