RSS

ఎన్ఐఏసీఎల్‌లో అసిస్టెంట్ పోస్టుల‌కు సిద్ధమ‌వుదామిలా…

19 Oct

ఎన్ఐఏసీఎల్‌లో అసిస్టెంట్ పోస్టుల‌కు సిద్ధమ‌వుదామిలా…

న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్‌) తాజాగా 1536 అసిస్టెంట్ పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 38, తెలంగాణ‌లో 55 పోస్టులు ఉన్నాయి. ఇంట‌ర్మీడియ‌ట్‌లో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు లేదా ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు. బ్యాంకు పోస్టుల‌కు సిద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్థులు ఆ ప్రిప‌రేష‌న్‌తో ఎన్ఐఏసీఎల్‌ ప‌రీక్షను ఎదుర్కోవ‌డం సులువే. ఎందుకంటే సిల‌బ‌స్‌, ప‌రీక్ష‌ విధానం ఐబీపీఎస్ క్ల‌రిక‌ల్ మాదిరిగానే ఉంటుంది. ప‌రీక్షాంశాలైన రీజ‌నింగ్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌ల్లో ఎక్కువ మార్కులు సాధించ‌డానికి ఎలా స‌న్న‌ద్ధం కావాలో తెలుసుకుందాం.
సిద్ధ‌మ‌వుదామిలా….
రీజనింగ్‌:
అభ్యర్థి మానసిక సామర్థ్యం, కుశాగ్రబుద్ధి, త‌ర్కాన్ని ప‌రిశీలించే ప్ర‌శ్న‌లు ఈ విభాగంలో ఉంటాయి. ప్ర‌శ్న‌లోని తర్కాన్ని ఆధారం చేసుకుని జ‌వాబులు గుర్తించాలి త‌క్కువ వ్య‌వ‌ధిలో జ‌వాబు గుర్తించే సామ‌ర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. స‌మ‌స్య‌ను నిశితంగా ప‌రిశీలించ‌గ‌ల‌గ‌డం, విశ్లేషించ‌డం రెండూ ఏక‌కాలంలో చేయ‌గ‌లిగితే స‌మాధానం ప‌సిగ‌ట్ట‌డం తేలిక‌వుతుంది. ఇటీవ‌లి కాలంలో నిర్వ‌హించిన ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ అసోషియేట్స్ ఈ మూడు ప‌రీక్ష‌ల‌కూ చెందిన క్ల‌రిక‌ల్ ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను బాగా అధ్య‌య‌నం చేస్తే ఏయే అంశాల‌ను చ‌ద‌వాలి, వేటికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ప్ర‌శ్న‌ల స్థాయి ఎలా ఉండొచ్చు…ఇవ‌న్నీ అవ‌గ‌త‌మ‌వుతాయి.
ఇంగ్లిష్‌:
తెలుగు మీడియంలో చ‌దివే అభ్య‌ర్థులు ఇబ్బందిగా భావించే సెక్ష‌న్ల‌లో ఇంగ్లిష్ ప్ర‌ధాన‌మైన‌ది. అయితే మిగిలిన సెక్ష‌న్ల‌తో స‌మాన‌మైన ప్రాధాన్యాన్ని ఇంగ్లిష్‌కూ ఇవ్వాలి. ఎందుకంటే ఇంగ్లిష్‌లో అర్హ‌త సాధిస్తే స‌రిపోతుందనే స‌డ‌లింపు న్యూ ఇండియా అష్యూరెన్స్ ప‌రీక్ష‌లో లేదు. మిగిలిన సెక్ష‌న్ల‌తో స‌మాన‌మైన ప్రాధాన్యం ఇంగ్లిష్‌కీ ఉంది. కాబ‌ట్టి ఆంగ్లాన్ని అశ్ర‌ద్ధ చేయ‌రాదు. పారాగ్రాఫ్ ప్ర‌శ్న‌లు, ప్ర‌పోజిష‌న్స్‌, ఆర్టిక‌ల్స్‌, ఫిల్ ఇన్ ది బ్లాంక్ ప్ర‌శ్న‌లకు వ్యాక‌ర‌ణ నియ‌మాలు ఉప‌యోగించి స‌మాధానం గుర్తించ‌వ‌చ్చు. కొంచెం శ్ర‌ద్ధపెడితే తెలుగు మీడియం అభ్య‌ర్థులు కూడా 30 నుంచి 35 మార్కుల వ‌ర‌కు స్కోర్ చేయ‌డానికి అవ‌కాశాలున్నాయి. ప‌ద‌సంప‌ద‌(ఒకాబుల‌రీ)ని కొన్ని రోజుల వ్య‌వ‌ధిలో వృద్ధి చేసుకోవ‌డం సాధ్యం కాదు. అందుకే ఇంగ్లిష్ సెక్ష‌న్‌లో మిగిలిన అంశాల‌పై దృష్టి సారించ‌డ‌మే ప్ర‌యోజ‌న‌క‌రం. ఐబీపీఎస్ క్ల‌రిక‌ల్ ఇంగ్లిష్ పాత‌ప్ర‌శ్న‌ప‌త్రాలు ప్రిప‌రేష‌న్‌లో దిక్సూచిలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవ‌కాశాన్ని బ‌ట్టి టాటా మెక్‌గ్రాహిల్స్ ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ ఫ‌ర్ కాంపిటీటివ్ ఎగ్జామినేష‌న్ పుస్త‌కాన్ని చ‌దివితే ప్ర‌యోజ‌న‌మే.
న్యూమరికల్‌ ఎబిలిటీ:
ఈ విభాగంలోని ప్ర‌శ్న‌లు సులువుగానే ఉంటాయి. కానీ వాటిని సాధించ‌డానికి మాత్రం ఎక్కువ స‌మ‌యం అవ‌స‌రం. అందువ‌ల్ల‌ షార్ట్‌కట్‌ మెథడ్స్‌ చాలా ఉపకరిస్తాయి. న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీలో దాదాపు 80 శాతం ప్ర‌శ్న‌లు కూడిక, తీసివేత, గుణించ‌డం, భాగించ‌డంపైనే ఆధార‌ప‌డి ఉంటాయి. వీటిని త‌క్కువ వ్య‌వ‌ధిలో చేయ‌గ‌లిగే నైపుణ్యం పెంచుకుంటే స‌రైన స‌మాధానాన్ని సులువుగా గుర్తించ‌వచ్చు. అలాగే ప‌రీక్ష‌లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయ‌డానికి అవ‌కాశం ఉన్న విభాగం కూడా ఇదే. నోటితోనే లెక్కించ‌గ‌లిగే ప్రావీణ్యం పొందాలి. దీనికోసం ఎక్కాలు, వ‌ర్గాల‌ను బ‌ట్టీ ప‌ట్టాలి.
జనరల్‌ అవేర్‌నెస్‌:
రోజువారీ ప‌త్రికా ప‌ఠ‌నం, మ‌రికొంచెం స‌న్న‌ద్ధ‌త‌ల ద్వారా జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌లో ఎక్కువ మార్కులు పొందొచ్చు. అలాగే సులువుగా మార్కులు పొంద‌డానికి అవ‌కాశం ఉన్న విభాగాల్లో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ కూడా ఒక‌టి. ప్ర‌శ్న‌ల్లో ఎక్కువ భాగం ఇటీవ‌లి కాలంలో జ‌రిగిన ప‌రిణామాల‌పైనే ఉంటాయి. 2014లో వివిధ క్రీడ‌ల్లో విజేత‌లు, అవార్డు గ్ర‌హీత‌లు, కీల‌క నిర్ణ‌యాలు, ప్ర‌ముఖ ఘ‌ట్టాలపై ప్ర‌శ్న‌లుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు స్వ‌చ్ఛ భార‌త్ కోసం పిలుపునిచ్చిన‌వారు ఎవ‌రు? ఆర్థిక రంగంలో ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి ఎవ‌రికొచ్చింది?…త‌ర‌హా ప్ర‌శ్న‌ల‌ను ఆశించ‌వ‌చ్చు. కాబ‌ట్టి ప్ర‌తిరోజూ ఏదైనా ప‌త్రిక‌ను చ‌దివి ముఖ్యాంశాల‌ను నోట్సుగా రాసుకుంటే బాగా గుర్తుంటాయి. భీమా రంగంలో ఉద్యోగం కాబ‌ట్టి ఈ విభాగం గురించి బాగా చ‌దువుకోవాలి. దిన‌ప‌త్రిక‌ల్లోని బిజినెస్ పేజీల‌ను ప‌రిశీలిస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది. వీటితోపాటు స్టాక్ జీకేపైనా ప్ర‌శ్న‌ల‌డుగుతారు. దేశాలు రాజ‌ధానులు, పార్ల‌మెంట్ పేర్లు, ప‌ర్వ‌తాలు, న‌దులు, స‌ర‌స్సులు, ఎడారులు…ఇలా అన్ని అంశాల‌నూ చ‌దివితే ఆశించిన స్థాయిలో మార్కులు పొంద‌వ‌చ్చు.
కంప్యూటర్ నాలెడ్జ్‌:
రీజ‌నింగ్‌, ఇంగ్లిష్‌ల‌తో పోల్చుకుంటే తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు సాధించగ‌లిగే విభాగం కంప్యూట‌ర్ నాలెడ్జ్‌. కంప్యూట‌ర్‌కు సంబంధించి ప్రాథ‌మిక ప‌రిజ్ఞానం ప‌రిశీలించే ప్ర‌శ్న‌లుంటాయి. కంప్యూట‌ర్ల వినియోగం, అందులోని హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ అంశాల‌పైనే ఎక్కువ ప్ర‌శ్న‌ల‌డుగుతారు. అలాగే ఇటీవ‌లి కాలంలో సాంకేతిక వినియోగం పెరుగుతోంది. కార్యాల‌యాల్లో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. కాబ‌ట్టి టెక్నాల‌జీ ప‌రంగా తాజా మార్పుల‌ను అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. డిగ్రీలో కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివిన‌వాళ్ల‌కు ఈ విభాగం సులువుగానే అనిపిస్తుంది. కంప్యూట‌ర్ని వినియోగించ‌డం వ‌చ్చినన‌వాళ్లంతా కొద్దిపాటి స‌న్న‌ద్ధ‌త‌తో త‌క్కువ వ్య‌వ‌ధిలోనే ఎక్కువ మార్కులు పొంద‌వ‌చ్చు.
మౌఖిక పరీక్ష:
అభ్య‌ర్థి వ్య‌క్తిత్వాన్ని ప‌రిశీలిస్తారు. వినియోగ‌దారుల‌తో ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు అనే కోణంలో సునిశితంగా గ‌మ‌నిస్తారు. ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగేస్తే ఇంట‌ర్వ్యూలో గ‌ట్టెక్క‌డం తేలికే. ఆందోళ‌న చెంద‌కుండా స్వేచ్ఛ‌గా, నిజాయితీగా, స్ప‌ష్టంగా భావాల‌ను వ్య‌క్తంచేస్తే స‌రిపోతుంది. స‌మాధానం తెలిసిన‌ట్లు న‌టించ‌డం వ‌ల్ల స్కోర్‌లో వెనుక‌బ‌డిపోతారు. ఉద్యోగం చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ల‌క్ష‌ణాలు అభ్య‌ర్థిలో ఉన్నాయా? లేవా? అనే కోణంలోనే ఇంట‌ర్వ్యూ సాగుతుంది. అవ‌కాశం క‌ల్పిస్తే ఉద్యోగంలో కొన‌సాగుతాడో లేదో కోణంలో ప‌రిశీలిస్తారు.
గుర్తుంచుకోండి…
ఏ ప‌రీక్ష‌లోనైనా విజ‌యం సాధించాలంటే నేర్చుకోవడం, సాధన చేయడం, సమయపాలన ఈ మూడే కీల‌కం.
మొద‌టి 45 రోజుల వ‌ర‌కు రీజనింగ్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, ఇంగ్లిష్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌లోని ప్రాథమికాంశాలు బాగా చ‌దువుకోవాలి.
న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీకి సంబంధించి శాతాలు, క‌సాగు, గ‌సాభా, సరాసరి, వడ్డీ, లాభం- నష్టం, కాలం-పని, కాలం-దూరం, నిష్పత్తి- అనుపాతం ఇలాంటి గ‌ణిత అంశాల‌ను రోజుకొక‌టి చొప్పున సాధ‌న చేయాలి. వీటికోసం గ‌ణిత పాఠ్య‌పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. ఇదే మాదిరి రీజ‌నింగ్‌లోని ముఖ్యాంశాల‌నూ రోజుకొక‌టి చొప్పున సాధ‌న చేయాలి.
న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, రీజ‌నింగ్ అంశాల్లో ప్రాథమిక భావనలు నేర్చుకున్న తరవాత వాటిలోని వివిధ రకాల ప్రశ్నలు సాధన చేయాలి. దీనికోసం పాత ప్ర‌శ్న‌ప‌త్రాలు, మోడ‌ల్ పేప‌ర్లు, ఆన్‌లైన్ ప్రాక్టీస్‌ ప‌రీక్ష‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
ఎంత‌బాగా సిద్ధ‌మైన‌ప్ప‌టికీ ప‌రీక్ష‌లో స‌మ‌య‌పాల‌న లేక‌పోతే ప్ర‌యోజ‌నం శూన్య‌మే. కాబ‌ట్టి ఉన్న రెండు గంట‌ల స‌మ‌యాన్ని ఆయా విభాగాల సంక్లిష్టతను అనుసరించి కేటాయించుకోవాలి. ఈ విధంగా చూస్తే న్యూమరికల్ ఎబిలిటీ- 40 నిమిషాలు, రీజనింగ్‌ – 35 నిమిషాలు, ఇంగ్లిష్‌- 25 నిమిషాలు, జనరల్‌ అవేర్‌నెస్‌- 10 నిమిషాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం- 10 నిమిషాలు… ఇలా విభ‌జించుకోవాలి. అయితే ఇది కేవ‌లం ఒక ఐడియా కోస‌మే. అభ్య‌ర్థులు సులువుగా భావించిన సెక్ష‌న్ల‌కు త‌క్కువ వ్య‌వ‌ధిని, క‌ష్టంగా అనిపించే సెక్ష‌న్ల‌కు ఎక్కువ వ్య‌వ‌ధిని ఎవ‌రికి వారే కేటాయించుకోవాలి.
పరీక్షకు కనీసం నెలరోజుల ముందు నుంచి మాదిరి ప్రశ్నపత్రాలను సమయాన్ని అనుసరించి సాధన చేయాలి. కేటాయించుకున్న సమయంలో ఆయా విభాగాల్లో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో గ‌మ‌నించాలి. త‌ర్వాత సాధ‌న చేసే మాదిరి ప‌రీక్ష‌ల్లో నిర్ణీత వ్య‌వ‌ధిలో సాధించే ప్రశ్నల సంఖ్య పెరిగేలా చూసుకోవాలి.
అస‌లైన ప‌రీక్ష‌లో మాత్రం స‌మాధానం గుర్తించ‌డానికి ఎక్కువ వ్య‌వ‌ధిని తీసుకునే ప్ర‌శ్న‌లను వదిలేయాలి. అలాగే స‌మాధానం తెలియ‌కుండానే ఏదో ఒక ఆప్ష‌న్‌ని గుర్తించ‌డమూ మానుకోవాలి. తెలిసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు గుర్తించ‌డం పూర్త‌యిన త‌ర్వాత స‌మ‌యం ఉంటే జ‌వాబు రాబ‌ట్ట‌డానికి అవ‌కాశం ఉన్న మిగిలిన ప్ర‌శ్న‌ల‌ను సాధించాలి.
అభ్య‌ర్థులు బాగా తేలిక‌గా అనిపించే సెక్ష‌న్‌లోని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను ముందుగా గుర్తించ‌డం మంచిది. అలాగే బాగా క‌ష్టంగా అనిపించే సెక్ష‌న్‌లోని ప్ర‌శ్న‌ల‌కు చివ‌ర‌గా జ‌వాబులు గుర్తించ‌డ‌మే బాగు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒక సెక్ష‌న్ ప్ర‌భావం మ‌రో సెక్ష‌న్‌పై ప‌డ‌దు. అలాగే ఆత్మ‌విశ్వాసం కోల్పోకుండా జ‌వాబులు గుర్తించ‌వ‌చ్చు. ఎక్కువ మార్కులు పొంద‌డానికి అవ‌కాశం ఉన్న విభాగాల‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ప్ర‌శ్న‌ప‌త్రంలో అన్ని సెక్ష‌న్ల‌కూ స‌మాన ప్రాధాన్యం ఉంది. కాబ‌ట్టి అభ్య‌ర్థి త‌న సౌల‌భ్యానికి అనుగుణంగా జ‌వాబులు గుర్తించుకోవ‌చ్చు.
మొత్తం ఖాళీలు: 1536
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఖాళీలు: 38
తెలంగాణ‌లో ఖాళీలు: 55
అర్హ‌త‌: 60 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త (ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌, ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్ అభ్య‌ర్థులైతే 50 శాతం) లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వ‌యోప‌రిమితి: జూన్ 30, 2014 నాటికి క‌నిష్ఠంగా 18 ఏళ్లు, గ‌రిష్ఠంగా 30 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, డిజేబుల్డ్ అభ్య‌ర్థులైతే ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి. భ‌ర్త మ‌ర‌ణించినా, లేదా విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోని మ‌హిళ‌ల‌కు ఐదేళ్ల స‌డ‌లింపు ఉంటుంది. అలాగే ఎక్స్ ప‌ర్వీస్‌మెన్‌కు స‌ర్వీస్ నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.)
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, కంప్యూట‌ర్ ప్రొఫిషియ‌న్సీ ప‌రీక్ష‌ల ద్వారా
ప్ర‌శ్న‌ప‌త్రం: ఆబ్జెక్టివ్ విధానంలో ఇంగ్లిష్ మాధ్య‌మంలో ఉంటుంది. త‌ప్పు స‌మాధానం గుర్తించిన ప్ర‌తి ప్ర‌శ్న‌కు పావు మార్కు చొప్పున త‌గ్గిస్తారు.
రాత ప‌రీక్ష‌లో: రీజ‌నింగ్ నుంచి 50, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 50, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ 50, కంప్యూట‌ర్ నాలెడ్జ్ 50 మొత్తం 250 మార్కుల‌కు ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంది.
ప‌రీక్ష వ్య‌వ‌ధి: 120 నిమిషాలు
ఇంట‌ర్వ్యూ: 15 మార్కుల‌కు కేటాయించారు. రాత ప‌రీక్ష‌కు కేటాయించిన 250 మార్కుల‌ను 35కి కుదిస్తారు. అంటే 35+15 మొత్తం 50 మార్కుల‌కు కుదిస్తారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ వెయిటేజీ 70:30గా ఉంటుంది. మెరిట్ ప్ర‌కారం ఎంపిక చేస్తారు.
కంప్యూట‌ర్ ప్రొఫిషియ‌న్సీ: ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌కు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఎలా ఉందో ప‌రిశీలిస్తారు. దీనికంటూ మార్కులు కేటాయించ‌లేదు. అయితే కంప్యూట‌ర్ ఉప‌యోగించి ప‌నిచేసే స‌మ‌ర్థ‌త లేక‌పోతే మాత్రం అన‌ర్హులుగా ప్ర‌క‌టిస్తారు.
ద‌ర‌ఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌ల‌కు రూ. 50; మిగిలిన అంద‌రికీ రూ.500
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌, ఫీజు చెల్లించ‌డానికి గడువు తేదీ: న‌వంబ‌ర్ 10, 2014
పే స్కేల్‌: రూ.7640-21050 (కొద్ది నెల‌ల్లో కొత్త స్కేల్ అమ‌ల్లోకి వ‌స్తుంది). కొత్త స్కేల్ ద్వారా నెల‌కు రూ.20 వేల వ‌ర‌కు వేత‌నాన్ని అశించ‌వ‌చ్చు.
ప‌రీక్ష తేదీ: 2015 జ‌న‌వ‌రి 17, 18, 24 తేదీల్లో నిర్వ‌హిస్తారు.
హాల్ టిక్కెట్లు: ప‌రీక్ష‌కు ప‌ది రోజుల ముందు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ప‌రీక్ష కేంద్రాలు:
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో: చీరాల‌, శ్రీకాకుళం, గుంటూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి, కాకినాడ‌, చిత్తూరు, కంచిక‌చెర్ల‌, గుడ్ల‌వెల్లూరు, ఏలూరు, విజ‌య‌న‌గ‌రం.
తెలంగాణ‌లో: హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వివిధ చోట్ల కేంద్రాలుంటాయి. వీటితోపాటు క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మంలో ఆన్‌లైన్‌లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.
వెబ్‌సైట్: www.newindia.co.in

 
Comments Off on ఎన్ఐఏసీఎల్‌లో అసిస్టెంట్ పోస్టుల‌కు సిద్ధమ‌వుదామిలా…

Posted by on October 19, 2014 in Uncategorized

 

Comments are closed.

 
%d bloggers like this: