RSS

Daily Archives: March 18, 2014

కొలువుల మేలుకొలుపు!


కొలువుల మేలుకొలుపు!

బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా ఉన్నవారు రాబోయే నోటిఫికేషన్ల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రకటన వెలువడిన తర్వాతే పరీక్షకు సిద్ధమవటం చాలామంది అలవాటు. కానీ దానివల్ల తగినంత వ్యవధి దొరకదు. అందుకే అలాంటివారు సన్నద్ధతను వీలైనంత ముందస్తుగానే ప్రారంభించటం ఉత్తమం!
ఇతర పోటీపరీక్షలకూ, బ్యాంకు పరీక్షకూ ముఖ్య భేదం ఏమిటంటే… ప్రశ్నను సాధించడానికి ఉండే సమయం. బ్యాంకు పరీక్షల్లో 200 ప్రశ్నలను 2 గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రశ్నకు సగటున దొరికే సమయం 36 సెకండ్లే. అందుచేత అభ్యర్థులకు చాలా ఎక్కువ సాధన అవసరమవుతుంది.
నోటిఫికేషన్‌ విడుదల తేదీ నుంచి పరీక్ష తేదీకి దాదాపుగా 2 నెలల వ్యవధి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు పరీక్షలన్నీ ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నందున ఒక్కోసారి ఈ సమయం 2 నెలల కంటే తక్కువే ఉంటోంది. ఈ పరిమిత సమయంలో సరైనవిధంగా సాధన చేసి ఎక్కువసంఖ్యలో ప్రశ్నలకు జవాబులు గుర్తించడం కష్టమవుతుంది.
అందుచేత బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలనుకునేవారు నోటిఫికేషన్లు ఇంకా రాని ఈ సమయం నుంచే పరీక్ష కోసం తమ సన్నద్ధత మొదలుపెట్టడం శ్రేయస్కరం. దీనివల్ల అభ్యాసానికీ, సాధనకూ కావాల్సినంత సమయం లభ్యమయ్యే వెసులుబాటు ఉంటుంది.
మొదటిసారి బ్యాంకు పరీక్ష రాయబోయేవారు ఆ పరీక్షకు సంబంధించిన కనీస అవగాహన పెంచుకోవాలి. అందుకు రాయబోయే ఆఫీసర్‌/ క్లర్క్‌ పరీక్ష గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. దానివల్ల పరీక్షలోని సబ్జెక్టులు, వాటిల్లోని ప్రశ్నలు ఏ విధంగా, ఏ స్థాయిలో ఉంటాయో అవగతమవుతుంది. తద్వారా పరీక్ష కోసం సన్నద్ధతను ఏ స్థాయి నుంచి మొదలుపెట్టాలో తెలుస్తుంది.
ప్రస్తుతం అభ్యర్థులు ఆఫీసర్లు, క్లర్కులూ అనే భేదం లేకుండా అన్ని పరీక్షలూ రాస్తున్నారు. వాటన్నింటిలో ఒకే విధమైన సబ్జెక్టులు ఉండటం వల్ల ఒక తయారీతో ఏ బ్యాంకు పరీక్షనైనా బాగా రాయవచ్చు.
సబ్జెక్టులు ఐదు
ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ, ఆర్‌బీఐలు నిర్వహించే ఆఫీసర్లు/ క్లర్క్‌ పరీక్షల్లో ఐదు సబ్జెక్టులుంటాయి.
1) రీజనింగ్‌
2) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ
3) జనరల్‌ ఇంగ్లిష్‌
4) జనరల్‌ అవేర్‌నెస్‌
5) కంప్యూటర్‌ నాలెడ్జ్‌.
ఆఫీసర్స్‌, క్లర్క్‌ పరీక్షల్లో ఒకేవిధమైన సబ్జెక్టులు ఉన్నప్పటికీ ప్రశ్నల స్థాయిలో తేడా ఉంటుంది. ఆఫీసర్స్‌ పరీక్షలోని ప్రశ్నలు హెచ్చుస్థాయిలో, క్లర్క్‌ పరీక్షలో తక్కువ స్థాయిలో ఉంటాయి. అయితే మొదటిసారి బ్యాంకు పరీక్ష రాస్తున్నవారు ఈ సబ్జక్టులన్నింటినీ అవగాహన చేసుకుని, అన్నిస్థాయుల ప్రశ్నలనూ సాధన చేస్తే ఏ పరీక్షనైనా బాగా రాయగలుగుతారు.
ఎలా సన్నద్ధం కావాలి?
1) రీజనింగ్‌: పాఠశాల, కళాశాల స్థాయుల్లో కాకుండా పోటీ పరీక్షల్లో మాత్రమే ఉండే విభాగం ఇది. మాథ్స్‌, నాన్‌-మాథ్స్‌ అనే భేదం లేకుండా అందరూ చేయగలిగే, ఆసక్తి కలిగించే విభాగం. అభ్యర్థుల తెలివితేటలు, తార్కికజ్ఞానం తెలుసుకునేలా వివిధ రకాల టాపిక్స్‌ నుంచి ప్రశ్నలుంటాయి.
క్లరికల్‌ పరీక్షలో కోడింగ్‌-డీ కోడింగ్‌, అనాలజీ, ఆల్ఫబెట్‌, సీక్వెన్సెస్‌, క్లాసిఫికేషన్‌, రక్తసంబంధాలు, సీటింగ్‌ అమరిక, దిశలు, డేటా సఫిషియన్సీ మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి. ఆఫీసర్ల పరీక్షలో వీటితోపాటు పజిల్‌ టెస్ట్‌, ఎలిజిబిలిటీ టెస్ట్‌, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్‌, ఇన్‌పుట్‌-ఔట్‌పుట్‌, స్టేట్‌మెంట్‌-అసంప్షన్స్‌, స్టేట్‌మెంట్‌- ఇన్ఫరెన్సెస్‌, స్టేట్‌మెంట్‌- కంక్లూజన్స్‌, స్టేట్‌మెంట్స్‌- కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్స్‌ మొదలైన ఎనలిటికల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు వస్తాయి. వీటన్నింటికీ భావనలు (కాన్సెప్ట్స్‌) అర్థం చేసుకుని సాధన చేయాలి. ఎనలిటికల్‌ రీజనింగ్‌లోని స్టేట్‌మెంట్స్‌ సంబంధిత ప్రశ్నలు బాగా చేయడానికి ఇంగ్లిషు పరిజ్ఞానం అవసరమవుతుంది. ప్రస్తుత బ్యాంకు పరీక్షలన్నీ ఆన్‌లైన్‌ పద్ధతిలో జరుగుతున్నందున సాంకేతిక కారణాల వల్ల నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు రావడం లేదు.
2) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఎబిలిటీ: వీటిలో ప్రశ్నలు సూక్ష్మీకరణలు (సింప్లిఫికేషన్స్‌), నంబర్‌ సిరీస్‌, అరిథ్‌మెటిక్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి వుంటాయి. క్లర్క్‌ పరీక్షలో దాదాపు 50% ప్రశ్నలు సూక్ష్మీకరణలపై, 5 ప్రశ్నలు నంబర్‌ సిరీస్‌పై, మిగిలిన ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌ (అంకగణితం) నుంచి వుంటాయి. ఆఫీసర్ల పరీక్షలో దాదాపు 50% ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, 5 ప్రశ్నలు నంబర్‌ సిరీస్‌, 5-10 ప్రశ్నలు సూక్ష్మీకరణలు, మిగిలిన ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌ నుంచి ఉంటాయి.
అంకగణితంలోని నంబర్‌ సిస్టం, క.సా.గు., గ.సా.భా., నిష్పత్తి-అనుపాతం, శాతాలు, భాగస్వామ్యం, సరాసరి, లాభం-నష్టం, వడ్డీ, కాలం-పని, కాలం-దూరం, మెన్సురేషన్‌, పెర్ముటేషన్స్‌- కాంబినేషన్స్‌, ప్రాబబిలిటీలను అర్థం చేసుకుని వాటిలోని వివిధ రకాల ప్రశ్నలు సాధన చేయాలి. వీటి ప్రాథమికాంశాలను నేర్చుకోవడానికి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గణితశాస్త్ర పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి.
ప్రాథమికాంశాలు బాగా అర్థం చేసుకున్న తరువాత అరిథ్‌మెటిక్‌పై మార్కెట్లో దొరికే పుస్తకాల ద్వారా వివిధ రకాల ప్రశ్నలను సాధన చేయాలి. ఎక్కువ సమయం తీసుకునే సూక్ష్మీకరణలను త్వరగా చేయడానికి స్పీడ్‌ మ్యాథ్స్‌, వేద గణితం చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. 20 వరకు ఎక్కాలు, 30 వరకు వర్గాలు, 20 వరకు ఘనాలు గుర్తుంచుకోవాలి.
డేటా ఇంటర్‌ప్రెటేషన్‌లోని ప్రశ్నలు త్వరగా సాధించడానికి నిష్పత్తి, శాతాలు, సరాసరిలపై అవగాహన పెంచుకోవాలి. సంఖ్యల మధ్య సంబంధాన్ని త్వరగా తెలుసుకోగలగాలి. గ్రాఫ్‌ను చూడగానే సుమారు విలువలు అంచనా వేయగలిగి కొన్ని ప్రశ్నలను సాధించకుండానే వాటి జవాబులను గుర్తించగలిగే అవకాశం వుంటుంది. అరిథ్‌మెటిక్‌ షార్ట్‌కట్‌ పద్ధతులు నేర్చుకుంటే ఎక్కువ ప్రశ్నలు తక్కువ సమయంలో సాధించవచ్చు.
3) జనరల్‌ ఇంగ్లిష్‌: దీనిలోని ప్రశ్నలు మూడు అంశాల్లో వస్తాయి. 1. గ్రామర్‌ 2. కాంప్రహెన్షన్‌ 3. ఒకాబులరీ. గ్రామర్‌పై అవగాహన పెంచుకుంటే Sentence correction, spotting errors, re-arrangement of sentences, cloze testను బాగా చేయవచ్చు. Tenses, sentence formation తెలుసుకోవాలి. Preposotions, Conjuctionsఉపయోగించడం తెలుసుకోవాలి. వీటి ప్రశ్నల కింద ఇచ్చిన జవాబుల ఆప్షన్లలో చాలావరకు సరైనవని భ్రమింపజేసేలా వుంటాయి. అందుచేత గ్రామర్‌కు సంబంధించిన ప్రశ్నలు బాగా సాధన చేయాలి.
Reading Comprehension ప్యాసేజ్‌లు సాధారణంగా ఇంగ్లిషు దినపత్రికల్లోని సంపాదకీయాల నుంచి ఇస్తారు. అందుచేత అవి తప్పనిసరిగా చదవాలి. Vocabulary నుంచి 4, 5 ప్రశ్నలు వస్తాయి. అందువల్ల వీలైనన్ని ఎక్కువ పదాలు నేర్చుకొని వాటి సమానార్థాలు, వ్యతిరేకార్థాలు తెలుసుకోవాలి. ప్రతిరోజు 10 కొత్త పదాలు నేర్చుకోవాలి.
4) జనరల్‌ అవేర్‌నెస్‌: బ్యాంకు పరీక్షల్లోని ఈ విభాగంలో ఎకనమిక్స్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల వర్తమానాంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయానికి 5, 6 నెలల ముందు నుంచి ఉన్న వర్తమానాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. దీనికోసం ప్రతిరోజూ దినపత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్‌ చేసుకోవాలి. బిజినెస్‌ లైన్‌, ఎకనామిక్స్‌ టైమ్స్‌లాంటి బిజినెస్‌ పత్రికలు కూడా చదవాలి. బ్యాంకుల పరిభాష (బ్యాంకింగ్‌ టెర్మినాలజీ) తెలుసుకోవాలి. ప్రభుత్వరంగ బ్యాంకుల వివరాలూ, వాటి క్యాప్షన్లూ గుర్తుంచుకోవాలి.
5) కంప్యూటర్‌ నాలెడ్జ్‌: ఈ విభాగంలో కంప్యూటర్ల పరిణామం, ప్రాథమికాంశాలు, ఎం.ఎస్‌. ఆఫీస్‌ (వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌..), ఇంటర్నెట్‌, ఈ-మెయిల్స్‌, షార్ట్‌కట్‌ ‘కీ’లను వాడటం (Control+ C, Control+ V మొ||వి)నుంచి ప్రశ్నలుంటాయి.
కష్టమనేది అపోహ మాత్రమే
చాలామంది అభ్యర్థులు బ్యాంకు పరీక్షను కష్టమైనదనీ, గణిత విద్యార్థులు మాత్రమే విజయం సాధిస్తారనీ భావిస్తుంటారు. ఇది కేవలం అపోహ. ఎందుకంటే ఇది పదోతరగతి స్థాయిలో ఉండే పరీక్ష. నాన్‌-మేథ్స్‌ విద్యార్థులు తాము పాఠశాల స్థాయిలో చేసిన అంకగణితం నుంచి మాత్రమే ప్రశ్నలుంటాయని గ్రహించాలి. పరీక్షలో ప్రశ్నల సంఖ్య ఎక్కువ, వాటిని సాధించడానికి సమయం తక్కువ ఉండటం వల్ల ఇది కష్టమైనదనే భావన కలుగుతుంది. కానీ పరీక్ష రాసేవారందరికీ అవే ప్రశ్నలు, అదే సమయం అని గ్రహించగలిగితే ఆందోళనపడే అవసరం ఉండదు. ఎవరు బాగా సాధన చేసి నిర్ణీత సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించగలుగుతారో వారిదే విజయం!
సీనియర్‌ అభ్యర్థులు: బ్యాంకు పరీక్షలను వరసగా రాస్తూ కొందరు విజయానికి దూరంగానే ఉంటుంటారు. దీనికి రెండు కారణాలు చెప్పవచ్చు- 1. పరీక్షలోని విభాగాల్లో ఏదో ఒకదానిలో ఉత్తీర్ణులు కాలేకపోవడం 2. అన్ని విభాగాల్లోనూ కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించినా మొత్తం మార్కులు ఉద్యోగం పొందడానికి కావల్సిన మార్కుల కన్నా తక్కువ ఉండటం.
ఒకవేళ మొదటి దానివల్ల వైఫల్యం చెందుతూవుంటే ఏ విభాగంలో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారో గుర్తించి దానిపై ఎక్కువ శ్రద్ధ వహించి సాధన చేయాలి. ఇక రెండోదాని వల్ల అయితే… నిర్ణీత సమయంలో ఎక్కువ ప్రశ్నలు సంపాదించేలా సాధన చేయాలి. దీనికోసం గత పరీక్ష పత్రాలు/ మాదిరి ప్రశ్నపత్రాలు తీసుకొని వాటికి నిర్ణీత సమయం కేటాయించుకొని సాధించాలి. తరువాత వాటిని విశ్లేషించుకోవాలి. ప్రతి ప్రశ్నపత్రానికీ దాని ముందరి దానికంటే ఎక్కువ ప్రశ్నలు సాధించే విధంగా చూసుకోవాలి.
కొత్త అభ్యర్థులు: త్వరలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయబోయేవారు బ్యాంకు ఉద్యోగం సంపాదించడం తమ ధ్యేయంగా పెట్టుకున్నట్లయితే తమ ఫైనల్‌ పరీక్షలు పూర్తవగానే ఎటువంటి కాలయాపన చేయకుండా ఈ పరీక్షలకు సన్నద్ధమవడం మంచిది. ఆర్థిక మాంద్యం అనంతర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలపై ఆకర్షణ పెరగడంతో వీటిలో పోటీ బాగా పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే ప్రశ్నపత్రాల స్థాయి కూడా పెరిగింది. అందువల్ల అభ్యర్థులు ఉత్తీర్ణులవ్వడానికి బాగా శ్రమపడాల్సి వుంటుంది.
రాబోయే బ్యాంకు పరీక్షల నోటిఫికేషన్లకు ఇప్పటినుంచే చక్కటి ప్రణాళికతో, అవగాహనతో సన్నద్ధమయితే గ్రాడ్యుయేషన్‌ పూర్తికాగానే బ్యాంకు ఉద్యోగాన్ని సులువుగానే తెచ్చుకోవచ్చు!

Advertisements
 
Comments Off on కొలువుల మేలుకొలుపు!

Posted by on March 18, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: