RSS

Daily Archives: April 21, 2014

రేపటి కొలువుల ముందస్తు వ్యూహం!


రేపటి కొలువుల ముందస్తు వ్యూహం!

ఉద్యమాలు, రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ అవరోధాల కారణంగా గత మూడేళ్ళుగా నిరుద్యోగులకు అందిన ఉద్యోగాలు నామమాత్రమే. ఏర్పడనున్న రెండు రాష్ట్రాల నూతన ప్రభుత్వాలపై నిరుద్యోగులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే నోటిఫికేషన్ల స్థితిగతులు, ముందస్తు సన్నద్ధత వ్యూహం ఇవిగో!
గ్రూపు-1: 2012, 2013 ఖాళీలను కలుపుకుంటే, దాదాపు 750 గ్రూప్‌-I స్థాయి ఉద్యోగాల ఖాళీలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ 300కి అటుఇటుగా ఖాళీలతో నోటిఫికేషన్లు ఆశించవచ్చు.
గ్రూపు-2: 2300కి పైగా ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. 2013లో ఖాళీ అయిన ఉద్యోగాలు కూడా భారీగా ఉన్నాయి. అందువల్ల శాఖల పునర్‌వ్యవస్థీకరణ ప్రమాదం లేకుంటే కనీసం 1000కి పైగా ఖాళీల్లో రెండు రాష్ట్రాలకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.
జె.ఎల్‌./డి.ఎల్‌.: 2500కి పైగా జె.ఎల్‌., 500కి పైగా డి.ఎల్‌. ఖాళీలు ఉన్నాయని గతంలోనే ప్రకటించారు. వీటిపైన ఇతర ప్రభావాలు లేనందున ఈ పోస్టుల సంఖ్య ఇంకా పెరగవచ్చు.
డి.ఎస్‌.సి.: ఇటీవలే టెట్‌ నిర్వహణ 4వ సారి కూడా జరిగింది కాబట్టి డీఎస్‌సీ నిర్వహణకు ఇబ్బంది ఏమీలేదు. కొత్త ముఖ్యమంత్రులు నిరుద్యోగులకు ‘బహుమతి’గా ఇవ్వదగిన ప్రకటన ఇది. విద్యాహక్కు చట్టం ప్రకారం కూడా ఖాళీలు 10%కి మించరాదు. కాబట్టి తక్షణం ముఖ్యమంత్రులు స్పందించే అవకాశం ఉంది. రాబోయే 6 నెలల లోపుగా జరిగే పోటీపరీక్షగా గుర్తించి ఉపాధ్యాయ ఉద్యోగార్థులు సన్నద్ధత ప్రారంభించవచ్చు.
సాధారణంగా కొత్త సిలబస్‌తో ఒక విద్యాసంవత్సరం ముగిసిన తర్వాతనే డీఎస్‌సీ సిలబస్‌గా పరిగణిస్తారు. 8,9 తరగతుల కొత్త పాఠ్యపుస్తకాలు ఒక విద్యాసంవత్సరం ముగిసినందున ఈ డీఎస్‌సీ సిలబస్‌గా పరిగణిస్తారు. ఈ సంవత్సరమే మారిన పదో తరగతి పాఠ్యపుస్తకాలు డీఎస్‌సీకి పరిగణించరు. అందువల్ల పదో తరగతి వరకూ పాత పుస్తకాలనే చదవాలి. అయితే కొత్త సిలబస్‌ను కూడా అదనపు సమాచారం కోసం చదవడం సమంజసం.
సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌/ కానిస్టేబుళ్లు: ఎన్నికల కోడ్‌ ముగియగానే గత పరీక్షల ఫలితాలు ప్రకటిస్తారు. దాదాపు 3,500కి పైగా ఎస్‌ఐ ఖాళీలున్నట్లు తెలుస్తోంది. ప్రాంత ఖాళీలు ఆధారంగా రెండు రాష్ట్రాల్లోనూ జూన్‌ తరువాత ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. శాంతిభద్రతల నిర్వహణ అవసరాల దృష్ట్యా తప్పనిసరిగా నోటిఫికేషన్లు రావచ్చు.
గ్రూపు- IV, AMVI, DAO, AEE మొదలైన ఉద్యోగాల ఖాళీలు భారీగానే వున్నందున వాటిని ఆశిస్తున్నవారు ఆశావహ వాతావరణంలో సన్నద్ధతకు పూనుకోవచ్చు.
ఇప్పటి నుంచే…
రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు స్థిరపడేసరికి జులై నెలలోకి ప్రవేశించటం ఖాయం. ఇప్పటికే ఖాళీల సమాచారం స్పష్టంగా ఉన్నందున ప్రకటనలకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు. సెప్టెంబరు, అక్టోబరులో పరీక్షలు జరుగుతాయనే లక్ష్యంతో ఇప్పటినుంచే సన్నద్ధత ప్రారంభించాల్సి ఉంటుంది.
కొత్త అభ్యర్థులు పూర్తిస్థాయిలో తయారయ్యేందుకు కనీసం 6 నెలలు వినియోగించాల్సి ఉంటుంది. ప్రకటనలు వెలువడిన తరువాత లభించే కొద్దిసమయంలో సిద్ధమవటం అంత తేలికేమీ కాదు. పైగా సీనియర్‌ అభ్యర్థులతో పోటీపడాల్సివస్తుంది.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు గ్రూప్స్‌ పరీక్షలపై దృష్టి నిలపటం సాధారణ విషయం. ఈ తరహా అభ్యర్థులు రాబోయే వేసవిసెలవులను సద్వినియోగం చేసుకుంటే పరీక్షా సమయంలో సెలవులు పెట్టి చదవాల్సిన పరిస్థితి ఉండదు. ఆర్థికభారం పడకుండా బయటపడవచ్చు.
డీఎస్‌సీ ద్వారా ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థుల సంఖ్య భారీగా వుంది. తాజాగా డీఈడీ/బీఈడీలు పూర్తిచేసినవారి సన్నద్ధత విధానం ఒక రకంగా, ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నవారి వ్యూహం మరొక రకంగా ఉంది. తాజాగా అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు సైకాలజీ, విద్యాదృక్పథాలు, మెథడాలజీల్లో బలంగా ఉంటారు. కొత్త అధ్యయనాలతో పరిచయం ఉంటుంది. అయితే వీరిలో కంటెంట్‌ స్థాయులు బలహీనంగా ఉంటాయి. అందువల్ల తాజా అభ్యర్థులు కంటెంట్‌పై దృష్టి నిలిపి సన్నద్ధమవాలి.
సీనియర్‌ అభ్యర్థుల విషయానికి వస్తే విద్యా దృక్పథాలు, సైకాలజీ, మెథడాలజీలతో తిరిగి పట్టు సాధించేందుకు సమయాన్ని వెచ్చించాలి. కంటెంట్‌లో వచ్చిన మార్పుల్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటే అనుసంధానించాల్సిన విషయాల్లో స్పష్టత పెరుగుతుంది.
ఆరంభం ఎలా?
సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలన్నింటికీ కేంద్ర బిందువు- జనరల్‌ స్టడీస్‌. దీనిలో పట్టు సాధించడం ద్వారా మిగతా పేపర్లలో కూడా స్కోర్‌ పెంచుకోవచ్చు. జీఎస్‌పై 150 ప్రశ్నలే అడిగినా మొత్తం సన్నద్ధత సమయంలో 40-50% సమయం కేటాయిస్తేనే తుది లక్ష్యంవైపు సాగేది! జీఎస్‌లో అధ్యయనం చేయాల్సిన అంశాల వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తప్పనిసరి.
1. పాఠశాల పుస్తకాల్లో సైన్స్‌, సాంఘిక శాస్త్రాల్లో ఇచ్చిన పాఠ్యాంశాల్లో జనరల్‌ స్టడీస్‌ ప్రారంభించాలి. అయితే సైద్ధాంతిక అంశాల్ని నామమాత్రంగా అర్థం చేసుకుంటూ, అన్వయ అంశాల్ని లోతుగా పరిశీలించటమే మార్కులు పొందే రహస్యం!
2. గతంలో సర్వీస్‌ కమిషన్‌ ఇచ్చిన పరీక్షాపత్రాల్ని చూడటం ద్వారా ప్రశ్నల వైవిధ్యం, లోతు, పరిధి అర్థం చేసుకోవటం తర్వాతి దశ. ప్రశ్నలు అడుగుతున్న తీరుతెన్నుల్ని పరిశీలిస్తే సన్నద్ధతలో రావాల్సిన మార్పులు అర్థమైపోతాయి. పరిగణించాల్సిన అదనపు సబ్జెక్టులను నిర్ధారించవచ్చు.
3. అంతిమంగా చదవాల్సిన విషయం (కంటెంట్‌) స్థిరీకరించుకోవాలి. అదే విషయాన్ని పునశ్చరణ చేయటం ద్వారా విస్తృత పరిధి కల్గిన జనరల్‌ స్టడీస్‌లో పట్టు సులభంగా దొరికిపోతుంది.
JL/ DLలాంటి పరీక్షల్లో పేపర్‌-2 (సబ్జెక్టు)లో మెరుగైన అభ్యర్థులందరికీ దాదాపు ఒకే మార్కులు వస్తున్నాయి. అయితే జనరల్‌ స్టడీస్‌లో పొందే మార్కుల వల్లనే అంతిమ ఫలితం పొందారు.
AMVI, DAO, AEE లాంటి పరీక్షల్లో కూడా జనరల్‌ స్టడీస్‌లో రాణించిన అభ్యర్థులే ఆశించిన ఫలితం పొందారనేది నిర్వివాదాంశం. అందువల్ల రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ‘జనరల్‌స్టడీస్‌’పై పట్టు సాధించాలి.
వేసవి సద్వినియోగం
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ప్రైవేటు కళాశాలల్లోని వేలాది అధ్యాపకులకూ, ఉన్నత విద్యాకోర్సుల్లో ఉన్న విద్యార్థులకూ పోటీ పరీక్షల తయారీకి అనువైన సమయం వేసవి సెలవులే. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
అంటే- రోజుకు కనీసం 14 గంటలు… సరైన ప్రణాళికతో కష్టపడి చదవాలి! అలా చేయగలిగితే ఈ వేసవి సెలవుల్లో రేపటి కొలువులకు పూర్తిస్థాయిలో తయారయినట్టే!
ఖాళీల సంఖ్యలో మార్పు!
పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం- రాష్ట్రస్థాయి ఉద్యోగులు తప్ప మిగతా స్థాయి ఉద్యోగులు (మల్టీ జోనల్‌, జోనల్‌, జిల్లా స్థాయులు) విభజనానంతర రాష్ట్రాల్లో యధావిధిగా కొనసాగవచ్చు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే గ్రూప్‌-I రాష్ట్రస్థాయి పోస్టుల్లో తప్ప మిగతావాటిలో ఇప్పటికే ఖాళీగా ఉన్నవాటికి నియామక ప్రక్రియ జరిపే అవకాశం స్పష్టం. అయితే శాఖల పునర్వవ్యస్థీకరణ ఖాళీ ఉద్యోగాల సంఖ్యను తగ్గించే అవకాశం కల్పిస్తుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ, కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటు, ఖాళీల సంఖ్యను పెంచవచ్చు కూడా!
నియామక సంస్థలు
తెలంగాణ ప్రాంత గ్రూప్స్‌ ఉద్యోగ నియామకాలు యూపీఎస్‌సీ ద్వారా, కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగ నియామకాలు ప్రస్తుత ఏపీపీఎస్‌సీ ద్వారా జరుగుతాయని తెలుస్తోంది. పార్లమెంటు చట్ట ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులో టీజీపీఎస్‌సీ ఏర్పడుతుంది. ఇది ఏర్పడేంతవరకు ఉద్యోగ నియామకాల్లో జాప్యం జరుగుతుందనేది అభ్యర్థుల ఆందోళన. తెలంగాణ కొత్త ప్రభుత్వం కోరుకుంటే గవర్నర్‌ కోరిక మేరకు వెంటనే నియామక ప్రక్రియను యూపీఎస్‌సీ ప్రారంభించవచ్చు.
ఉపాధ్యాయులు, ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్‌ లాంటి ఉద్యోగ నియామకాలు జరిపే సంస్థలు రాష్ట్రప్రభుత్వాల నిర్ణయం మేరకు ఏర్పడేవే. కాబట్టి ఎలాంటి ఇబ్బందీ లేదు. కొత్త ముఖ్యమంత్రులు కోరుకుంటే నియామక ప్రక్రియలు వేగంగా ప్రారంభమవుతాయి.
పాత సిలబస్‌లో పరీక్ష ఉండదా?
* గ్రూప్‌ |, || ఉద్యోగార్థులు సిలబస్‌ విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. కొత్త రాష్ట్రాల నేపథ్యంలో సిలబస్‌లో మార్పులుంటాయనే సమాచారం వ్యాపించటంతో ఏయే అంశాలు చదవాలనే మీమాంసతో శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా APఎకానమీ (23 జిల్లాలు), APచరిత్ర విషయంలో ఈ ఆందోళన ఎక్కువుంది. ‘పాత సిలబస్‌లో పరీక్ష నిర్వహించరా?’ అనేది సీనియర్‌ అభ్యర్థుల ఆందోళన.
సూచన: సాధారణంగా ఇటువంటి పరిస్థితిలో కనీసం ఒక్కసారైనా రెండు రాష్ట్రాల్లోనూ పాత సిలబస్‌తోనే నిర్వహిస్తారు. సీనియర్‌ అభ్యర్థులు గత 5 సం||గా ఆయా సిలబస్‌లో విస్తృతంగా సమయం, ధనం వెచ్చించారు. పైగా కొత్త సిలబస్‌ తయారీ, నిర్దేశిత పుస్తకాల తయారీ సమయ వ్యయంతో కూడినది. ఒకవేళ మార్పులు జరుగుతాయని అనుకున్నా అటువంటి అంశాల వ్యాప్తి 20% మాత్రమే.
* తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు యూపీఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తే వారి పరీక్షా విధానం కఠినత్వం, సిలబస్‌ వేరుగా ఉంటాయా?
సూచన: అటువంటి పరిస్థితి ఉండదు. రాష్ట్రప్రభుత్వం కోరిన రీతిలోనే పరీక్ష జరిగే అవకాశం ఎక్కువ. కఠినత్వం పెరుగుతుందేమో అనేది కూడా అపోహే. అందువల్ల ప్రస్తుత సిలబస్‌కి ప్రస్తుత తరహాలో (pattern)లో చదువుకోవడం సరైన నిర్ణయం.
* ఇటీవలికాలంలో గ్రాడ్యుయేషన్‌/ పీజీ పుస్తకాలు అనేక సబ్జెక్టుల్లో మారాయి. జూనియర్‌ లెక్చరర్స్‌/డిగ్రీ లెక్చరర్స్‌కి సిద్ధపడేవారు ఏయే పుస్తకాలు చదవాలి?
సూచన: జూనియర్‌ లెక్చరర్స్‌/ డిగ్రీ లెక్చరర్స్‌కి నిర్దిష్ట సిలబస్‌ వుంది. అయితే ఆయా సిలబస్‌ అంశాల్ని తాజా పీజీ పాఠ్యగ్రంథాల సమాచారంతో అనుసంధానం చేసుకోవాలి.
* డి.ఎస్‌.సి.కి సిద్ధమయ్యేవారు పాఠశాల పుస్తకాలను ప్రమాణంగా తీసుకుంటారు. ఇటీవలే 10వ తరగతి పుస్తకాలు కూడా మారాయి. కొత్త పుస్తకాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందా?
సూచన: మారిన పాఠ్యపుస్తకాల ఆధారంగానే ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్‌సీ కంటెంట్‌లో అడ్వాన్స్‌ సబ్జెక్టు ప్రశ్నలు అడిగారు. ఏయే తరగతి పాఠాలు బోధించాల్సివుంటుందో ఆయా పాఠాలపై పట్టును పరిశీలించడం సహజం. అందువల్ల మారిన పాఠ్యగ్రంథాల ఆధారిత సన్నద్ధత తప్పనిసరి.
* పంచాయతీ సెక్రటరీ పరీక్షలో జనరల్‌స్టడీస్‌ సిలబస్‌ మార్చారు. డీఏఓ పరీక్ష సిలబస్‌ మారిందంటున్నారు. జనరల్‌ స్టడీస్‌ సన్నద్ధతలో అవే అంశాలు చదవాలా? పాత సిలబస్‌లోవి చదవాల్సిన అవసరం లేదా?
సూచన: పంచాయతీ సెక్రటరీ జనరల్‌స్టడీస్‌ సిలబస్‌లో ప్రస్తుత పరిపాలన, సమాజ అవసరాలు పేర్కొన్నారు. అయితే ప్రశ్నపత్రంలో మాత్రం రెగ్యులర్‌ జీఎస్‌ నుంచే అధిక ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల సిలబస్‌ ఆధారంగా తయారవుతూనే ఇతర అంశాలను కలుపుకొంటూ సమగ్రంగా తయారవ్వడం మంచిది.
* మారిన పాఠశాల పుస్తకాల ఆధారంగా ‘జనరల్‌ స్టడీస్‌’ సన్నద్ధతను కూడా మార్చుకోవాలా?
సూచన: తప్పనిసరి. ప్రశ్నపత్రం తయారీదారునికి ప్రామాణిక పుస్తకాలుగా పాఠశాల, విశ్వవిద్యాలయ, తెలుగు అకాడమీ పుస్తకాలే ఉంటాయి. అందువల్ల ప్రస్తుతం లభించే ప్రచురణలే చదవటం అవసరం.

Advertisements
 
1 Comment

Posted by on April 21, 2014 in Uncategorized

 

PROCEEDING OF THE COMMISSIONER & DIRECTOR OF SCHOOL EDUCATION


550 (2)

 
2 Comments

Posted by on April 21, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: