RSS

కళాశాలకు గ్రేడింగ్

17 Oct

కళాశాలకు గ్రేడింగ్
* న్యాక్ తరహాలో రాష్ట్రంలో సాక్
* తెలంగాణ ఉన్నత విద్యశాఖ ప్రతిపాదన
ఈనాడు, హైదరాబాద్: అన్ని కళాశాలల్లో ప్రమాణాలు, పోటీని పెంచేందుకు రాష్ట్ర స్థాయిలో అసెస్‌మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ (సాక్)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) తరహాలోనే రాష్ట్ర స్థాయిలో ఈ మండలిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ సాక్ ఏర్పడితే రాష్ట్రంలోని అన్ని కళాశాలలను పరిశీలించి, వాటి పనితీరును బేరీజు వేసి, ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తారు. ఈ గ్రేడింగ్‌తో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ప్రాజెక్టులను, నిధులను తెచ్చుకునే వీలుంటుంది. ప్రస్తుతం న్యాక్ నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు అక్రిడిటేషన్ పొందుతున్నాయి. జాతీయ స్థాయిలో ఈ ప్రక్రియలో ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యాన్ని నివారించటంతోపాటు… రాష్ట్రంలోని కాలేజీల మధ్య పోటీని పెంచటానికి రాష్ట్ర స్థాయిలోనే సాక్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉన్నతవిద్యాశాఖ భావిస్తోంది. అధ్యాపకుల, కాలేజీల పనితీరును బేరీజు వేయటానికి పద్ధతులను రూపొందిస్తున్నామని ఉన్నత విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. అధ్యాపకుల పనితీరు అంచనా వేయటానికి మూడు రకాల పద్ధతుల్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒకటి- విద్యార్థుల నుంచి, రెండు- మిగిలిన సహచరుల నుంచి, మూడు- ప్రిన్సిపల్ లేదా విభాగాధిపతి నుంచి వివరాలు సేకరిస్తారు. వీటన్నింటికి తోడు అధ్యాపకుల స్వీయ అంచనా కూడా ఉంటుంది. ఇదంతా ప్రాథమిక ఆలోచనే. ఎలా చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అందరినీ సంప్రదించి నియమావళిని రూపొందిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

 
Comments Off on కళాశాలకు గ్రేడింగ్

Posted by on October 17, 2014 in Uncategorized

 

Comments are closed.