RSS

జేఈఈ మెయిన్స్‌కు రాష్ట్రం నుంచి 1.22 లక్షల మంది విద్యార్థులు

04 Apr

జేఈఈ మెయిన్స్‌కు రాష్ట్రం నుంచి 1.22 లక్షల మంది విద్యార్థులు

* దేశవ్యాప్తంగా 13 లక్షల మంది
* 6న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
ఈనాడు-హైదరాబాద్: జేఈఈ మెయిన్స్- 2014 ఆదివారం (ఏప్రిల్ 6) జరగనుంది. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు బీఈ, బీటెక్‌లో ప్రవేశానికి, మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరుగుతుంది. దేశవ్యాప్తంగా 13,56,805 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయబోతున్నారు. గతేడాదితో పోలిస్తే లక్షన్నర మంది విద్యార్థులు అధికం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో రాస్తున్నారు. రాష్ట్రం నుంచి 1,22,863 మంది రాయబోతుండగా మహారాష్ట్ర నుంచి 2,45,582, ఉత్తరప్రదేశ్ నుంచి 1,58,451 మంది హాజరుకాబోతున్నారు. అత్యధికులు పరీక్ష రాయబోతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో 74 శాతం అబ్బాయిలకు, 26 శాతం అమ్మాయిలకు చెందినవి ఉన్నాయి. పెన్నుతో రాసే పరీక్ష కోసం (ఆఫ్‌లైన్) రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, తిరుపతి, గుంటూరు నగరాల్లో కేంద్రాలను ఏర్పాటుచేశారు. దేశ విదేశాల్లో కలిపి 150 కేంద్రాలను ఏర్పాటుచేశారు. సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ఏప్రిల్ 9, 11, 12, 19 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా జరిగే పరీక్షలకు హాజరుకాబోతున్నారు. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా 281 నగరాల్లో కేంద్రాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 28 పట్టణాల్లో ఆన్‌లైన్ ద్వారా పరీక్ష జరుగనుంది. సుమారు ఐదు లక్షల మంది ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రాయబోతున్నట్లు సమాచారం. వీరిలో తొలి లక్షన్నర మంది విద్యార్థులను ర్యాంకులను అనుసరించి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు. ఈ 1,50,000 విద్యార్థుల జాబితాను మే 3వ తేదీన ప్రకటిస్తారు. ‘కీ’ జారీ, ఓఎంఆర్ షీటు నకలును ఏప్రిల్ 25 నుంచి 27 మధ్య విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు.

 
Comments Off on జేఈఈ మెయిన్స్‌కు రాష్ట్రం నుంచి 1.22 లక్షల మంది విద్యార్థులు

Posted by on April 4, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: