RSS

Daily Archives: April 7, 2014

పీఓ కొలువులు పిలుస్తున్నాయ్‌..!


పీఓ కొలువులు పిలుస్తున్నాయ్‌..!

ఉద్యోగార్థులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది! స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 1837 ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీఓ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది. ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం సిద్ధమై ఆశించిన కొలువును సాధించండి! ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 25. పరీక్ష తేదీ కచ్చితంగా పేర్కొనలేదు కానీ… జూన్‌ నెలలో నిర్వహిస్తామని సూచించారు.
కేటగిరీల వారీగా ఖాళీల సంఖ్య ఈవిధంగా ఉంది.

ఎంపికయిన వారిని దేశంలో ఎక్కడైనా నియమించే అధికారం ఎస్‌బీఐకు ఉంది.
గరిష్ఠ వార్షిక జీతం సుమారు రూ. 8,40,000.
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసివుండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉండి పరీక్షలు రాస్తున్నవారు కూడా అర్హులే. అయితే వారు 10-8-2014 నాటికి డిగ్రీ పూర్తిచేసినట్లు ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది.
వయః పరిమితి
21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు (అంటే 2-4-1984 నుంచి 1-4-1993 మధ్య పుట్టిన అభ్యర్థులు). కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీ అభ్యర్థులకు వయః పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్‌సీ/ ఎస్‌టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు. వికలాంగుల్లో జనరల్‌ కేటగిరీకి 10 సంవత్సరాలు, ఎస్‌సీ/ఎస్‌టీకి 15 సంవత్సరాలు, ఓబీసీకి 13 సంవత్సరాల సడలింపు ఉంది.
హాల్‌ టికెటు్ల
దరఖాస్తుదారులు 30-05-2014 తర్వాత హాల్‌టికెట్లు బ్యాంకు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యేవారు తప్పనిసరిగా గుర్తింపు ఆధారం ఒకటి ఒరిజినల్‌ తీసుకుని వెళ్లవలసి ఉంటుంది. (పాస్‌పోర్టు/ ఆధార్‌ కార్డు/ పాన్‌కార్డు/ డ్రైవింగ్‌లైసెన్సు/ ఓటరు గుర్తింపు కార్డు…) మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్‌, కాకినాడ, కరీంనగర్‌, ఖమ్మం, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్‌ మొదలైనవి.
పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ కోసం.. www.sbi.co.in, www.statebankofindia.com
సన్నద్ధమయ్యేదెలా?
ఈ సారి ఎస్‌బీఐ పరీక్షకు ఆబ్జెక్టివ్‌ పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాన్ని మార్కెటింగ్‌, కంప్యూటర్‌ విభాగాలను కలిపి ఒకే విభాగంగా ఇచ్చారు. దీనివల్ల మిగిలిన మూడు విభాగాల ప్రాముఖ్యం పెరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగంలో గ్రామర్‌, ఒకాబులరీ, కాంప్రహెన్షన్లు స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి సన్నద్ధతలో స్పష్టతకు వీలుంటుంది. మామూలుగా సన్నద్ధమయ్యే గ్రామర్‌, కాంప్రహెన్షన్లతోపాటు ఒకాబులరీ ఎంత ఎక్కువగా పెంచుకోగలిగితే అంతగా ప్రయోజనం. జనరల్‌ అవేర్‌నెస్‌లో మార్కెటింగ్‌, కంప్యూటర్‌ విభాగాలు చేరటం వల్ల జాగ్రత్తగా సన్నద్ధం కావలసి ఉంటుంది. బ్యాంకింగ్‌, ఆర్థిక అంశాలకు సంబంధించి అతిముఖ్య (కోర్‌) అంశాలపై దృష్టిపెట్టి తాజా అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంది. మార్కెటింగ్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం విషయంలో కూడా కీలకాంశాలే ముఖ్యం. ప్రాధాన్యంలేనివాటిపై సమయం వృథా కాకుండా చూసుకోవాలి. ఎస్‌బీఐ పరీక్షకు సంబంధించినంతవరకు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ పూర్తిగా డేటా అనాలిసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ మీదనే ఉంటుంది. మౌలికాంశాలపై పట్టు సాధిస్తే విశ్లేషణ సులభమవుతుంది. హై లెవల్‌ రీజనింగ్‌ విషయంలో సందర్భాలను పరిగణనలోకి తీసుకుంటూ తార్కికంగా ఆలోచించగలిగితే మెరుగైన ఫలితం ఉంటుంది. ఆలోచనాస్థాయి, విశ్లేషణ సామర్థ్యం విస్తృతపరచగలిగితే వాస్తవికతకు దగ్గరయ్యే అవకాశాలుంటాయి. ఇచ్చిన సమాధానపు ఆప్షన్లు ఒక్కొక్కస్థాయి ఆలోచనకు ఒక్కో సమాధానం సరైనదనిపించేలా ఉంటాయి. పూర్తిస్థాయిలో తెలివితేటలు ఉపయోగించినపుడు మాత్రమే సరైన సమాధానం గుర్తించగలుగుతారు. ఇటీవలి రీజనింగ్‌ ప్రశ్నలు గమనిస్తే… పాత ప్రశ్నల సాధన వల్ల కలిగే మేలుకన్నా మేధామథనం ద్వారా గుర్తించిన సమాధానాలే ఎక్కువ ప్రయోజనకారిగా ఉన్నాయి. రెండోదశ ఎంపికలో అభ్యర్థికి 50 మార్కులకుగానూ 25 మార్కుల కన్వర్షన్‌ అత్యంత కీలకం. కేవలం 50 మార్కులకు 25 కన్వర్షన్‌ మార్కులు పొందే వీలున్నందున ఈ దశ ఎంతో ప్రాధాన్యమైనది.అభ్యర్థి వ్యక్తిత్వంమీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, నిజాయతీ, ఆశావహ దృక్పథం, సంసిద్ధత- ఈ గుణాలు అభ్యర్థిని గెలుపువైపు నడిపిస్తాయి.
రెండు దశల్లో..
ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటిదశ: ఆబ్జెక్టివ్‌ పరీక్ష- 200 మార్కులు( 2 గంటలు), డిస్క్రిప్టివ్‌ పరీక్ష- 50 మార్కులు (1 గంట). మొత్తం- 250 మార్కులు.

ఆబ్జెక్టివ్‌ పరీక్ష

ఆబ్జెక్టివ్‌ పరీక్షలో బ్యాంకు నిర్దేశించిన అర్హత మార్కులు ప్రతి సబ్జెక్టులోనూ విడివిడిగా పొందాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆబ్జెక్టివ్‌ పరీక్షలో అర్హులైనవారి డిస్క్రిప్టివ్‌ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. ఆ విధంగా ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పేపర్లలో విడివిడిగా అర్హత సాధించి ఎక్కువ మార్కులు పొందినవారిని మాత్రమే ఖాళీల సంఖ్యను బట్టి రెండోదశకు పిలుస్తారు.
రెండో దశ

అభ్యర్థులు మొదటిదశ, రెండోదశల్లో బ్యాంకు నిర్దేశించిన అర్హతా మార్కులు సాధించి మెరిట్‌ జాబితాలో స్థానం సంపాదించాల్సి ఉంటుంది. మొదటిదశలోని 250 మార్కులను 75 మార్కులకు, రెండోదశలోని 50 మార్కులను 25 మార్కులకు మార్చి మొత్తం 100 మార్కులకు సమానం చేస్తారు. చివరగా అభ్యర్థులు ఈ 100 మార్కులకుగానూ సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

Advertisements
 
Comments Off on పీఓ కొలువులు పిలుస్తున్నాయ్‌..!

Posted by on April 7, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: