RSS

తొలిదశకు దిశానిర్దేశం

06 Mar

తొలిదశకు దిశానిర్దేశం

సివిల్స్‌ ప్రస్థానంలో తొలిదశ అయిన ప్రిలిమినరీ ఎంతో ముఖ్యమైనది. దీన్ని విజయ వంతంగా అధిగమించడానికి ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి? ప్రిలిమ్స్‌ పరీక్ష తాజా ధోరణులను ఆకళింపు చేసుకోవటానికి ఉపయోగపడే మార్గదర్శక సూచనలు… ఇవిగో!
ఆగస్టు 24న నిర్వహించబోయే సివిల్‌ సర్వీసెస్‌- 2014 ప్రిలిమినరీకి 6- 6.5 లక్షల మంది దరఖాస్తు చేస్తారని అంచనా. వీరిలో 4.5- 5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారు. మనరాష్ట్రం నుంచి దరఖాస్తు చేసే 30 వేల మందిలో 17 మంది పరీక్ష రాసే అవకాశముంది. జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14,000+ ర్యాంకర్లు డిసెంబర్లో జరిగే మెయిన్స్‌ రాయడానికి అర్హత పొందుతారు.
సివిల్స్‌ ప్రిలిమినరీకి వ్యూహం ఏ తీరులో ఉండాలనేది కొత్తగా సంసిద్ధమయ్యేవారిని వేధించే ప్రశ్న. పునాది నుంచి అధ్యయనం ఆరంభించటమే సరైన మార్గం. అంటే.. సిలబస్‌ రూపం గ్రహించి, పరీక్ష తాజా ధోరణులను సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి.


ప్రిలిమినరీ పరీక్ష లక్ష్యం వడపోత ద్వారా అభ్యర్థుల సంఖ్యను వీలైనంత కుదించడం. దీనితోపాటు వారిలో సివిల్స్‌ కెరియర్‌కు తగిన అభిరుచి ఉన్నదో లేదో కూడా పరీక్షించే ప్రయత్నం చేస్తారని ప్రశ్నల సరళి సూచిస్తుంది.
సమయ ప్రణాళిక
సమగ్ర అధ్యయనం కోసం ప్రణాళికాబద్ధంగా సమయాన్ని కేటాయించుకోవడం చాలా ముఖ్యమని తెలిసిందే. ఈ టైం టేబుల్‌ ఇతరులు సూచించినది కాకుండా ఎవరికి వారే సొంతంగా రూపొందించుకోవాలి. మొదట ఒక వారానికి ఈ ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఆపై పదిహేను రోజులకు; దాన్ని పాటించాక 30 రోజులకు! చివరి టైంటేబుల్‌ మిగతా కాలవ్యవధికి సరిపోయేలా నిర్ణయించుకోవాలి. ఈ ప్రణాళికలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యేలా జాగ్రత్త పడటం ముఖ్యం.
సమయ ప్రణాళికను పకడ్బందీగా పాటించటమే కాదు; తరచూ అధ్యయనం తీరును సమీక్షించుకుంటూ మెరుగుపరచుకుంటూ ఉండాలి. ఒక్కో విభాగం పూర్తిచేసి దానిపై పరీక్ష పెట్టుకోవాలి. స్కోరు 75% వస్తే సరైన దిశలో ఉన్నట్లే. కొంతకాలం గడిచాక అదే విభాగంలో మళ్లీ పరీక్ష రాసి స్కోరు చూసుకోవాలి. దానిలోనూ అదేతరహా మార్కులు వస్తే మరో విభాగంపై దృష్టి పెట్టవచ్చు. ఇలా విభాగాలన్నింటినీ పూర్తిచేసి అన్ని విభాగాలు కలిసిన గ్రాండు టెస్టులు రాయాలి. వీటిలో కనీసం 65% (నెగెటివ్‌ మార్కులు తగ్గాక) మార్కులు తెచ్చుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. 65% స్కోరు నిలకడగా వస్తుంటే గెలుపు దారిలో ఉన్నట్టేనని నమ్మకంగా భావించవచ్చు.
పేపర్‌-1లో సిలబస్‌ మరీ ‘జనరల్‌’ స్వభావంతో ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి ఏమేం వస్తాయో అంచనా వేయడం కష్టం. మరేం చేయాలి? గత కొద్దిఏళ్ళుగా వస్తున్న ప్రశ్నలను విశ్లేషిస్తే లక్ష్యాన్ని చేరుకోగలిగే దారి కనపడుతుంది.


మూడు విభాగాలకు ప్రాధాన్యం
ఈ మూడు సంవత్సరాల ప్రశ్నలను బేరీజు వేస్తే భారతీయ రాజకీయ వ్యవస్థ, ఆర్థిక సాంఘికాభివృద్ధి, భౌగోళిక వ్యవస్థల ప్రాధాన్యం కొనసాగుతోందని గుర్తించవచ్చు. ప్రశ్నల స్వభావాన్ని బట్టి పేపర్‌-1 అభ్యర్థుల అభిరుచిని కూడా పరీక్షిస్తోందని నిర్ధారణకు రావచ్చు.
* రాజకీయ వ్యవస్థలో అధిక ప్రశ్నలు పాలనకు సంబంధించిన వివిధ అంశాలు, రాజ్యాంగ సంస్థలపై వచ్చాయి.
* ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ద్రవ్య విధానం, భారతీయ రిజర్వ్‌ బ్యాంకు పాత్రలపై ప్రశ్నలు వచ్చాయి.
* పర్యావరణంలో దేశంలోని వృక్ష, జంతు సంపద గురించి అడిగారు.
అభ్యర్థులు మొదట పేపర్‌-1లోని వివిధ విభాగాల్లోని ప్రాథమికాంశాలను అర్థం చేసుకోవాలి. మన రాష్ట్ర విద్యార్థుల్లో చాలామందికి సిలబస్‌లోని దాదాపు అన్నివిభాగాలూ కొత్తే. పదో తరగతి తరువాత ఎక్కువమంది సైన్స్‌ కానీ, కామర్స్‌ గానీ ఎంచుకుంటూ ఉండడమే దీనికి కారణం. అంశాలు కొత్తవి కాబట్టి మౌలిక విషయాలపై పట్టు ఏర్పరచుకోవడం అవసరం. దీని తరువాత గత సంవత్సరాల్లో అడిగిన ప్రశ్నలపై అవగాహనకు ప్రయత్నించాలి. అయితే ఏటా ప్రశ్నల తీరు మారుతుంటుందని మరచిపోకూడదు. తరువాత చేయాల్సింది ప్రతి విభాగంలోనూ వర్తమాన అంశాలపై దృష్టి కేంద్రీకరించడం.

Advertisements
 
Comments Off on తొలిదశకు దిశానిర్దేశం

Posted by on March 6, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: