RSS

డీఎస్సీలోనే టెట్‌

20 Aug

* టెట్‌కు ప్రత్యేక పరీక్ష ఉండదు
* కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్‌: డీఎస్సీ రాత పరీక్షలో అంతర్భాగంగానే టెట్‌ను కూడా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. ఉపాధ్యాయుల నియామకాల కోసం డీఎస్సీ – 2014 కింద నిర్వహించనున్న రాత పరీక్షలోనే టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. దీనివల్ల తెలుగుదేశం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీని నెరవేర్చినట్లు, జాతీయ ఉపాధ్యాయ విద్య శిక్షణ మండలి మార్గదర్శకాలు అనుసరించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించిన ప్రకారం.. సెప్టెంబరు 5న జారీచేసే డీఎస్సీ – 2014 ద్వారా 10,603 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలను విద్యా శాఖ కమిషనర్‌ ఉషారాణి తీసుకుంటున్నారు.
డీఎస్సీ రాత పరీక్ష జరిగే రోజునే ఒక పేపరుగా టెట్‌ పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై తొలుత పరిశీలన జరిపారు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ జవాబుపత్రాన్ని మూల్యాంకనం చేయాలనుకున్నారు. అయితే… దీనివల్ల తెదేపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లు టెట్‌ రద్దు చేయకుంటే.. సమస్యలు వస్తాయని, అభ్యర్థులకు భారంగా మారుతుందని భావించారు. పరీక్షల నిర్వహణపరంగా విద్యా శాఖపై ఒత్తిడి పెరుగుతుందన్న వివిధ కారణాలతో డీఎస్సీలోనే అంతర్భాగంగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో టెట్‌ రాయని వారికి ఓ అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఇప్పటికే మూడుసార్లు నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. ఎందులో ఎక్కువ మార్కులు వస్తాయో..వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకునేలా నిబంధనలు తయారవుతున్నాయి. మరోవైపు డీఎస్సీ + టెట్‌ సిలబస్‌ ఖరారుపై జరుగుతున్న కసరత్తు ముగింపు దశకు వచ్చింది. పాఠశాల విద్యలో కొత్త సిలబస్‌ అమల్లోకి వచ్చినందున ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై చర్చ జరుగుతోంది. డీఎస్సీ రాతపరీక్షకు డీఎడ్‌, బీఎడ్‌ సిలబస్‌నూ పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల గతంలో చివరిగా నిర్వహించిన డీఎస్సీకి ఉన్న సిలబస్‌తోనే డీఎస్సీ – 2014 జరిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. డీఎస్సీ మార్కులకు 80%, టెట్‌ మార్కులకు 20% ప్రాధాన్యనిస్తూ… అభ్యర్థుల ప్రతిభను గుర్తించనున్నారు. వాస్తవానికి గతంలోనే డీఎస్సీ + టెట్‌ను కలిపి ఒకే పరీక్షగా జరపాలన్న దానిపై విస్తృతస్థాయిలో విద్యాశాఖలో సమాలోచనలు జరిగాయి. విద్యా శాఖ అధికారులు చెన్నై వెళ్లి అక్కడి టెట్‌ నిర్వహణ గురించి చేశారు. టెట్‌ + డీఎస్సీ కలిపి జరిపేందుకు ప్రతిపాదించారు. అయితే.. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, ఉద్యోగుల ఆందోళనలవల్ల కార్యరూపం దాల్చలేదు.

 
Comments Off on డీఎస్సీలోనే టెట్‌

Posted by on August 20, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: