RSS

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు!

11 Mar

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు!

* 12 నుంచి ప్రారంభం
* 9 గంటల తర్వాత అనుమతిచ్చేది లేదు
– ఇంటర్ బోర్డు స్పష్టీకరణ
ఈనాడు-హైదరాబాద్: ఈ నెల 12వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం మార్చి 10న ప్రకటించింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకరనాయక్, ఇంటర్ విద్యా శాఖ కమిషనర్ అధర్‌సిన్హా, పరీక్షల నిర్వహణ అధికారి భాస్కర్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను 9,29,090 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం పరీక్షలను 10,49,289 మంది విద్యార్థులు (మొత్తం:19,78,379) రాయబోతున్నారు. 2,661 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగబోతున్నాయి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోనుంది. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.00 గంటలకు ప్రారంభం అవుతాయి. విద్యార్థులను 8.30 గంటలకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గదుల్లోకి ప్రవేశించిన అనంతరం విద్యార్థులకు 8.45 నుంచి 9.00 గంటల మధ్య జవాబుపత్రాలను అందచేస్తారు. 8.45 నుంచి 9.00 గంటల (15 నిమిషాలు) మధ్య వచ్చే విద్యార్థులు తగిన కారణాలు చూపిస్తేనే..లోపలికి అనుమతినిస్తారు. 9.00 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతినివ్వరు. రానున్న పరీక్షల నుంచి ఈ విధానాన్ని కట్టుదిట్టంగా అమలుచేయనున్నట్లు రామశంకర్‌నాయక్ వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు తప్ప మిగిలిన వారు ఎవరూ సెల్‌ఫోన్లను ఉపయోగించకూడదు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆయా కేంద్రాల నుంచి మెస్‌జేలు పంపుతున్నట్లయితే..వాటిని పసిగట్టేందుకు ‘గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు.

 
Comments Off on ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు!

Posted by on March 11, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: