RSS

మా ఉపాధ్యాయుల‌కూ శిక్షణ ఇవ్వండి!

29 Sep

మా ఉపాధ్యాయుల‌కూ శిక్షణ ఇవ్వండి!
* ఎస్సీఈఆర్‌టి, విద్యాశాఖకు తెలంగాణ ప్రైవేటు పాఠశాల‌ల‌ లేఖలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ విద్యా విధానాన్ని గాడిలో పెట్టడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం పేరుతో పేద కుటుంబాలను బురిడీ కొట్టిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల పనితీరుపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో వాటి బాగోతం నివేదికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతున్నది. ఈ క్రమంలో ప్రైవేటు, కార్పొరేట్, టెక్నో స్కూలు యాజమాన్యాలు మెట్టు దిగాయి. ప్రభుత్వ విద్యా విధానం, విద్యా వార్షిక ప్రణాళికలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు తమ టీచర్లకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ప్రైవేటు స్కూల్ టీచర్లు కూడా బోధనా నైపుణ్యంలో శిక్షణ పొందాలి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు కూడా తమ టీచర్లకు బోధన మెళకువలు నేర్పించాలని ఎస్‌సీఈఆర్‌టీకి లేఖలు రాస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో 9, 10వ తరగతి పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చారు. మార్చిలో నిర్వహించే వార్షిక పరీక్షల నుంచే ఈ సంస్కరణలు అమలు పరచనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. టీచర్లు శిక్షణ వల్ల పొందిన పరిజ్ఞానంతో పాఠాలు బోధించాలి. మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ప్రైవేటు స్కూలు పిల్లలను కూడా తయారు చేయాలంటే ఆ మేరకు ప్రైవేటు టీచర్లకు తప్పని సరిగా శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే మారిన తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానం తెలియక అందరూ ఫెయిలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నెలాఖరు వరకైనా మారిన పరీక్షల విధానం, బోధనా పద్ధతులు, మారిన సిలబస్, వార్షిక విద్యా ప్రణాళికలు వంటి అంశాలపైన శిక్షణ పొందక పోతే.. ఆ ప్రభావం వార్షిక పరీక్షలపై కచ్చితంగా పడుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా తమ టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రైవేటు స్కూళ్లు ఎస్‌సీఈఆర్‌టీపై ఒత్తిడి పెంచాయి.

Advertisements
 
Comments Off on మా ఉపాధ్యాయుల‌కూ శిక్షణ ఇవ్వండి!

Posted by on September 29, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: