RSS

అందుకోండి..అడవి ‘కొలువులు’

28 Feb

అందుకోండి..అడవి ‘కొలువులు’

విజయనగరం అర్బన్‌ : పోలీసు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులకు అటవీ ఉద్యోగాలు ఆశలు కల్పిస్తున్నాయి. ఏడాదికాలంగా పోలీసు ఉద్యోగప్రకటన లేకపోవడంతో ఎదురుచూస్తున్న అభ్యర్థులు ప్రత్యామ్నాయంగా అటవీశాఖ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. డిగ్రీ, ఐటీఐలతో పాటు పది, ఇంటర్‌ అర్హతలతో పోటీపడే అవకాశంతో జిల్లాల నుంచి సిద్ధమయ్యే అభ్యర్థుల సంఖ్య పెరగనుంది.
* జోనల్‌స్థాయిలో ఎంపిక
అటవీ రేంజరు, సెక్షను, అటవీ బీట్‌, సహాయ బీట్‌ అధికారులతో పాటు తానదార్స్‌, బంగ్లావాచ్‌మెన్‌ ఉద్యోగాలు, ఐటీఐ అభ్యర్థులకు సాంకేతిక సహాయకుల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యాయి. మొదటి రెండు ఉద్యోగాలకు డిగ్రీ, బీట్‌ అధికారుల ఉద్యోగానికి ఇంటర్‌, మిగిలిన వాటికి పదోతరగతి అర్హతగా పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపిక విధానం జోనల్‌ స్థాయిలో ఉంటోంది. పురుషులతో పాటు స్త్రీలకు పోటీపడే అవకాశం కల్పించారు. వయోపరిమితి మినహాయింపుతో పోటీ పెరగవచ్చనేది వ్యక్తమవుతున్నా పరిమితఖాళీలు పోటీపై ప్రభావాన్ని చూపుతుతున్నాయి.
* పరుగు పందెం స్థానంలో నడకపోటీ
రాత పరీక్ష, శారీరకసామర్ధ్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ముందుగా రాతపరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి 1 : 2 నిష్పత్తిలో శారీరకసామర్ధ్యపరీక్షకు ఎంపిక చేస్తారు. శారీరక సామర్థ్య పరీక్ష పోలీసు ఉద్యోగాలకు కొంత భిన్నంగా ఉంటుంది. పరుగుపందెం స్థానంలో నడకను అమలు చేస్తున్నారు. 25 కిలోమీటర్ల దూరాన్ని నాలుగుగంటలు, మహిళలకైతే 16 కిలో మీటర్ల దూరాన్ని నాలుగు గంటల్లో పూర్తి చేయాలి. ఎత్తు, ఛాతీ విషయంలో పోలీసు ఉద్యోగాలకంటే కొంత వెలుసుబాటు ఉంటుంది. ఎత్తు 163 సెం.మీ, ఛాతీ 79 + 5 విషయంలో మహిళలకు కొంత మినహాయింపు ఇస్తారు. సాంకేతిక విద్యార్థులకు శారీరక పరీక్షలు ఉండవు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం
ఉద్యోగాలకు మార్చి మూడోతేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థి ఫోటో, సంతకం, పదోతరగతి ధ్రువపత్రం, కులపత్రం, మెడికల్‌ ధ్రువపత్రం తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో స్కాన్‌ చేయాలి. జనరల్‌, ఓబీసీ కేటగిరీలకు ఒక్కో పోస్టుకు రూ.300 రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ.150 పోస్టులకు విడివిడిగా చెల్లించాలి. * పోలీసు తరహాలోనే అటవీశాఖ విధులు అటవీశాఖ అధికారులు, సిబ్బంది పోలీసు తరహాలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. అటవీ సంపద పరిరక్షించే దిశగా ఆశాఖ పనిచేస్తుంది. ఇందుకు పోలీసు తరహాలోనే ఖాకీ దుస్తులు ధరించి విధులు అడవుల్లో నిర్వర్తిస్తారు. పోలీసుస్టేషన్ల తరహాలోనే అటవీశాఖ సిబ్బందికి కూడా పరిధులు కేటాయిస్తారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయా పోస్టుల కోసం నిరుద్యోగ యువత పోటీ పడుతున్నారు. ఈ శాఖలో సహాయ బీట్‌ ఆఫీసరు, బీట్‌ఆఫీసరు, సెక్షన్‌ ఆఫీసరు, డిప్యూటీ రేంజరు, రేంజర్లు ఉంటారు. వీరందరికి పర్యవేక్షణాధికారిగా జిల్లా అటవీశాఖాధికారి వ్యవహరిస్తారు.ఈ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నిత్యమూ అప్రమత్తంగా వ్యవహరించాలి.అటవీ సంపదను కాపాడటం, అభివృద్ధి పర్చడంతోపాటు దొంగలను పట్టుకొనేందుకు గస్తీలు తిరగాల్సి వస్తుంది. ఒక్కొక్క బీట్‌ ఆఫీసరుకు 1000 నుంచి 1500 హెక్టార్ల అటవీ పరిధి ఉంటుంది. ఆయా ప్రాంతంలో కలప నేరాలను నియంత్రించాలి. గస్తీచేసే వివరాలను నిత్యమూ డైరీలో నమెదు చేసుకుని ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రతీ విషయాన్ని అధికారులకు తెలియజేయాలి. అక్రమ కలప, అటవీ దొంగల కదలికలపై ఎప్పటికప్పుడు సహాయ, బీట్‌ ఆఫీసర్లు సమాచారం ఇవ్వాల్సి ఉంది. సెక్షన్‌ ఆఫీసరు పరిధిలో ఈ బీట్‌ ఆఫీసర్లు పని చేస్తారు. రోజురోజుకు పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు, అటవీ జంతుల నుంచి రక్షణ పొందడానికి అటవీశాఖ అధికారులు, సిబ్బందికి కూడా ఆయుధాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీట్‌ ఆఫీసర్ల పోస్టులకు పురుషులతో పాటు మహిళలు పోటీ పడుతున్నారు. ఆయా పోస్టుల భర్తీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంది. దీంతో మహిళల ముందుకొస్తున్నారు.

Advertisements
 
Comments Off on అందుకోండి..అడవి ‘కొలువులు’

Posted by on February 28, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: