RSS

గిరిజన హాస్టళ్ల విద్యార్థులకు పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం –

12 Aug

*తక్షణం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశం
ఈనాడు, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న గిరిజన విద్యార్థులు ఇకపై పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు వీరు మధ్యాహ్న భోజనానికి వసతిగృహాలకు వచ్చేవారు. ప్రస్తుతం 3 నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ.750. 8 నుంచి 10వ తరగతి వారికి రూ.850 వంతున డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తంలోనే వసతిగృహాల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం పెడుతున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ మొత్తంతో రెండు పూటలా భోజనం పెట్టడం సాధ్యం కాదని వార్డెన్లు చేతులెత్తేశారు. మధ్యాహ్నం వసతిగృహంలో కాకుండా పాఠశాలల్లో పెట్టే భోజనం తింటే.. రాత్రి పూట నాణ్యమైన భోజనం అందించడానికి అవకాశం ఉంటుందని, ఆ దిశగా ఆలోచించాలని కొన్నాళ్లుగా వీరు సంబంధిత శాఖ కమిషనర్‌ను కోరుతున్నారు.
ఎట్టకేలకు వీరి మొర ఆలకించిన కమిషనర్ ఉదయలక్ష్మి గిరిజన వసతి గృహాల విద్యార్థులంతా పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల నుంచే ఇది అమలుచేయాలని తమకు ఆదేశాలు అందాయని గిరిజన సంక్షేమాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎస్సీ వసతిగృహాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం పాఠశాలల్లోనే తింటున్నారు. వీరికి ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం మాత్రమే వసతిగృహాల్లో అందిస్తున్నారు. పాఠశాలలు తెరవని రోజుల్లో మాత్రమే హాస్టళ్లలో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమం రెండూ ఒకే శాఖ పరిధిలో ఉన్నందున ఇద్దరికీ ఒకే విధానం ఉండాలని ఇటీవల ఆ శాఖ మంత్రి సైతం పేర్కొన్నట్లు తెలిసింది.

 
Comments Off on గిరిజన హాస్టళ్ల విద్యార్థులకు పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం –

Posted by on August 12, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: