RSS

డీఎస్సీ తాత్కాలిక వాయిదా

12 Sep

డీఎస్సీ తాత్కాలిక వాయిదా
* బీఈడీలకు ఎస్జీటీలో అవకాశంపై కేంద్రం నుంచి స్పష్టత కోరాం
* కేంద్ర అనుమతిరాగానే నోటిఫికేషన్
* సీఎంతో మాట్లాడాక ఉపాధ్యాయుల బదిలీపై నిర్ణయం
* క్లస్టర్ పాఠశాలల ఏర్పాటుకు కసరత్తు
* మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలో అవకాశం కల్పించే విషయమై ఈ వాయిదా వేసినట్లు వెల్లడించారు. 2012 వరకు బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పరీక్ష రాసేందుకు అనుమతించారు, ఈ అనుమతిని 2016 వరకు పొడిగించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థకు లేఖ రాశామని, వారు అనుమతిస్తే బీఈడీ అభ్యర్థులకూ అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఒకవేళ అనుమతించకపోతే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సెప్టెంబరు 11న ఆయన ఏపీ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యావ్యవస్థ సంస్కరణల్లో భాగంగా పాఠశాలల్లో రోజూ గంటపాటు ఆటలు, నృత్యం, చిత్రలేఖనం లాంటి కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశభక్తి, నైతికవిలువలు బోధించే పాఠ్యాంశాలను చేరుస్తున్నామన్నారు. అన్ని సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబరు 17న రాష్ట్రంలోని అన్నిస్థాయిల విద్యాశాఖాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సమర్థమంతంగా పనిచేస్తున్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పర్యటించాక, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలపై కమిటీ మార్గదర్శకాలను రూపొందిస్తుందన్నారు. ప్రతిభ అవార్డుల సంఖ్యతోపాటు, అందులో ఇచ్చే మొత్తాన్నీ పెంచనున్నామన్నారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, విద్యార్థులు లేకుండా ఉపాధ్యాయులన్నవి, ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తుండటం లాంటి గందరగోళ పరిస్థితి పాఠశాల వ్యవస్థలో ఉంది. దీన్ని పరిష్కరించేందుకు క్లస్టర్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లోనూ ఆధార్ అనుసంధానం చేస్తున్నామని, ఇప్పటివరకూ 72శాతం పూర్తయిందని చెప్పారు. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్ వ్యవస్థతోపాటు, ఆడియో, వీడియో శిక్షణ వంటివాటితో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి ఫలితాలను చూసి ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వెబ్‌సైట్‌ను సిద్ధం చేశామని, త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి గంటా తెలిపారు.
15,500 మంది ఉపాధ్యాయులూ వెళ్లాల్సిందే
అవసరం లేనిచోట 15,500 మంది ఉపాధ్యాయులను గత ప్రభుత్వాలు పోస్టింగ్ చేశారని మంత్రి తెలిపారు. వీళ్లంతా అవసరమున్న చోటకు మారిస్తే వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న 10,500 ఉపాధ్యాయ పోస్టులనూ డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం ద్వారా అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ సాధ్యమవుతుందన్నారు. ఉపాధ్యాయుల బదిలీకి కౌన్సెలింగ్ లాంటి పాతపద్ధతే సరైందనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఏ పద్ధతి చేపట్టాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisements
 
Comments Off on డీఎస్సీ తాత్కాలిక వాయిదా

Posted by on September 12, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: