ఉపాధి అరకొరే..!
* 5800 మందిలో 650 మందికే ఉద్యోగాలు
* సంతృప్తి లేని ‘గేట్-2014’ ఫలితాలు
ఈనాడు, హైదరాబాద్: ఆర్జీయూకేటీ నేతృత్వంలోని ట్రిపుల్‌ఐటీల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణ నిరుపేద విద్యార్థులను భావి ఇంజినీర్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఏర్పడిన ఈ ఉన్నత విద్యాలయాలు అందుకు తగ్గ ఫలితాలు ఇవ్వడంలేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 2008-09 విద్యా సంవత్సరం నుంచి 2013-14 విద్యా సంవత్సరం వరకు సుమారు రూ.2000 కోట్ల మేర భారీగా నిధులిచ్చినా ట్రిపుల్‌ఐటీలు మాత్రం సరైన దిశగా పయనించడంలేదు. ముఖ్యంగా..2013-14 విద్యా సంవత్సరంలో ట్రిపుల్‌ఐటీల నుంచి 5800 మంది విద్యార్థులు బీటెక్ పూర్తిచేసి బయటకురాబోతున్నా 620 మందికి మాత్రమే ఇప్పటివరకు ఉద్యోగావకాశాలు లభించడం గమనార్హం. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నేతృత్వంలో ఇడుపులపాయ(కడప జిల్లా) నూజివీడు (కృష్ణా), బాసర (ఆదిలాబాద్)లో ఈ విద్యాలయాలు నడుస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ..పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికి వీటిలో 85 శాతం సీట్లను కేటాయిస్తున్నారు. మిగిలిన వాటిని ఓపెన్ కేటగిరీలో భర్తీచేస్తున్నారు. తక్కువ ఫీజుతో ఇంటర్ రెండేళ్లు + నాలుగేళ్ల బీటెక్ విద్యను ఒకేచోట పూర్తిచేసే వెసులుబాటు ఉన్నందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఉన్నతవిద్యాలయాల పట్ల అమితంగా ఆకర్షితులయ్యారు.
ఇక్కడ చదివినా అంతేనా..?
ట్రిపుల్‌ఐటీలు ప్రారంభమైన తొలి సంవత్సరంలో మూడు క్యాంపస్‌లలో కలిపి రెండువేల వంతున మొత్తం ఆరువేల మంది విద్యార్థులను చేర్చుకున్నారు. వీరిలో రెండువందల మంది మినహా మిగిలిన వారంతా రెండేళ్ల ఇంటర్+నాలుగేళ్ల బీటెక్‌ను ముగించుకుని ఈ నెలాఖరులో బయటకు రాబోతున్నారు. వీరిలో 620 మందికి మాత్రమే ఇప్పటివరకూ క్యాంపస్‌లలో ఉండగా ఉద్యోగావకాశాలు లభించడం గమనార్హం. మెకానికల్, మెటలర్జీ, సివిల్ వంటి విభాగాల్లో ఈ నియామకాల సంఖ్య మరీ తక్కువగా ఉన్నట్లు తెలియవచ్చింది. మిగిలినచోట్ల అంటే..విశ్వవిద్యాలయాల ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు…ట్రిపుల్‌ఐటీల మధ్య తేడా ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఇంటర్ తొలి సంవత్సరం నుంచి ఈ ట్రిపుల్ఐటీల్లో చదువుతున్నారు. క్యాంపస్‌లో ఉండగానే నియామకాలు పొందేందుకు, ఉన్నత విద్యకు వెళ్లేందుకు అనువుగా విద్యార్థులను సన్నద్ధంచేసేలా మొదటినుంచే ఆర్జీయూకేటీ ప్రణాళికలు సిద్ధంచేసింది. దాని ప్రకారమే చర్యలు తీసుకుంటోంది. అయినా ఇక్కడి విద్యార్థులకు లభించే ఉద్యోగావకాశాల శాతం తక్కువగా ఉండడం వీటి పేలవ పనితీరుకు అద్దంపడుతోంది. ఈ ట్రిపుల్‌ఐటీల నుంచి పెద్దసంఖ్యలోనే విద్యార్థులు గేట్-2014 రాసి ఉంటారని భావిస్తున్నారు. 946 మంది విద్యార్థుల నుంచి గేట్ రాసినట్లు సమాచారం అందగా.. వీరిలో 72 మందికి సీట్లు లభించే అవకాశాలు ఉన్నట్లు ఆర్జీయూకేటీ వర్గాలే పేర్కొనడం గమనార్హం.
ఎందుకిలా..!
ఈ ట్రిపుల్ఐటీల్లో బోధన తీరు, బోధకుల్లో పేరుకుపోయిన అసంతృప్తి, శాశ్వత అధ్యాపకులు లేకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు ఆశించినమేరకు రాణించలేకపోతున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వేతనాలు పెంచనందున బోధకుల్లో వృత్తిపట్ల అంకితభావం కనిపించడంలేదు. కొందరు మధ్యలోనే ఉద్యోగాలను వదులుకుని వెళ్లిపోతున్నారు. మిగిలినచోట్ల మాదిరిగానే ఇక్కడి విద్యార్థులు ఆంగ్లంలో సరిగ్గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
మొదటిసారి కావడంవల్లే…
ట్రిపుల్ఐటీల్లో క్యాంపస్ నియామకాలు అరకొరగా ఉండడంపై ఆర్జీయూకేటీ ఉపకులపతి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ”ఈ ప్రాంగణాల్లో ఇంకొంత వ్యవధిలో మరో 400 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. తొలి ఏడాది కావడం వల్ల నియామక సంస్థలు ట్రిపుల్‌ఐటీలకు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. 1900 సంస్థలను సంప్రదించాం. ఇప్పటివరకు 20 కంపెనీలు మాత్రమే వచ్చాయ”ని వివరించారు.
free homeschooling
May 3, 2014 at 4:32 PM
I was suggested this blog by my cousin. I am not sure whether this post is written by him as no one else know such detailed about my difficulty. You are wonderful! Thanks!