RSS

బ్లూటూత్ గడియారంతో కాపీయింగ్ యత్నం

13 Mar

* వైజాగ్‌లో విద్యార్థి పట్టివేత
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో బ్లూటూత్ సౌకర్యం కలిగిన గడియారం ద్వారా కాపీయింగ్ (మాల్‌ప్రాక్టీసు)కు ప్రయత్నించిన విద్యార్థిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన వైజాగ్ బుచ్చిరాజపాలెంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చోటుచేసుకున్నట్లు మార్చి 12న ఇంటర్ విద్యా మండలి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ద్వితీయ సంవత్సరం తెలుగు, సంస్కృతం, హిందీ పేపరు-2, ఇతర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 8,96,095 (జనరల్+ఒకేషనల్) మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా వీరిలో 46,943 (5.24%) మంది గైర్హాజరయ్యారు. వెలుతురు తక్కువగా ఉండే పరీక్షా కేంద్రాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఇంటర్ విద్యామండలి ఆదేశించింది. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలు పని చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. తెలుగు ప్రశ్నపత్రంలో రెండుచోట్ల అర్థాలు మారేలా ముద్రణ జరిగినందున వెంటనే వాటిని సవరిస్తూ విద్యార్థులకు వివరించినట్లు ఇంటర్ విద్యావర్గాలు వెల్లడించాయి.
ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించాలని ఆదేశించామనీ, అయినా 9.00 గంటల సమయంలో విద్యార్థులు ఎవరూ పరీక్షా కేంద్రాల్లోకి రాలేదని ఇంటర్ విద్య మండలి ప్రకటించింది.

 
Comments Off on బ్లూటూత్ గడియారంతో కాపీయింగ్ యత్నం

Posted by on March 13, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: