RSS

Daily Archives: September 29, 2014

మా ఉపాధ్యాయుల‌కూ శిక్షణ ఇవ్వండి!


మా ఉపాధ్యాయుల‌కూ శిక్షణ ఇవ్వండి!
* ఎస్సీఈఆర్‌టి, విద్యాశాఖకు తెలంగాణ ప్రైవేటు పాఠశాల‌ల‌ లేఖలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ విద్యా విధానాన్ని గాడిలో పెట్టడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం పేరుతో పేద కుటుంబాలను బురిడీ కొట్టిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల పనితీరుపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో వాటి బాగోతం నివేదికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతున్నది. ఈ క్రమంలో ప్రైవేటు, కార్పొరేట్, టెక్నో స్కూలు యాజమాన్యాలు మెట్టు దిగాయి. ప్రభుత్వ విద్యా విధానం, విద్యా వార్షిక ప్రణాళికలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు తమ టీచర్లకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ప్రైవేటు స్కూల్ టీచర్లు కూడా బోధనా నైపుణ్యంలో శిక్షణ పొందాలి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు కూడా తమ టీచర్లకు బోధన మెళకువలు నేర్పించాలని ఎస్‌సీఈఆర్‌టీకి లేఖలు రాస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో 9, 10వ తరగతి పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చారు. మార్చిలో నిర్వహించే వార్షిక పరీక్షల నుంచే ఈ సంస్కరణలు అమలు పరచనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. టీచర్లు శిక్షణ వల్ల పొందిన పరిజ్ఞానంతో పాఠాలు బోధించాలి. మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ప్రైవేటు స్కూలు పిల్లలను కూడా తయారు చేయాలంటే ఆ మేరకు ప్రైవేటు టీచర్లకు తప్పని సరిగా శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే మారిన తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానం తెలియక అందరూ ఫెయిలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నెలాఖరు వరకైనా మారిన పరీక్షల విధానం, బోధనా పద్ధతులు, మారిన సిలబస్, వార్షిక విద్యా ప్రణాళికలు వంటి అంశాలపైన శిక్షణ పొందక పోతే.. ఆ ప్రభావం వార్షిక పరీక్షలపై కచ్చితంగా పడుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా తమ టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రైవేటు స్కూళ్లు ఎస్‌సీఈఆర్‌టీపై ఒత్తిడి పెంచాయి.

Advertisements
 
Comments Off on మా ఉపాధ్యాయుల‌కూ శిక్షణ ఇవ్వండి!

Posted by on September 29, 2014 in Uncategorized

 

ఎస్‌సీఈఆర్‌టీ కేంద్రానికి ప్రతిపాదనలు


ఎస్‌సీఈఆర్‌టీ కేంద్రానికి ప్రతిపాదనలు
* విజయవాడ లేదా గుంటూరులో ఏర్పాటుకు చర్యలు
* భవనాలు గుర్తించిన ఏపీ ఉన్నతాధికారులు
ఈనాడు, గుంటూరు:
రాష్ట్రవిభజన నేపథ్యంలో రాష్ట్ర విద్య, పరిశోధక శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ లేదా గుంటూరులో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ రెండు నగరాల్లో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించడానికి అనువైన భవనాలనూ అధికార యంత్రాంగం ఈ పాటికే గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి వెళ్లాయి. విజయవాడలోని మాంటిస్సోరి మహిళా కళాశాల, గుంటూరులో ఏఎల్ బీఈడీ కళాశాల భవనాల్లో తాత్కాలిక కార్యాలయాన్ని నడపడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. సాధ్యమైనంత వరకు స్థానికంగా దీన్ని అక్టోబరులో ప్రారంభించాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిపి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వద్ద ప్రస్తుతం ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయం ఉంది. ఎస్‌సీఈఆర్‌టీని విభజించే దిశగా చర్యలు ఇప్పటికే ఊపందుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా భవనాలను సిద్ధం చేస్తోందని తెలిసింది. పాఠ్యాంశాల సిలబస్ రూపకల్పన, డీఎడ్ కళాశాలల పనితీరును ఈ కేంద్రం పర్యవేక్షిస్తుంది.

 
Comments Off on ఎస్‌సీఈఆర్‌టీ కేంద్రానికి ప్రతిపాదనలు

Posted by on September 29, 2014 in Uncategorized

 
 
%d bloggers like this: