RSS

ఇంటర్‌ పరీక్షలపై పీటముడి!

17 Oct

ఇంటర్‌ పరీక్షలపై పీటముడి!Date: 17/10/2014
* విడివిడిగా ఏర్పాట్లు చేయండన్న తెలంగాణ మంత్రి
* ఉమ్మడి పరీక్షలే మా విధానమన్న ఆంధ్ర అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల నిర్వహణ తీరుతెన్నులపై పీటముడి పడింది. పరీక్ష పత్రాలు రూపొందించే ప్రక్రియ ఆరంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం ఇంటర్‌బోర్డు అధికారులను ఆదేశించారు. అక్టోబ‌రు 16న‌ సాయంత్రం సచివాలయంలో ఆయన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌, ఇంటర్‌ విద్య కమిషనర్‌ శైలజారామయ్యర్‌లతో కలసి బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విడివిడి పరీక్ష పత్రాలకే మంత్రి మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే… ఈ సమావేశానికి వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫోన్‌ చేసి… ఉమ్మడి పరీక్షలే తమ విధానమని, ఇదే విషయాన్ని చెప్పాలని బోర్డు అధికారులకు సూచించినట్లు సమాచారం. కాగా… త్వరలోనే ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ విద్యామంత్రి గంటా శ్రీనివాసరావుతో మాట్లాడాతానని, సమస్యను పరిష్కరిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. అంతిమ నిర్ణయంతో సంబంధం లేకుండా… పరీక్ష పత్రాల రూపకల్పన ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పదో షెడ్యూల్‌లో ఉండి…రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా విధులు నిర్వహిస్తున్న ఇంటర్‌బోర్డు అధికారులు అయోమయంలో పడ్డారు. ఎంసెట్‌, జేఈఈ ప్రవేశపరీక్షల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కీలకంగా మారింది. విడివిడిగా పేపర్లు పెడితే పేపర్‌ రూపకల్పనలో (సులభంగా, కఠినంగా అని) అనుమానాలు తలెత్తే అవకాశముందని ఒకవాదన. అయితే… ఇప్పటికే విడివిడిగా (ఏ రాష్ట్రం పేపర్లు ఆ రాష్ట్రంలోనే) పేపర్లను దిద్దుతున్న నేపథ్యంలో విడిగా పేపర్లు తయారు చేసుకోవటంలో తప్పులేదనేది మరో వాదన. తుపాను పనుల్లో ఆంధ్ర విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు హడావిడిగా ఉన్న నేపథ్యంలో మరికొద్దిరోజుల పాటు మంత్రుల భేటీ సాధ్యంకాకపోవచ్చు.

 
Comments Off on ఇంటర్‌ పరీక్షలపై పీటముడి!

Posted by on October 17, 2014 in Uncategorized

 

Comments are closed.