RSS

కాకినాడ జేఎన్‌టీయూలో ప్రతిష్ఠాత్మక విద్యాకేంద్రం

03 Mar

కాకినాడ జేఎన్‌టీయూలో ప్రతిష్ఠాత్మక విద్యాకేంద్రం

* దేశంలోనే తొలి ఉపాధ్యాయ విద్య పరిశోధన, శిక్షణ సంస్థ
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో పరిశోధన, శిక్షణకు ఉద్దేశించిన ఓ జాతీయ స్థాయి సంస్థ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో త్వరలో ప్రారంభంకానుంది. ఉపాధ్యాయ విద్యపై ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. యూజీసీ వివిధ రంగాలపై దేశవ్యాప్తంగా ఇంటర్ యూనివర్సీటీ సెంటర్లను ఏర్పాటుచేసి పరిశోధనలు నిర్వహిస్తుంటుంది. అవసరమైన శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించే ఇలాంటి కేంద్రాలు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, ఇండోర్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇదే క్రమంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ప్రత్యేక పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించడంతో కేంద్ర మానవ వనరుల శాఖ అంగీకరించింది. సుమారు 300 కోట్ల రూపాయలతో కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఈ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశ విదేశాల్లోని నిపుణులను రప్పించి ఉపాధ్యాయులు, అధ్యాపకులకు శిక్షణ ఇప్పించడం, సిలబస్‌లో కాలానుగుణంగా తీసుకురావలసిన మార్పులపై పరిశోధన నిర్వహించడం ఈ సంస్థ లక్ష్యం. జేఎన్‌టీయూ కాకినాడ 70 ఎకరాల వరకు విస్తరించి ఉంది. వాటిలో ఐదెకరాలను ఈ పరిశోధన కేంద్రానికి కేటాయించారు. నిర్మాణాలు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఈ సంస్థ కార్యకలాపాలను యూనివర్సీటీ ప్రాంగణంలోనే కొనసాగించే ఏర్పాట్లు చేసినట్లు జేఎన్‌టీయూ కాకినాడ ఉపకులపతి తులసీదాస్ వెల్లడించారు. నర్సరీ నుంచి ఉన్నత విద్యకు సంబంధించినంత వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వివిధ అంశాలపై ఈ కేంద్రం శిక్షణ ఇస్తుందని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి వెల్లడించారు.

 
Comments Off on కాకినాడ జేఎన్‌టీయూలో ప్రతిష్ఠాత్మక విద్యాకేంద్రం

Posted by on March 3, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: