RSS

నియామకాల అంచనాల్లో మన దేశమే ముందు

12 Mar

* తర్వాతి స్థానాల్లో తైవాన్‌, న్యూజిలాండ్‌
* విమానయానం, ఐటీ, రిటైల్‌ రంగాల్లో ఎక్కువ అవకాశాలు
న్యూఢిల్లీ : ఉద్యోగ నియామకాల విషయంలో భారత్‌ అత్యంత ఆశావహంగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే వచ్చే మూడు నెలల్లో మన దేశంలోని కంపెనీలే కొత్త ఉద్యోగాల నియామకాలపై అత్యంత భరోసాతో ఉన్నాయి. విమానయానం, ఐటీ, ఐటీఈఎస్‌, రిటైల్‌ వంటి రంగాల్లో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారమిక్కడ విడుదల చేసిన మ్యాన్‌పవర్‌ గ్రూపు ‘ఉద్యోగ భవిష్యత్‌ అంచనాల సర్వే’ ప్రకారం.. భారత్‌లో 41 శాతం కంపెనీలు ఈ ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు, పారిశ్రామికీకరణ; ప్రారంభ స్థాయి కంపెనీలు పెరగడం; భారత్‌ పెట్టుబడులను ఆకర్షిస్తుండడం వంటివన్నీ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తున్నాయని మ్యాన్‌పవర్‌గ్రూపు ఇండియా ఎండీ ఎ.జి. రావు పేర్కొన్నారు. సర్వే విశేషాలు..

* సర్వేలో పాలుపంచుకున్న ఏడు రంగాల్లోనూ నియామకాలు చేపట్టాలనే ఆసక్తి వ్యక్తమైంది. ముఖ్యంగా విమానయానం, ఐటీ-ఐటీఈఎస్‌, రిటైల్‌ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
* భారత్‌లో అంతక్రితం ఉన్న అనిశ్చిత వ్యాపార వాతావరణం వల్ల నియామాకాల్లో కాస్త స్తబ్దత ఉండేది. అయితే ఈ ఏడాది పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దేశంలోని 5302 కంపెనీలను సర్వే చేయగా ఈ విషయం తేలింది.
* అమెరికా, ఇతర దేశాల నుంచి పొరుగుసేవలకు గాను గిరాకీ పెరగడంతో ఇంజినీరింగ్‌, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యం ఉన్నవారికి తలుపులు బార్లా తెరచుకోనున్నాయి.
* చాలా వరకు ప్రపంచ దేశాల్లో నియామకాలు ఓ మోస్తరుగా ఉండనున్నాయి. అక్కడా ఉద్యోగ సృష్టిపై కంపెనీలు ఆశావహంగానే ఉన్నాయి.
* సర్వేలో పాల్గొన్న 42 దేశాల్లో 38 దేశాలో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలనే భావిస్తున్నాయి. ఈ విషయంలో భారత్‌ తర్వాత తైవాన్‌, న్యూజిలాండ్‌, టర్కీ, కోస్టారికాలున్నాయి.
* మరో పక్క ఇటలీ, చెక్‌ రిపబ్లిక్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో ఉన్న ఉద్యోగాలనే తగ్గించుకోవాలన్న భావన కనిపిస్తోంది. గత నాలుగు త్రైమాసికంలో ఇలా జరగడం ఇది రెండో సారి.
* చాలా వరకు రంగాల్లో, దేశాల్లో మెరుగుదల కనిపిస్తోంది. అయితే అది వేగంగా ఏమీ లేదు.
ఎన్నికలు పూర్తయితే మరిన్ని భర్తీలు: నౌకరీ.కామ్‌
ఫిబ్రవరిలో భారత్‌లో నియామకాల ప్రక్రియ జోరందుకుంది. ఎన్నికలపై అనిశ్చితి తొలగిన తర్వాత మరిన్ని ఉద్యోగావకాశాలు లభించవచ్చని నౌకరీ.కామ్‌ తన నివేదికలో వెల్లడించింది. జనవరి 2014లో అంతక్రితం నెలతో పోలిస్తే ఉద్యోగ కార్యకలాపాలు 13 శాతం మేర పెరిగాయి. ఇక ఫిబ్రవరి 2014కు నౌకరీ జాబ్‌ స్పీక్‌ సూచీని గమనిస్తే 1502 వద్ద నిలిచింది. ఇది జనవరితో పోలిస్తే 3%; ఫిబ్రవరి 2013తో పోలిస్తే 10 శాతం మేర వృద్ధి చెందింది. జనవరితో పోలిస్తే కాస్తంతే పెరిగినా.. ఇది ఎన్నికల ఏడాది కావడం వల్ల చాలా వరకు కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయని నౌకరీ.కామ్‌ యాజమాన్య సంస్థ ఇన్ఫోఎడ్జ్‌ ఎండీ, సీఈఓ హితేశ్‌ ఒబెరాయ్‌ పేర్కొన్నాయి.
* ఫిబ్రవరిలో వాహన, యంత్ర పరికరాల రంగాల్లోని ఉద్యోగావకాశాల్లో మంచి వృద్ధి కనిపించగా.. బ్యాంకింగ్‌-ఆర్థిక, బీపీఓ రంగాలు స్వల్ప వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
* ఐటీ, నిర్మాణ రంగాలు మాత్రం 7% చొప్పున సూచీలో క్షీణతను నమోదు చేసుకున్నాయి. బీమా కూడా 3% మేర తగ్గింది.
* అన్ని మెట్రో నగరాల్లోకీ చెన్నైలో అత్యంత ఎక్కువ నియామకాలు కనిపించగా.. బెంగళూరు, ఢిల్లీలు సైతం ఫర్వాలేదనిపించాయి.

 

Advertisements
 
Comments Off on నియామకాల అంచనాల్లో మన దేశమే ముందు

Posted by on March 12, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: