RSS

sashtra

వాషింగ్టన్‌: అమెరికా రక్షణ దిగ్గజం బోయింగ్‌ సంస్థ రూపొందించిన పి-8ఐ పహారా విమానాన్ని భారత నౌకాదళానికి అప్పగించారు. భారత్‌ కోసం ఇలాంటి ఎనిమిది విమానాలు తయారుచేస్తున్న బోయింగ్ 2013 మేలో ఒకటి సరఫరా చేయగా ఇది రెండోది. దీంతో నౌకాదళానికి సముద్రతల నిఘా పరిధి, జలాంతర్గాముల నాశక సామర్థ్యం పెరగనున్నాయి. ఈ రెండు విమనాలకు సమాచార మార్పిడి సామర్థ్యం ఉండటం విశేషం. మొదటి పి-8ఐ ఆయుధ, క్షిపణి సామర్థ్యాలను ఇప్పటికే పరీక్షించగా.. తాజాగా చేరిన యుద్ధవిమానాన్ని త్వరలో పరీక్షించనున్నారు.

టొరంటో: జూదమాడే వ్యసనం నుంచి బయట పడేసేందుకు త్వరలోనే ఔషధాలు అందుబాటులోకి రానున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా ఓ ప్రత్యేక పరికరం సాయంతో ఎలుకల్లో ఇలాంటి ప్రవర్తనను విజయవంతంగా తగ్గించగలిగారు. డొపమైన్‌ డీ4 రిసెప్టర్‌ను అడ్డుకునే ఔషధాలతో ఎలుకలకు చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించారు. ఇదేతరహా ఔషధ చికిత్స మనుషుల్లోనూ వ్యసనాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో మరింతగా అధ్యయనాలు అవసరమైనా, ప్రస్తుత అధ్యయనంలో వెల్లడైన అంశాలు జూదం వ్యసనానికి చికిత్స అందించే దిశగా కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయని పరిశోధకులు పాల్‌ కాకర్‌ పేర్కొన్నారు.

వాషింగ్టన్: మనకు ఆసక్తి కలిగిన వస్తువులు, పరిసరాలను స్వయంచాలితంగా రికార్డు చేసే కెమెరాను అభివృద్ధి చేసింది టోక్యోకు చెందిన కంపెనీ న్యూరోవియర్. ఈ కెమెరా.. సెన్సర్ల సాయంతో వినియోగదారుని మెదడులో జరిగే చర్యలను గుర్తించి.. వాటి ఆధారగా అతని ఆసక్తిని పసిగట్టి సదరు దృశ్యాలను రికార్డు చేస్తుంది. ఈ మేరకు జిగ్‌మ్యాగ్ ఈ కెమెరా వివరాలను వెల్లడించింది.

వాషింగ్టన్: ఎదుటి వ్యక్తి మాట్లాడే తీరు….వాడే పదాలను బట్టి ఆ వ్యక్తిలోని సృజనాత్మకతను ఇట్టే అంచనా వేయవచ్చు. ఈ విధంగా ఎదుటి వ్యక్తి సృజనశక్తిని కొలిచే విశ్వసనీయమైన పరీక్షను మిచిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు. దీనిని వారు ‘నౌన్-వెర్బ్ టెస్ట్’గా పేర్కొంటున్నారు. ఈ పరీక్షను…ఎవరైనా, ఎక్కడైనా సరే చేయవచ్చు. చివరకు ఎంఆర్ఐ మిషన్ ద్వారా సైతం ఎదుటి వ్యక్తిలోని సృజనను అతడు వాడిన పదాల ప్రాతిపదికన కొలిచేయవచ్చు. అసలు మనిషి మెదడులో సృజనకు కారకం ఏమిటనేది మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని పరిశోధకుల బృందానికి సారధ్యం వహించిన జెర్మీ గ్రే పేర్కొన్నారు. ఓ న్యూరో సైంటిస్టుగా తాను ఓ మనిషిలో సృజనకు కారణమయ్యే మెదడు ప్రక్రియను లోతుగా విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి సృజన అనేది ఏదో అలా ఆకాశం నుంచి ఊడిపడిపోదు. ఎవరైనా సరే ఏబీసీడీలు నేర్చేసుకున్న వెంటనే పెద్దపెద్ద గేయాలు…కవిత్వాలు రాసేయలేరు. భాషపై ముందుగా పట్టుసాధించాలి. ఆ తర్వాత చాలా అందంగా …పొందిగ్గా…వినూత్నంగా తాము నేర్చుకున్న పదసంపదను వాడగలిగే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి కదా! అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిలోని సృజన…అతడి భావవక్తీకరణ ద్వారా వెలుగుచూస్తుందని విశ్లేషించారు.

* చైనా వైద్యుల ఘనత
* అగ్నిప్రమాదంలో గాయపడిన బాలికకు కొత్త జీవితం

బీజింగ్: ఇటీవల నుదుటిపై కొత్త ముక్కును వృద్ధిచేసి వార్తల్లోకి ఎక్కిన చైనా వైద్యులు తాజాగా మరో ఘనతనూ సాధించారు. ఛాతీపై కొత్త చర్మాన్ని సృష్టించి, దాన్ని 17 ఏళ్ల జు జియాన్‌మీ ముఖానికి అతికించారు. చిన్నప్పుడు అగ్నిప్రమాదం మూలంగా కోల్పోయిన ఆమె ముఖాకృతిని తిరిగి కొత్తగా తీర్చిదిద్దారు. దీంతో ఆమె 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా నవ్వగలిగింది. ఐదేళ్ల వయసులో జు జియాన్‌మీ అగ్నిప్రమాదం బారినపడింది. ఆమె బుగ్గ, కనురెప్పలు, కుడి చెవిభాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. తల్లిదండ్రులకు ప్లాసిక్ సర్జరీ చేయించే స్థోమత లేకపోవటంతో అప్పట్నుంచీ ఆమె కోల్పోయిన ముఖాకృతితో అలాగే గడిపింది. అయితే గత సంవత్సరం వైద్యులు ఆమెకు కొత్తరకం శస్త్రచికిత్స చేయాలని ప్రతిపాదించారు. కాలి నుంచి తీసిన కణజాలం సాయంతో ఛాతీపై ‘కొత్త ముఖాన్ని’ వృద్ధి చేసి, ఆమె ముఖానికి మార్పిడి చేయాలని నిర్ణయించారు. ఈ నెల మొదట్లో దాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ”ముందుగా ఆమె తొడ నుంచి రక్తనాళంతో కూడిన చర్మంకింది పొరను తీసుకున్నాం. దాన్ని ఆమె ఛాతీలో ప్రవేశపెట్టాం. తర్వాత బెలూన్‌లో కొద్దికొద్దిగా సెలైన్ నింపుతూ ఆ పొరను సాగేలా చేసి, కొత్త చర్మాన్ని వృద్ధి చేశాం. అలా ఆమె ముఖానికి అతికించటానికి సరిపడినంత చర్మాన్ని సృష్టించాం. అనంతరం దాన్ని ఆమె ముఖానికి మార్పిడి చేశాం” అని జియాన్‌మీకి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ జియాంగ్ చెంఘాంగ్ తెలిపారు. కొద్దివారాల్లోనే శస్త్రచికిత్స గాయాలు మానిపోతాయని వైద్యులు పేర్కొన్నారు. ఆమె ఇప్పుడు ముఖ కదలికల ద్వారా తన భావాలను సైతం వెల్లడించగలదని, కాకపోతే కొంత సమయం పడుతుందని వివరించారు.

చెట్ల ఆకుల్లో బంగారు రేణువుల్ని గుర్తించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
మెల్‌బోర్న్‌: బంగారం చెట్లకు కాస్తుందా..? ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మాత్రం నిజంగానే.. చెట్లలో బంగారాన్ని కనిపెట్టారు. పెర్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు యూకలిప్టస్‌ చెట్లలో సూక్ష్మ బంగారు రేణువులను గుర్తించారు. ఈ పరిశోధనతో విలువైన బంగారు ఖనిజానికి సంబంధించి కొత్త మార్గం దొరికినట్లయింది. భూమి లోలోపల బంగారు ఖనిజాలున్న చోట్ల వాటిపై పెరిగే చెట్లు.. కరవు సమయాల్లో తేమ కోసం నీటిలో ఉండే బంగారాన్ని కూడా పీల్చుకుంటాయని భావిస్తున్నట్లు ‘కామన్వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌వో)’కు చెందిన పరిశోధకులు పేర్కొన్నట్లు ‘ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌’ వెల్లడించింది. తామిది వూహించలేదనీ, చెట్ల ఆకుల్లో బంగారు రేణువుల్ని గుర్తించడం అద్భుతంగా అనిపించిందని సీఎస్‌ఐఆర్‌వోకు చెందిన జియోకెమిస్ట్‌ మెల్విన్‌ లింటెర్న్‌ పేర్కొన్నారు. యూకలిప్టస్‌ చెట్లు హైడ్రాలిక్‌ పంప్‌లా వ్యవహరిస్తాయనీ, చెట్ల వేర్లు మీటర్లకొద్దీ లోపలికి వెళ్లి, బంగారంతోకూడిన నీటిని లాగేస్తాయని వివరించారు. నీటిద్వారా వచ్చే బంగారం ఆకులు, కొమ్మలకు చేరి, బయటికి విడుదలవటంగానీ, నేలపై పడిపోవడంగానీ జరుగుతుందని పేర్కొన్నారు. బంగారు నిక్షేపాలున్న చోట పెరిగే 500 చెట్ల నుంచి ఓ పెళ్లి ఉంగరానికి సరిపడే బంగారం పొందవచ్చన్నారు. ఈ పరిశోధనతో భూమి లోపల ఎలాంటి నిక్షేపాలున్నాయనే సంగతి, డ్రిల్లింగ్‌ జరపుకుండా, ‘బయోజియోకెమికల్‌ శాంప్లింగ్‌’ ప్రక్రియ ద్వారా గుర్తించే అవకాశం ఉందన్నారు. ఖనిజాల అన్వేషణలో వ్యయాలు తగ్గించుకోవడం, పర్యావరణంపై దుష్ప్రభావం లేకుండా చూసేందుకు ఈ పద్ధతి తోడ్పడగలదని అభిప్రాయపడ్డారు. జింకు, రాగి వంటి ఇతర ఖనిజాలను గుర్తించేందుకు సైతం ఉపయోగించవచ్చన్నారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కలగూర్లీ ప్రాంతంలో ఉన్న చెట్లలో ఈ బంగారాన్ని గుర్తించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న బంగారం రేణువుల విశ్లేషణ కోసం సీఎస్‌ఐఆర్‌వోకు చెందిన ‘మయా డిటెక్టర్‌’ను ఉపయోగించారు.

హైటెక్‌ మేకప్‌ సామగ్రిని రూపొందించిన బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు
లండన్‌: కంటిచూపుతో చంపేస్తా వంటి డైలాగులు ఇప్పటివరకూ సినిమాల్లో మనం వింటున్నవే. తాజాగా, బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు కంటిచూపుతో చంపివేయకున్నా.. కంటిచూపుతో లైట్లు, టీవీ, ఏసీ వంటి గృహోపకరణాలను నియంత్రించే హైటెక్‌ అలంకరణ సామగ్రిని రూపొందించారు. వీటిని ముఖానికి వేసుకుంటే కంటి కదలికలు, ముఖకవళికల సంకోచ, వ్యాకోచాల ద్వారా ఎలక్ట్రానిక్‌ వస్తువులను నియంత్రించవచ్చని చెబుతున్నారు. రియోడీజెనిరోలోని పాంటిఫిసల్‌ క్యాథలిక్‌ యూనివర్సిటీకి చెందిన ‘బ్యూటీ టెక్నాలజీ డిజైనర్‌’ కేటియా వెగా నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అలంకరణ సామగ్రిని తయారుచేసింది. పలచటి లోహంతో కృత్రిమ కనువెంట్రుకలను, కనురెప్పలపై వేసుకునే రంగులను వీరు రూపొందించారు. ఇవి ఎలక్ట్రానిక్‌ వస్తువులతో వైర్‌లెస్‌ సర్క్యూట్‌ ద్వారా అనుసంధానమై ఉంటాయి. కనురెప్పలను, కంటి కండరాలను స్వల్పంగా కదిలించినప్పుడు.. వీటినుంచి వెలువడే సంకేతాల ద్వారా ఎలక్ట్రానిక్‌ వస్తువులు పని చేస్తాయి. శారీరక వైకల్యంతో ఇబ్బందిపడే వారికోసం వీటిని రూపొందించామని, వారు ఇతరుల సహాయం లేకుండా సొంతంగా గృహోపకరణాలను నియంత్రించవచ్చని వెగా తెలిపారు

లండన్: రహదారులను వెలుగులతో నింపడానికి శాస్త్రవేత్తలు కొత్త పూతను తయారుచేశారు. తారు, సిమెంటు రోడ్లపై దీన్ని పూసినా, పిచికారీ చేసినా ఇది అతుక్కుపోతుంది… పగటి వేళలో అతినీలలోహిత కాంతిని గ్రహించి నిల్వ చేసుకుంటుంది. రాత్రి సమయంలో తిరిగి తనకు తానే ఆ కాంతిని వెలువరిస్తుంది. బయట వెలుతురు స్థాయిని అనుసరించి ఇది ప్రసరించే వెలుగు ఉంటుంది..

పగటి వెలుగు తగ్గగానే కొద్దికొద్దిగా కాంతి రావడం ప్రారంభమై పూర్తిగా చీకటి పడిన తర్వాత‌ పూర్తిస్థాయిలో వెలుగునిస్తుంది. దీన్ని ప్రయోగాత్మకంగా కేంబ్రిడ్జ్‌లోని క్రైస్ట్ పీసెస్ పార్క్ ప్రాంతంలో 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉపయోగించి చూశారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే దీన్ని బ్రిటన్‌కు చెందిన ప్రోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది. పూసిన నాలుగు గంటల వ్యవధిలోనే ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. వీధి దీపాల వెలుగు అవసరం లేకుండానే రాత్రివేళల్లో పాదచారులు, సైకిళ్లపై వెళ్లేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

వాషింగ్టన్‌: లేజర్‌ సాంకేతిక పరిజ్ఞానం రంగంలో నాసా కొత్త సంచలనం నమోదు చేసింది. ఒక పల్స్‌డ్‌ లేజర్‌పుంజాన్ని ఉపయోగించి చంద్రుడి నుంచి భూమికి 3,84,633 కి.మీ.ల దూరంలో సమాచారాన్ని ప్రసారం చేసింది. సెకనుకు 622 మెగాబిట్ల వేగంతో ఈ సమాచారాన్ని పంపించింది. నాసా ఏర్పాటైనప్పటి నుంచి తన అంతరిక్ష ప్రయోగాల్లో సమాచార వినిమయానికి రేడియో ఫ్రీక్వెన్సీ సాంకేతికతపైనే ఆధారపడుతోంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల నుంచి ఫొటోలు తదితర సమాచారాన్ని భూమ్మీద ఉన్న నాసా కేంద్రాలు స్వీకరించటానికిగానీ.. ఈ కేంద్రాల నుంచి ఉపగ్రహాలకు పంపించే ఆదేశాల విషయంలోగానీ.. రేడియోఫ్రీక్వెన్సీనే ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ సాంకేతికత వినియోగం గరిష్ఠస్థాయికి చేరుకుంది. ఇక దానిని ఎంతమాత్రమూ అభివృద్ధిపరచటం వీలుకాదు. ఈ నేపథ్యంలో.. లేజర్‌ పరిజ్ఞానాన్ని నాసా ముందుకు తీసుకొస్తోంది. ఇటీవల చంద్రుడిపైకి పంపిన ‘లాడీ’ అనే ఉపగ్రహం నుంచి లేజర్‌ పరిజ్ఞానంతో సమాచారాన్ని భూమి మీదికి పంపించటంలో విజయం సాధించింది.

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన నానో టెక్నాలజీ సంస్థ తక్కువ ఖర్చుతో గంట వ్యవధిలోనే ఎయిడ్స్‌ నిర్ధరించే పరికరాన్నీ, యాప్‌ను రూపొందించింది. ఈ సంస్థకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నేతృత్వం వహించడం విశేషం. రక్తం, లాలాజలం లేదా శరీరంలోని ఇతర ద్రవాలను ఒక్క బొట్టు తీసుకుని నానోచిప్‌పై వేసి, ‘జీన్‌-రీడర్‌’గా పిలిచే ఈ పరికరంలో పెడితే సరిపోతుంది. డాక్టర్‌ అనితాగోయెల్‌ ఛైర్మన్‌, సీఈవోగా వ్యవహరిస్తున్న బోస్టన్‌లోని ‘నానోబయోసిమ్‌’ సంస్థ ఈ పరికరాన్ని రూపొందించింది. తమ పరికరం ‘గోల్డ్‌స్టాండర్డ్‌’ పరీక్షను నిర్వహిస్తుందన్నారు. అమెరికాలో ఈ పరీక్షకు కనీసం రెండు వారాలు పట్టడమే కాకుండా, వ్యయం కూడా ఎక్కువే. జీన్‌-రీడర్‌ పరికరంతో చేపట్టే పరీక్ష తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని అనిత చెప్పారు.

వాషింగ్టన్‌: రోజుకి మూడు కప్పుల కాఫీ తాగితే.. కాలేయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 50 శాతానికి పైగా తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అలాగే కాలేయ క్యాన్సర్‌ రకాలలో ఎక్కువగా కనబడే హెపటోసెల్యులార్‌ కార్సినోమా (హెచ్‌సీసీ) ముప్పూ సుమారు 40% మేరకు తగ్గుతున్నట్టు వెల్లడైంది. ప్రపంచంలో అతి ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో కాలేయ క్యాన్సర్‌ ఆరోది. మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది మూడోది. కాఫీ ఆరోగ్యానికి.. ముఖ్యంగా కాలేయానికి మంచిదనే గత అధ్యయనాలను తమ పరిశోధన మరింత బలపరిచిందని అధ్యయన నేత కార్లో లా వెచియా తెలిపారు. కాఫీలో మధుమేహ నివారణకు, కాలేయం గట్టిపడకుండా చేసే గుణాలు ఉన్నాయని.. ఇవే కాలేయ క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికి దోహదం చేస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు.

స్టీఫెన్‌ హాకింగ్‌
వాషింగ్టన్‌: మనిషి మెదడులో నిక్షిప్తమైన మేథస్సును కంప్యూటర్‌లో కాపీ చేయడం సాధ్యమవుతుందని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌(71) అన్నారు. ఆయన జీవితంపై చిత్రీకరించిన డాక్యుమెంటరీ చిత్ర ముందస్తు ప్రదర్శన సందర్భంగా హాకింగ్‌ ‘ది గార్డియన్‌’ పత్రికతో మాట్లాడారు. ”మనిషి అవయవం ఓ కంప్యూటర్‌ ప్రోగ్రాంతో సమానం. మెదడూ అంతే! ప్రోగ్రామ్‌ను కంప్యూటర్‌లో కాపీ చేసి ఎలా ఉపయోగించుకుంటామో.. మానవ మెదడులోని మేథస్సును కూడా కంప్యూటర్‌లోకి కాపీ చేయొచ్చు. సైద్థాంతికంగా ఇది సాధ్యమే! మనిషి శరీరం బయట కూడా మెదడులోని మేథస్సు నిల్వచేయొచ్చు. మరణం తర్వాతా ప్రోగామ్‌ రూపంలో జీవించొచ్చు. ఇది కార్యరూపం దాల్చితే.. ‘చనిపోయాక మనిషి ఆత్మ తిరుగుతుంటుందని భయపడుతుంటారు కదా.. దాని బదులుగా కమ్మటి కథలను విన్నట్లు’గా ఉంటుంది” అని చెప్పారు హాకింగ్‌. 21 ఏళ్ల వయస్సులోనే నాడీ సంబంధ వ్యాధి(మోటార్‌ న్యూరాన్‌)తో స్టీఫెన్‌ తీవ్ర అస్వస్తతకు గురయ్యారు.

వాషింగ్టన్‌: మెదడులోని క్యాన్సర్‌ కణతి వృద్ధిని నిలువరించే, అణచి పెట్టగలిగే కణసంబంధ ‘స్విచ్‌’ను పరిశోధకులు గుర్తించారు. ఇది సర్వసాధారణంగా కనిపించే, వేగంగా పెరిగే క్యాన్సర్‌గా పేర్కొన్నారు. ‘ఆర్‌ఐపీ1’ అనే ప్రొటీన్‌ మెదడు కణతి కణాల మనుగడ విషయంలో కణాల రక్షణకుగానీ, నాశనానికి కీలకంగా పని చేస్తుందని టెక్సాస్‌ సౌత్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయ వైద్యకేంద్రం పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని ఔషధ చికిత్సలు రూపొందించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. గ్లియోబ్లాస్టోమాలో కణ విభజనను, కణాల మరణాన్ని నియంత్రిస్తున్న ఆర్‌ఐపీ1కు సంబంధించిన కొత్త యంత్రాంగాన్ని తమ అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు డాక్టర్‌ అమిన్‌ హబీబ్‌ పేర్కొన్నారు. ఈ పరిశోధనతో ఔషధ చికిత్సకు ఓ లక్ష్యాన్ని గుర్తించినట్లయిందన్నారు. ఈ పరిశోధనలో భారత సంతతి శాస్త్రవేత్తలు డాక్టర్‌ వినేష్‌కుమార్‌, డాక్టర్‌ శర్మిష్ఠ చక్రవర్తి, శాండిలి చౌన్సే, డాక్టర్‌ సందీప్‌బర్మాలతోపాటు డాక్టర్‌ లిలి పాలుపంచుకున్నారు.

వాషింగ్టన్‌: రోబోలపై మానవులు మమకారాన్ని పెంచుకుంటున్నారని, వాటిని పెంపుడు జంతువులు, మిత్రులుగా భావిస్తున్నారని తాజా అధ్యయనంలో గుర్తించారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జూలి కార్పెంటర్‌ బాంబులను నిర్వీర్యం చేసే రోబోలను వినియోగిస్తున్న కొందరు సైనికుల గురించి అధ్యయనం చేసింది. రోబోలతో పనిచేయడం, అవి నాశనమైనపుడు వారి పనితీరుపై ఎటువంటి ప్రభావం ఉంటుందనే దానిపై ఆమె వారిని ప్రశ్నించింది. అయితే రోబోలను వాడటం వల్ల పనితీరు, సామర్థ్యంపై ఎటువంటి ప్రభావం ఉండటం లేదని వారు చెప్పారు. ఎప్పుడైనా రోబోలు ప్రమాదానికి గురైనపుడు కాని, లేదా అవి నిర్వీర్యమైనపుడు బాధపడుతున్నట్లు పరిశీలించారు. అవి మరమ్మతులకు గురైనపుడు వారు తీవ్ర నిరాశకు, ఒత్తిడికి గురవుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. రోబోలు నిర్జీవ వస్తువులైన వాటి మీద మమకారాన్ని పెంచుకుంటున్నట్లు, కొందరు రోబోలకు వారికి నచ్చిన వారి పేర్లను పెట్టి మరి పిలుచుకుంటున్నట్లు అధ్యయనంలో పరిశీలించారు. ఏదైనా పనిలో పాల్గొన్నప్పుడు అవి ధ్వంసమైనప్పుడు కొందరు ఖరీదైన వస్తువును కోల్పోయామని భావిస్తే, కొందరు నిరాశ, ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనంలో కనుగొన్నారు.

వాషింగ్టన్‌: మనిషి, కీటకాల కళ్లలోని దృష్టి లక్షణాలు కలగలిపిన కొత్త తరహా కటకాన్ని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. దృశ్య విస్తృతితో పాటు మనిషి కన్ను మాదిరిగా స్పష్టమైన గోచరతా ఉండడం దీని ప్రత్యేకత. మనిషి కన్ను దృష్టి కేంద్రీకరణ మార్చుకోగలదు కానీ, కీటకాలు కళ్లకు అది సాధ్యం కాదు.. వాటి దృష్టి విస్తృతంగా ఉంటుంది.. ఈ రెండు లక్షణాలు కలిపి ఈ కటకాన్ని తయారుచేస్తున్నట్లు ఓహియో స్టేట్‌ యూనివర్శిటీ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, ఆప్తాల్మాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ‘యి ఝావో’ తెలిపారు. కంటిలో ఉండే ద్రవాలను పోలిన పారదర్శక ద్రవాలను ఉపయోగించి స్పష్టమైన విస్తృత దృష్టి ఉండేలా దీన్ని తయారుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ద్రవపదార్థం ఉపయోగించడం వల్ల కటకం ఆకారం కూడా మార్చుకోవచ్చు. లాప్రోస్కోపీలో ఇప్పుడు ఉపయోగిస్తున్న కెమెరాలకు బదులు ఈ కటకం ఉన్న కెమెరాలు ఉపయోగిస్తే పరిశీలించాల్సిన కణాలు, శస్త్రచికిత్స చేయాల్సిన భాగాలను ఇంకా కచ్చితంగా గుర్తించొచ్చన్నారు.

వాషింగ్టన్‌: మాట్లాడేందుకు పరికరాలను వినియోగించే మూగవారికి మరింత ప్రయోజనకరంగా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు పరిశోధకులు. ప్రస్తుతం మూగవారు వినియోగిస్తున్న పరికరంలో ధ్వనులు యాంత్రికంగా ఉంటున్నాయి. వీటిని సహజంగా మార్చేందుకు భారత సంతతి పరిశోధకుడు రూపల్‌ పటేల్‌ సహా పలువురు కలిసి వోకల్‌ ఐడీ అనే పరికరాన్ని అభివృద్ధి చేశారు. మూగవారు అత్యంత సహజంగా తమ భావాలను వ్యక్తీకరించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని పటేల్‌ తెలిపారు.

వాషింగ్టన్‌: మాట్లాడేందుకు పరికరాలను వినియోగించే మూగవారికి మరింత ప్రయోజనకరంగా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు పరిశోధకులు. ప్రస్తుతం మూగవారు వినియోగిస్తున్న పరికరంలో ధ్వనులు యాంత్రికంగా ఉంటున్నాయి. వీటిని సహజంగా మార్చేందుకు భారత సంతతి పరిశోధకుడు రూపల్‌ పటేల్‌ సహా పలువురు కలిసి వోకల్‌ ఐడీ అనే పరికరాన్ని అభివృద్ధి చేశారు. మూగవారు అత్యంత సహజంగా తమ భావాలను వ్యక్తీకరించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని పటేల్‌ తెలిపారు.

అంగారకుడిపై అధ్యయనం చేస్తున్న నాసా పరిశోధక వాహనం ‘క్యూరియాసిటీ’ తొలిసారిగా అక్కడి నుంచి సూర్యగ్రహణం చిత్రాలను పంపించింది. అంగారకుడి ఉపగ్రహాల్లో ఒకటైన ఫొబోస్‌ సూర్యుడి అభిముఖంగా ప్రదక్షిణం చేస్తున్నప్పుడు..ఏర్పడ్డ గ్రహణాన్ని ‘క్యూరియాసిటీ’ తన ‘మాస్ట్‌-క్యామ్‌’తో పలు చిత్రాలు తీసింది. వాటిలో మూడు చిత్రాలను గత నెల 17న భూమిపైకి డౌన్‌లింక్‌ చేశారు. అంగారకుడిపై నుంచి అతిదగ్గరగా.. అత్యధిక రిసల్యూషన్‌తో తీసిన తొలిచిత్రాలు ఇవేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముందుగా అనుకున్నదానికంటే..

సూర్యుని కేంద్రకం నుంచి ఫొబోస్‌ మూడుకిలోమీటర్ల దగ్గరగానే ఉన్నట్టు ఈ చిత్రాల ద్వారా తెలుస్తోందని అంటున్నారు.
తనకు తానే వెళ్తున్న క్యూరియాసిటీ: ఇంతకాలం నాసా పరిశోధకుల కనుసన్నలలో అడుగులేసిన ‘క్యూరియాసిటీ’ గత నెల 27న తనకు తానే నడిచింది. అటానమస్‌ నావిగేషన్‌(ఆటోనావ్‌) సాఫ్ట్‌వేర్‌ సాయంతో తన చుట్టుపక్కలున్న దృశ్యాలను తానే అంచనావేసి.. ఎవరి మార్గదర్శనం లేకుండా సొంతంగా ముందుకుసాగింది.

భారతీయ శాస్త్రవేత్త అపూర్వ ఆవిష్కరణ
వాషింగ్టన్‌: వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ప‌ని చేస్తున్న భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త రాజారావు ఓ అపూర్వ ప్రయోగం చేశా రు. దూరంగా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మెదడును అనుసంధానించగలిగారు. అలా అనుసంధానించడం ద్వారా ఓ వ్యక్తి అనుకున్న పనిని.. దూరంగా.. మరో ప్రాంతంలో ఉన్న వ్యక్తి.. తన ప్రమేయం లేకుండానే చేస్తాడు! శాస్త్రవేత్తలు ‘మెదడు నుంచి మెదడు’ సంకేతాల చేరవేతను ఎలుకలు, మనుషి-ఎలుక మధ్య మాత్రమే ఇప్పటిదాకా సాధ్యం చేయగలిగారు. ఇద్దరు మనుషుల మధ్య కూడా ఇది సాధ్యమేనని నిరూపించడం రాజారావు బృందం ప్రత్యేకత. ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రఫీ ద్వారా మెదడు సంకేతాలను గ్రహించడం వాటిని ఇంటర్నెట్‌ ‘స్కైప్‌’ ద్వారా మరో మెదడుకు చేర్చి ఈ ప్రయోగం చేశారు. అయితే ఈ అనుసంధానంతో మరో వ్యక్తిలో కేవలం చిన్నచిన్న కదలికలు మాత్రమే తెప్పించగలం గానీ.. ఎదుటివారి ఆలోచనలని మార్చలేమని అంటున్నారు రాజారావు.

వాషింగ్టన్‌: వ్యాయామం కారణంగా కండరాలు నొప్పి పెడుతున్నాయా? అయితే పుచ్చకాయ రసం తాగమంటున్నారు పరిశోధకులు! కఠిన వ్యాయామం తర్వాత కండరాల్లో కలిగే బాధ నుంచి… పుచ్చకాయల్లో ఉండే అమైనో ఆమ్లం ‘ఎల్‌-సిట్రలిన్‌’ ఉపశమనం కలిగిస్తుందట.

వాటిలో యాంటీ-ఆక్సిడెంట్‌ గుణాలు, కండరాల పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయట. క్రీడాకారులు మరింతగా ప్రతిభ చూపేందుకు పుచ్చకాయ రసం దోహదపడుతుందని గతంలోనూ ఓ అధ్యయనం వెల్లడించినట్లు అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ (ఎసీఎస్‌) పరిశోధకులు చెప్పారు.

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని మెడిసిటీ ఆస్పత్రిలో.. మోకాళ్ల నొప్పులకు మూల కణాలతో చేసే అత్యాధునిక శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చింది. కార్టిలేజ్‌ (మృదులాస్థి) దెబ్బతినటం వల్ల లేదా అరిగిపోవటం వల్ల మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి.. వారి నుంచి సేకరించిన మూలకణాలతోనే ఈ చికిత్స జరుపుతామని వైద్యులు తెలిపారు. ఎముకల వైద్యశాస్త్రంలో ఇది సరికొత్త సంచలనమని మెడిసిటీ సీఈఓ కె.కృష్ణయ్య ఆగ‌స్టు 28న‌ విలేకర్లతో చెప్పారు. శరీరంలోని మూలకణాలను సేకరించి, శుద్ధి చేసి, దెబ్బతిన్న కార్టిలేజ్‌ దగ్గర కీ హోల్‌ సర్జరీ తరహాలో ఏర్పాటు చేస్తామన్నారు. శస్త్రచికిత్స జరిగిన అనంతరం ఆస్పత్రినుంచి అదేరోజు వెళ్లిపోవచ్చునని తెలిపారు. దాదాపుగా నలభై రోజుల్లో రోగి సాధారణ స్థితికి చేరుకుంటారని చెప్పారు. ఈ చికిత్సకు సుమారు రూ.45 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు.

శిశువులకు తల్లిపాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి పిల్లలకు అవసరమైన పోషణ అందించటతో పాటు రోగనిరోధకశక్తిని పెంచి రకరకాల జబ్బుల బారినపడకుండానూ కాపాడతాయి. తల్లిపాలు చేసే మేలు గురించి ఇప్పుడు మరో కొత్త సంగతి బయటపడింది. ఇవి తల్లి నుంచి పిల్లలకు మంచి బ్యాక్టీరియానూ చేరవేస్తున్నట్టు వెల్లడైంది. తల్లిపాలలోని బ్యాక్టీరియా రకాలు..

తల్లీ శిశువుల మలంలోని బ్యాక్టీరియా రకాలు ఒకేరకంగా ఉంటున్నట్టు స్విట్జర్లాండ్‌ పరిశోధకులు గుర్తించారు. శిశువుల పేగుల్లో కీలకమైన పోషకాల సమతుల్యతకు ఈ బ్యాక్టీరియా దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. పేగుల్లో తలెత్తే సమస్యలను నివారించటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని అనుకుంటున్నారు. ”తల్లి పేగుల్లోని బ్యాక్టీరియా తల్లిపాల నుంచి శిశువులకు చేరుకుంటున్నట్టు బయటపడటం చాలా ఆసక్తిని రేకెత్తించింది” అని జ్యూరిచ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫుడ్‌, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌కు చెందిన క్రిస్టోఫ్‌ లాక్రాయిక్స్‌ అంటున్నారు. శిశువుల పేగుల ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ బాగుండటానికి తల్లి, పిల్లల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా చాలా కీలకమని చెబుతున్నారు. అయితే ఈ బ్యాక్టీరియా పేగుల్లోంచి తల్లి పాలలోకి ఎలా చేరుతోందనేది మాత్రం బయటపడలేదు.

పరమాణుసంఖ్య 115
లండన్‌: కొత్త మూలకాన్ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. 115 పరమాణుసంఖ్యతో.. త్వరలో ఈ మూలకం ఆవర్తన పట్టికలో (పీరియాడిక్‌ టేబుల్‌) చేరనుంది. జర్మనీలోని జీఎస్‌ఐ పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం జరిపిన ప్రయోగాల్లో.. కొత్త మూలకం ఉనికి ధ్రువపడింది. ఇది అతిభార మూలకాల కోవకు చెందుతుందని, దీనికి ఇంకా పేరు పెట్టలేదని తెలిపారు.

మెల్‌బోర్న్‌: రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కణాల్లో హార్మోన్‌ చర్యపై ప్రభావం చూపే ఒక జన్యువుకు పురుష వంధ్యత్వంలోనూ పాత్ర ఉన్నట్లు తేలింది. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. వీరు ఎస్‌ఎల్‌ఐఆర్‌పీ అనే జన్యువుపై దృష్టిసారించారు. ఈ జన్యువు లేని ఎలుకలకు మిగతావాటితో పోలిస్తే మూడో వంతు మేర తక్కువ సంతానం ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత మానవుల్లో ఈ జన్యుప్రభావంపై కూడా పరిశోధన జరిపారు. ఎస్‌ఎల్‌ఐఆర్‌పీ పరిమాణం తక్కువగా ఉంటే వంధ్యత్వం తలెత్తుతున్నట్లు ఇందులో తేలింది. ఎస్‌ఎల్‌ఐఆర్‌పీ జన్యువు స్థాయి తక్కువగా ఉన్నట్లు తేలితే.. ఆ జంట సహజసిద్ధ గర్భధారణ అంశాన్ని పక్కనపెట్టేసి నేరుగా ఐవీఎఫ్‌ విధానం ద్వారా సంతానాన్ని పొందడంపై దృష్టిసారించవచ్చని మరో శాస్త్రవేత్త పీటర్‌ లీడ్‌మన్‌ వివరించారు.

ముంబయి: దంతాల నుంచి సేకరించిన మూలకణాలతో పలురకాల వ్యాధులను నయం చేయవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా.. కణజాల, అవయవ సంబంధిత రుగ్మతలైన మధుమేహం, కీళ్లనొప్పులకు వీటితో చికిత్సను అందించవచ్చని తెలిపారు. ముంబయిలోని స్టిమేడ్‌ ప్రైవేట్‌ డెంటల్‌ స్టెమ్‌సెల్స్‌ బ్యాంక్‌కు చెందిన ఈ నిపుణులు.. మూడేళ్లుగా దంత మూలకణాలను సేకరించి భద్రపరుస్తున్నారు. వాటిని మైనస్‌ 150 డిగ్రీల వద్ద క్రయోజెనిక్‌ ట్యాంకుల్లో భద్రపరుస్తామని తెలిపారు. వ్యాధుల చికిత్సకు అవసరమైనప్పుడు.. ఆయావ్యక్తులు తమ దంతమూలకణాలను తిరిగి తీసుకొని వ్యాధుల నుంచి విముక్తి పొందుతున్నారని పేర్కొన్నారు.

వాషింగ్టన్‌: మధుమేహుల కోసం శాస్త్రవేత్తలు ‘తెలివైన స్పాంజి’ పద్ధతిని రూపొందించారు. ఇది రక్తంలోని గ్లూకోజు స్థాయులను బట్టి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. పీతలు, చిన్నరొయ్యల పెంకులో ఉండే చిటోసాన్‌ అనే పదార్థం నుంచి దీనిని తయారుచేశారు. ఇందులో చిన్నచిన్న రంధ్రాలతో కూడిన పాలిమర్‌తో చేసిన అతిసూక్ష్మ గొట్టాలుంటాయి. వీటిల్లో గ్లూకోజు ఆక్సిడేజ్‌ లేదా రసాయనిక చర్యను వేగవంతం చేసే ఎంజైమ్‌లను కూరుస్తారు. అలాగే స్పాంజిలో ఇన్సులిన్‌ను కూడా జొప్పిస్తారు. రక్తంలో గ్లూకోజు మోతాదు పెరిగినపుడు స్పాంజి ఉబ్బి ఇన్సులిన్‌ రక్తంలోకి విడుదల అవుతుంది. గ్లూకోజు మోతాదులు తగ్గిన తర్వాత స్పాంజి తిరిగి చిన్నగా అయ్యి, ఇన్సులిన్‌ విడుదల ఆగిపోతుంది. ”చిటోసాన్‌ శరీరంలో కలిసిపోతుంది కాబట్టి దీంతో దీర్ఘకాల దుష్ప్రభావాలు ఉండవు” అని అధ్యయన నేత, నార్త్‌ కరోలీనా స్టేట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ ఝెన్‌ గు తెలిపారు.

బీజింగ్‌: డెంగీ జ్వరానికి కారణమవుతున్న వైరస్‌ను దీటుగా ఎదుర్కోవటానికి అవసరమైన చికిత్సను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. కృత్రిమ మైక్రో ఆర్‌ఎన్‌ఏలను ఉపయోగించి.. మనుష్యుల్లో డెంగీ వైరస్‌ పునరుత్పత్తిని నిలిపివేయటంలో వీరు విజయం సాధించారు. దీనికోసం తొలుత డెంగీ వైరస్‌ జన్యుక్రమాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. డెంగీ జన్యుక్రమంలో కొన్ని ప్రాంతాలు.. సుదీర్ఘకాలంగా ఎటువంటి మార్పులు లేకుండా, ఉత్పరివర్తనాలకు గురికాకుండా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలే లక్ష్యంగా కృత్రిమ ఆర్‌ఎన్‌ఏలను ప్రయోగించి చూసినప్పుడు.. డెంగీ వైరస్‌ పునరుత్పత్తిని అడ్డుకోవటం సాధ్యమవుతుందని తేలింది. దోమల ద్వారా వ్యాపించే డెంగీ వైరస్‌ వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్లమంది జ్వరం బారిన పడుతున్నారు. ప్రస్తుత చికిత్స డెంగీని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కోల్‌కతా: వేపలోని ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. ఇది క్రిమి, కీటక సంహారిణిగానే కాదు.. క్యాన్సర్‌తోనూ పోరాడగలదని తేలింది. వేప ఆకుల నుంచి తీసిన ‘నీమ్‌ లీఫ్‌ గ్త్లెకోప్రోటీన్‌- ఎన్‌ఎల్‌జీపీ’ అనే ప్రోటీన్‌.. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తాజాగా బయటపడింది. చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎన్‌సీఐ)కు చెందిన పరిశోధకుల బృందం ఈ విషయాన్ని గుర్తించింది.

లండన్‌: కృత్రిమ మానవ క్రోమోజోమ్‌లతో జన్యుపరంగా తీర్చిదిద్దిన ఎలుకను రూపొందించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎలుకల శరీరంలోని ప్రతి కణంలోనూ ఈ క్రోమోజోమ్‌లు ఉండేలా రూపొందించినట్లు చెప్పారు. ఈ పరిశోధనతో మనుషుల్లో జన్యుపరమైన లోపాలను సరిదిద్దే దిశగా మార్గం పడుతుందని భావిస్తున్నారు. పరిశోధకులు ప్రయోగశాలలో కృత్రిమ మానవ క్రోమోజోమ్‌లను తయారు చేసేందుకు రసాయన నిర్మాణ బ్లాకులను ఉపయోగించారు. జన్యు థెరపీలో ఇది శక్తిమంతమైన పరిజ్ఞానమని చెబుతున్నారు. కొన్ని రకాల జన్యు ఉత్పరివర్తనాల వల్ల పలు వంశపారంపర్య వ్యాధులు తలెత్తుతున్నాయనీ, మానవుల్లో జన్యు లోపాలను సరిదిద్దేందుకు ఈ జన్యు థెరపీ తోడ్పడుతుందని అమెరికా జాతీయ క్యాన్సర్‌ కేంద్రం పరిశోధకులు నటాలే కౌప్రినా పేర్కొన్నారు.

టోక్యో: ప్రపంచంలోనే తొలిసారిగా మూలకణాలతో మానవ కాలేయ కణజాలాన్ని సృష్టించటంలో జపాన్‌ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. కాలేయ దాతల కొరతను అధిగమించటానికి ఇది దారితీయగలదని భావిస్తున్నారు. హ్యూమన్‌ ఇండ్యూస్‌డ్‌ ప్లూరీపోటెంట్‌ స్టెమ్‌సెల్స్‌ (హైపీఎస్‌సీ) నుంచి రక్తనాళాలతో కూడిన, పూర్తిస్థాయిలో పనిచేసే మానవ కాలేయాన్ని సృష్టించొచ్చని యోకోహామా సిటీ విశ్వవిద్యాలయానికి చెందిన టకనోరీ టకేబే, హిడేకి టనిగుచి నిరూపించారు

లండన్‌: పిల్లులను పెంచుకునే వాళ్లు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లుల ద్వారా మనుష్యులకు క్షయవ్యాధి (టీబీ) సోకే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. క్షయవ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని పిల్లులు మనుష్యులకు సంక్రమింపజేస్తున్నాయని వీరి అధ్యయనంలో తేలింది. ఎలుకలు, పశువులు, కుక్కల నుంచి మైకోబ్యాక్టీరియం బోవిస్‌ అనే బ్యాక్టీరియా పిల్లులను చేరుతోందని.. కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియా సోకిన పాలను తాగటంవల్ల కూడా పిల్లులకు క్షయవ్యాధి సంక్రమిస్తుందని వెల్లడైంది. వీటి నుంచి వాటి యజమానులకు బ్యాక్టీరియా వ్యాపించి క్షయకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ విధంగా పిల్లుల నుంచి మనుష్యులకు క్షయవ్యాధి సోకటం అరుదే అయినప్పటికీ ఆ ప్రమాదానికి అవకాశం ఉందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచం మొత్తం ఇప్పుడు మెక్సికోను వింతగా చూస్తోంది. కారణం అక్కడ సీర్రా మడ్రే ఆక్సిడెంటల్‌ పర్వత కొండలను కలుపుతూ నిర్మించిన బెలార్ట్‌ వంతెనే. ప్రపంచంలోనే ఇది అత్యంత ఎత్త్తెనది. ఈఫిల్‌ టవర్‌ కంటే ఇంకా ఎక్కువ ఎత్తులో ఈ వంతెన నిర్మించి తమ ఇంజినీరింగు నైపుణ్యంతో అబ్బురపరిచింది.

ఇది గిన్నెస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. పర్వతాల లోయ మట్టం నుంచి 1280 అడుగుల ఎత్తులో 3,688 అడుగుల పొడవున ఈ తీగ వంతెన నిర్మించి దానిపై నాలుగు వరసల జాతీయ రహదారిని నిర్మించారు. కన్‌కార్డియా, ప్యూబ్లో న్యూవో పట్టణాల మధ్య ఉన్న డురాంగో-మజట్లాన్‌ రహదారిని ఈ వంతెన కలుపుతుంది. గతంలో ఈ పట్టణాల మధ్య దూరం 8.30 గంటలపైన ఉంటే ఇప్పుడు ఈ వంతెన త‌ర్వాత‌ కేవలం రెండున్నర గంటలు మాత్రమే పడుతోంది. 2008లో మెక్సికో ఈ ప్రాజెక్టును ఒక సవాల్‌గా తీసుకుని ప్రారంభించి పూర్తి చేసింది. 2012 జనవరిలో దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఏడాదికిపైగా దాన్ని మన్నిక, పనితీరును పరిశీలించాక జూన్‌ 27 నుంచి వంతెనపై సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించారు. దీన్ని నిర్మించడానికి మరో కారణం ఈ ప్రాంతాలు వెనుకబడి, మత్తు మాఫియా చేతుల్లోకి వెళ్లడమే. దీనివల్ల ఈ ప్రాంతాలు పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతాయని విశ్వసిస్తోంది. ఈ వంతెన నిర్మాణానికి రూ.702.37 కోట్లు ఖర్చు చేశారు. 1500 మంది రేయింబవళ్లు శ్రమించారు. 12 వేల టన్నుల ఉక్కు, 90 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటును ఉపయోగించారు.
వీరిని చూ’చైనా’!
మెక్సికో కంటే ముందే ప్రపంచాన్ని అబ్బుర పరిచింది చైనా. అక్కడ పర్వత శ్రేణుల్లో దూరాలను చెరిపేస్తూ చైనా ప్రభుత్వం తీగవంతెన మార్గాలకు అమిత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రపంచంలోని ఈ తరహా వంతెనల్లోసగానికి పైగా చైనాలోనే ఉన్నాయి. అక్కడ సముద్రంపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన తీగ వంతెన మార్గంతోపాటు పర్వత ప్రాంతాల్లో దూరాలను చెరిపేస్తూ ఎన్నో తీగవంతెనల మార్గాలను నిర్మించింది. ఇలా దాదాపు 57 ప్రాంతాల్లో 75 వంతెనలున్నాయి. చైనాలో ఇప్పుడీ తీగ వంతెన మార్గాలు ఓ పెద్ద పర్యాటక క్షేత్రాలుగా మారాయి. వీటిని తిలకించడానికి పర్యాటక ప్యాకేజీలు కూడా అందిస్తూ కాసుల పంట కురిపించుకుంటోంది. 2009లో చాన్‌గ్వింగ్‌-హునాన్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో వుజియాంగ్‌ నదిపై అత్యంత ఎత్తులో నిర్మించిన వూలింగ్‌షన్‌ తీగ వంతెన మార్గం అందాలైతే అద్భుతం. నాలుగులేన్ల ఈ మార్గం అందం సూర్యోదయం, సూర్యాస్తమయం, రాత్రిపూట లైట్లు వేసినప్పుడు చూడాల్సిందే. రవాణాకు దుర్భేద్యంగా ఉన్న పర్వత ప్రాంతాల్లో ప్రపంచ దేశాలు తీగవంతెన మార్గాల నిర్మాణమే చక్కటి ‘మార్గ’దర్శనంగా ముందుకెళుతున్నాయి. కేదార్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన క్లిష్టమైన మార్గాల్లో ఇలాంటి తీగవంతెనలు ఉంటే యాత్రికులకు తిప్పలు ఉండేవి కావేమో. చార్‌ధామ్‌ హిమాలయ పర్వత శ్రేణుల్లో కురిసిన కుండపోత, ముంచెత్తిన వరదల ఫ‌లితంగా జ‌రిగిన ప్రాణ‌న‌ష్టాన్ని భారీగా త‌గ్గించి ఉండేవాళ్లం. ఎన్నో ఏళ్లుగా కేదార్‌నాథ్‌కు కాలినడకే తప్ప మరోమార్గమే లేదంటూ కళ్లు మూసేసుకున్న యంత్రాంగం ఓ సారి పొరుగు దేశాల తెగువ, చొరవ చూసైన నేర్చుకోవాలి.

లండన్‌: ఆ పిల్లాడిని చూస్తే ఎవరైనా ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనకుండా ఉండలేరు. ఎందుకంటే రెండేళ్ల వయసులోనే గడగడా పుస్తకాలు చదివేయటమే కాదు.. మేధో సామర్థ్యంలోనూ(ఐక్యూ) ‘ఔరా’ అనిపించాడు. ఐక్యూ పరీక్షలో 141 పాయింట్లు సాధించి, అత్యంత మేధో సంపన్నుల సంఘమైన ‘మెన్సా క్లబ్‌’ నుంచి ఆహ్వానం అందుకున్నాడు. ఆ సంఘంలో చేరిన అతిచిన్న పిల్లాడిగానూ రికార్డు సృష్టించాడు.

గర్భిణిగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటే, ఎన్ని మంచి విషయాలు ఆలోచిస్తే పుట్టబోయే పిల్లలకు అంత మంచిది. ఎందుకంటే గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ప్రతి కదలికా గర్భస్థ శిశువు మీద ప్రభావం చూపుతుంది. తల్లి బిగ్గరగా మాట్లాడే ప్రతి మాటనూ శిశువు ఆలకిస్తుందని అమెరికాకు చెందిన జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ నిపుణులు అధ్యయనపూర్వకంగా రుజువు చేశారు. అందుకోసం కొంతమంది గర్భిణుల జీవన శైలినీ పరిశీలించారు. కొన్ని పరీక్షల సాయంతో అధ్యయనం నిర్వహించారు..

తల్లి ఏదయినా చదివినప్పుడూ, మాట్లాడినప్పుడూ లోపలున్న శిశువు కదలికలు తగ్గాయి. మాట్లాడటం ఆపేయగానే యథాస్థితికి వచ్చాయి. తల్లి మాటల్ని వింటున్న సమయంలో గుండె నెమ్మదిగా కొట్టుకోవడం నిపుణులు గమనించారు. ‘ఐదో నెల నుంచే గర్భంలోని బిడ్డ అమ్మ మాటలు వినడం మొదలు పడుతుంది. అందుకే గర్భిణిగా ఉన్నప్పుడు చక్కటి పుస్తకాలు చదివితే, నవ్వుతూ ఉంటే… అవి బిడ్డ మీద సానుకూల ప్రభావం చూపిస్తాయి’ అని వారు తెలిపారు.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: