RSS

Daily Archives: November 4, 2013

G.O’S regarding Health Cards


GO.174 Employee Health Scheme-Cashless Medical Treatment

GO.175 Operational Guidelines for Employee Health Scheme Employee Health Cards

GO.176 List of Therapies and Package Rates for Employee Health Scheme

 
Comments Off on G.O’S regarding Health Cards

Posted by on November 4, 2013 in Uncategorized

 

* టీజీటీ నియామకాలపై సానుకూలత…!


మరోవైపు… ఆదర్శ పాఠశాల్లో పీజీటీ నియామకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి తీసుకోవాల్సిన ఉమ్మడి జాబితా రూపకల్పన వంటి తదుపరి చర్యలపై విద్యా శాఖ దృష్టిపెట్టింది. సచివాలయ స్థాయిలో వీటిపై నిర్ణయం జరిగిన అనంతరం తదుపరి చర్యలు మొదలవుతాయి. మరోవైపు.. టీజీటీ నియామకాలను చేపట్టేందుకు విద్యాశాఖకు ఎటువంటి అవరోధాలు లేవు. ఈ నియామక పత్రాల కోసం అర్హులైన వారు గత 5 నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ నియామకాలపై త్వరలోనే సానుకూల ఉత్తర్వులు వెలువడతాయని ఆశిస్తున్నారు.

 
1 Comment

Posted by on November 4, 2013 in Uncategorized

 

మధ్యాహ్న భోజన పథకంపై యూనిసెఫ్ శిక్షణ


ఈనాడు-హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకం అమల్లో భాగంగా పరిసరాల శుభ్రత, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై యూనిసెఫ్ సాయంతో విద్యాశాఖ జిల్లా కేంద్రాల నుంచి పాఠశాలల స్థాయి వరకు ప్రత్యేక చర్యలను తీసుకోబోతుంది. తొలుత జిల్లా విద్యా శాఖ అధికారులు, డిప్యూటీ విద్యా శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి, యూనిసెఫ్ ద్వారా విద్యా శాఖ శిక్షణ ఇప్పించబోతుంది. క్రమేణ ఈ శిక్షణ కార్యక్రమాలు పాఠశాలల్లో పనిచేసే వంట వారికీ అందుబాటులో ఉండేలా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలును మరింత పటిష్ఠంగా అమలుచేయడమే ఈ శిక్షణ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని విద్యా శాఖ సంచాలకులు జి.వాణీమోహన్ నవంబరు 4న తెలిపారు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో ఒక్కొక్కరు నెలకోసారి పథకం అమలును స్వయంగా పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

 
Comments Off on మధ్యాహ్న భోజన పథకంపై యూనిసెఫ్ శిక్షణ

Posted by on November 4, 2013 in Uncategorized

 

పరిచయాలే హద్దు…


* ర్యాగింగ్‌ సంస్కృతి విడనాడాలి
అనంత‌పురం (జేఎన్‌టీయూ), న్యూస్‌టుడే: పరిచయం స్నేహమనే సౌధానికి పునాది.. ఆ మైత్రి పునాదుల మీదే ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు భావి భవితకు బాటలు వేసుకోవాలి.. లక్ష్యాలు చేరుకోవాలి..ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. కాని ఈ పరిచయం శ్రుతిమించి విద్యార్థులను వేదనకు గురి చేస్తోంది.. వ్యథ మిగులుస్తోంది..దేవాలయం లాంటి ఉన్నత విద్యాలయంలో అడుగుపెట్టే విద్యార్థికి భయం పొగోట్టి వెన్నుతట్టి ప్రోత్సహించి మార్గదర్శకంగా నిలవాల్సిన వారు లేనిపోని అహంభావాలకు పోయి ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్నారు..ప్రభుత్వం..అధికార యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..కఠిన శిక్షలు అమలు చేస్తున్నా పరిచయాల హద్దు దాటి ర్యాగింగ్‌గా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది..
ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పీజీతో పాటు వివిధ వృత్తి విద్య కళాశాలల్లో తొలిసారి అడుగు పెట్టిన విద్యార్థులకు ‘ర్యాగింగ్‌’ భయం వెంటాడుతోంది. దీన్ని క్రీడగా కొందరు భావించి ఆనందం అనిపించినా.. ఇంకొందరు భయంతో వణికిపోతున్నారు. ఈ పరిచయాలు హద్దు దాటితే అందరికీ ప్రమాదం. ఏదైనా ఘటన జరగకముందే అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
వేధిస్తే అరదండాలే..
* ర్యాగింగ్‌ అంతమొందించటానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థుల పట్ల సీనియర్లు అమానుషంగా ప్రవర్తించటాన్ని అరికట్టాలని, ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
* ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన వారికి ఐదు రకాల శిక్షలను అమలు చేయాలని చట్టం చెబుతోంది.
* ర్యాగింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే ఆ నేరాన్ని బట్టి సదరు విద్యార్థిని కళాశాల నుంచి సస్పెండ్‌ చేయవచ్చు. టీసీలో ర్యాగింగ్‌కు పాల్పడినట్లు పెద్దగా రాసి ఇస్తారు.
* తోటి విద్యార్థులను ఏడిపించినా, అవమానించినా, దూషించినా ఆరునెలల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.
* దౌర్జన్యం, దాడి, బలవంతం చేయడం, హెచ్చరించడం వంటి చర్యలకు ఏడాది జైలు, రూ.2 వేలు శిక్ష.
* అక్రమ నిర్బంధం, అడ్డుకోవడానికి యత్నించడం వంటి ఘటనలకు రెండేళ్లు కారాగారం, రూ.5 వేలు జరిమానా విధిస్తారు.
* తీవ్రంగా గాయపరచడం, అపహరించడం, బలాత్కరించడం తదితరాలకు పాల్పడితే ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా.
* ఆత్మహత్యకు ప్రేరేపిస్తే, హత్య చేస్తే పదేళ్లకు పైగా జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా.
అధికారులు, కళాశాల యాజమాన్యాల పాత్ర కీలకం
* ర్యాగింగ్‌ నిరోధానికి అధికారులతో పాటు కళాశాలల యాజమాన్యాలు చొరవ చూపాలి. ర్యాగింగ్‌ నిరోధానికి కలెక్టరు అధ్యక్షతన కమిటీని నియమించాలి. ఈ కమిటీకి జిల్లా పోలీసు అధికారి ఉపాధ్యక్షులుగా ఉంటారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, కళాశాల ప్రిన్సిపాళ్లు సభ్యులు. ఏడాదిలో నాలుగుసార్లు సమావేశం కావాలి.
* ర్యాగింగ్‌ను అరికట్టడంలో విద్యా సంస్థలు వైఫల్యం చెందితే… శిక్ష యాజమాన్యానికి ఉంటుంది.
* కళాశాలలకు నిధులు, ప్రోత్సాహకాలు నిలిపివేయడంతో పాటు గుర్తింపు రద్దు చేయవచ్చు.
* ర్యాగింగ్‌కు పాల్పడితే గల శిక్షలను వివరిస్తూ పోస్టర్లను కళాశాలల్లో, వసతి గృహాల్లో ఏర్పాటు చేయాలి.
* కళాశాలల్లో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయాలి.
* కళాశాల బస్సుల్లో సీనియర్‌ అధ్యాపకులు ప్రయాణించడంతో పాటు అధ్యాపకుల ఫోన్‌ నంబర్లు విద్యార్థులకు తెలిసే విధంగా చేయాలి.
* ర్యాగింగ్‌ నిరోధానికి ప్రిన్సిపల్‌తో పాటు సంబంధిత విభాగపు అధిపతులు, హాస్టల్‌ వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లతో కూడిన కమిటీ నిత్యం ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండాలి.
ప్రతి క్షణం అప్రమత్తం : ఆచార్య ఆంజనేయులు, జేఎన్‌టీయూ ప్రిన్సిపల్‌
   
స్వాగత దినోత్సవం (ఫ్రెషర్స్‌డే) నిర్వహించే వరకు ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడతాం. ప్రతి 15మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు పర్యవేక్షిస్తాడు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహం. బాలికలు జూనియర్‌, సీనియర్లకు ఒకే వసతి గృహం ఉన్నా వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి ఇద్దరు ఫ్యాకల్టీ నిత్యం వసతి గృహంలోనే ఉంటారు. నెలరోజుల పాటు హాస్టల్‌ నుంచి తరగతి గదికి మాత్రమే తీసుకొస్తాం.
పట్టించుకోకున్నా బాధ్యులే : మహబూబ్‌బాషా, సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌
     
ర్యాగింగ్‌ జరిగినట్లు విద్యార్థి ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉంది. 2009లో విద్యార్థి ఫిర్యాదు చేసినా ఇంటెల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పట్టించుకోక పోవడంతో ర్యాగింగ్‌ చేసిన విద్యార్థితో పాటు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశాం. ర్యాగింగ్‌ వంటి దుశ్చర్యలకు పాల్పడి విద్యార్థులు విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ర్యాగింగ్‌ చట్టం చాలా కఠినంగా ఉంది.
వసతి గృహంలో ఇంట్లో ఉన్నట్లే : హరిత, రమ్య, ద్వితీయ సంవత్సరం
      
సీనియర్లు జూనియర్లను కేవలం వారి పేరు వూరు అధ్యాపకుల సమక్షంలో పరిచయం చేసుకోవాలి. భయం భయంగా కళాశాలలో చేరిన జూనియర్లలో ఆ ఆలోచన నుంచి బయట పడాలంటే సీనియర్లు కచ్చితంగా సహకరించాలి. వసతి గృహంలో ఉన్నా ఇంట్లో ఉన్న భావన జూనియర్లకు కల్పించాలి. సీనియర్‌, జూనియర్‌ అన్న భావనే ఉండకూడదు.
ఇంతవరకు బయటకు వెళ్లలేదు : వెంకటసాయి శమీంద్ర, మహేష్‌, ప్రథమ సంవత్సరం
ఇంకా భయంగా ఉంది. ఇంతవరకు బయటకు వెళ్లలేదు. ఏదైనా అవసరం వస్తే అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో వెళుతున్నాం. వసతి గృహం నుంచి తరగతి వరకు రక్షణతో వచ్చి వదులుతున్నారు. ఇంట్లో కంటే ఇక్కడే బాగా చూస్తున్నారు. తెలియని అంశాలు సీనియర్ల నుంచి నేర్చుకుంటాం. సీనియర్లే మార్గదర్శకులు.
 అన్ని కళాశాలల్లో చైతన్యం : ఆచార్య శంకర్‌, జేఎన్‌టీయూ విద్యాప్రణాళిక సంచాలకులు
     
జేఎన్‌టీయూ పరిధిలోని అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏ విధమైన ర్యాగింగ్‌ ఉండకూడదని సూచించాం. చైతన్య సదస్సులు ఏర్పాటు చేయాలి. ప్రతి కళాశాలలో ఐదుకంటే ఎక్కువ కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశాం. ర్యాగింగ్‌ జరిగితే ఏర్పడే పరిణామాలుపై www.apsche.org లో యాంటీ ర్యాగింగ్‌కు సంబంధించిన వీడియోలు చూపించాలని కోరాం. సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లు రాత్రి వేళల్లో ఏసమయంలో అయినా ఉన్నఫళంగా తనిఖీలు నిర్వహించాలి.

 
Comments Off on పరిచయాలే హద్దు…

Posted by on November 4, 2013 in Uncategorized

 

నలభై ద్వారాలకు ఒకటే తాళం!


* యువత ముంగిట ఎన్నో ఉద్యోగాలు
కృష్ణా జిల్లా (కానూరు), న్యూస్‌టుడే : జిల్లావ్యాప్తంగా బీటెక్‌, డిగ్రీ, పీజీ, ఇంటర్‌, పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థులు రకరకాల పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నారు. అందులో అత్యధికులు బ్యాంకు ఉద్యోగాలవైపే ఆసక్తి చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు, బ్యాంకింగ్‌ ఉద్యోగాలకు సుమారు 50 వేల మంది విద్యార్థులు సాధన చేస్తున్నారు. అందులో 35 వేల మందికి పైగా విద్యార్థులు బ్యాంకింగ్‌లోని వివిధ హోదాల పరీక్షలకు సిద్ధమవుతుంటే మిగిలిన 15 వేల మంది ఆర్టీసీ, రైల్వే, గ్రూపు 2, గ్రూపు-3, గ్రూపు-4, ఇలా వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్నారు. గత మూడు నాలుగేళ్లుగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు కూడా ఈ పోటీపరీక్షలకు ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలవైపు దృష్టి సారిస్తున్నారు.
ఇన్ని పోటీ పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధం కావాల్సిన పరిస్థితి. అయితే చాలా అంశాలు అన్ని పరీక్షలకు ఉమ్మడిగా ఉంటాయని, ఒకటి రెండు సబ్జెక్టులు మినహా అన్నిటికీ కలిపి సాధన చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు పరీక్షలకు సాధన చేస్తే మిగిలిన ప్రభుత్వ పరీక్షలకు కూడా సన్నద్ధమైనట్లేనన్నది వారి మాట. ఇలా ఒకే రకమైన శిక్షణకు సొంత సాధన జోడించి సుమారు 40కి పైగా ఇతర పోటీ పరీక్షలు కూడా రాయవచ్చు. అవేంటో తెలుసుకుందామా!
* ఏయే పరీక్షలకు వెసులుబాటు?
బ్యాంకింగ్‌ పరీక్షలో న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, ఆంగ్లం, జనరల్‌ ఎవేర్‌నెస్‌ సబ్జెక్టులు ఉంటాయి. వీటితో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానంపై కూడా పరీక్ష ఉంటుంది. వీటిలో కంప్యూటర్‌ పరీక్ష మినహా మిగిలిన నాలుగూ సాధన చేస్తే 40కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలు రాయవచ్చు. ప్రస్తుతం ఏ ఉద్యోగానికి పరీక్ష నిర్వహించాలన్నా ఆ నాలుగే ప్రధానపాత్ర వహిస్తున్నాయి.
* ఏయే ఉద్యోగాలకు…
     
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, జనరల్‌ ఇన్స్యూరెన్సు, ఎఫ్‌సీఐ, రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా, తపాలాశాఖ, యూసీ-ఎఎఓలు, యూసీ-ఏడీఓలు, ఏపీఎస్‌ ఆర్టీసీ (సూపర్‌వైజర్లు), ప్రసారభారతి (ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ అధికారి), అగ్రికల్చర్‌ ఇన్య్సూరెన్సు అధికారి, ఆర్‌ఆర్‌బీ (కమర్షియల్‌, ట్రాఫిక్‌, గూడ్సు గార్డు, అసిస్టెంటు స్టేషన్‌ మాస్టర్‌), వైజాగ్‌ స్టీల్‌, సెయిల్‌, ఓఎన్‌జీసీలో మేనేజ్‌మెంటు ట్రైయినీ, ఇంటెలిజెన్సుబ్యూరోలో అసిస్టెంటు ఆధికారి, యూజీసీ క్లర్కు, సెబి అధికారులు….
* రీజనింగ్‌పై పట్టు సాధించాలంటే…..
    
రీజనింగ్‌లో మంచిమార్కులు తెచ్చుకోవాలంటే సంఖ్యలు, అక్షరాలు, పదాలపై సాధన చేయాలి. వర్గాలు, వర్గమూలాలు, ఘనములు తదితర అంశాలను సాధన చేయాలి. రీజనింగ్‌లో ప్రశ్నలు కాన్సెప్టు, జనరల్‌టాపిక్‌, కామన్‌సెన్సు మీద ఆధారపడి ఉంటాయి. అందుకోసం దిశలు, రక్తసంబంధాలు, సీటింగ్‌ అరేంజ్‌మెంటు, టైమింగ్‌ అండ్‌ నెంబర్‌ ర్యాంకింగ్‌, అక్షరాలు, క్లాసిఫికేషన్‌, కోడింగ్‌, డీకోడింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు అభ్యాసం చేయాలి. వీటితో పాటు పట్టికలు, క్రమ, అనుక్రమ నిమయాలు, కోణములకు సంబంధించిన ప్రశ్నలు సాధన చేయాలి.
* క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
     
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో మూడు రకాల ప్రశ్నలుంటాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ, అర్థమెటిక్‌, డేటా అనాలసిస్‌. న్యూమరికల్‌ ఎబిలిటీలో రాణించాలంటే కూడికలు, తీసివేతలు, గుణించటం, భాగించటం, వర్గమూలాలు, భిన్నాలు తెలిసి ఉండాలి. వీటినిసులువు పద్ధతుల్లో వేగంగా పరిష్కరించేలా సాధన చేయాలి. అర్థమెటిక్‌ కోసం 7, 8, 9 తరగతులలోని వ్యాపారగణితాన్ని అభ్యాసం చేయాలి. కాలము-పని, కాలము-దూరము, రైళ్లు, వేగాలు, దూరాలు, వంటి వాటిపై అవగతం చేసుకుని సాధన చేయాలి. వడ్డీ లెక్కలు, నెంబర్‌ సిస్టం లెక్కలు, ఘనపరిమాణాలు, వైశాల్యాలు వంటి వాటి సూత్రాలు గుర్తుపెట్టుకోవటం చేయాలి. డేటాఅనాలసిస్‌పై పట్టు రావాలంటే పట్టికలు, బార్‌ఛార్టులు, గ్రాఫ్‌లు, శాతాలు, నిష్పత్తుల వంటి వాటిని సాధన చేయాలి.
* ఆంగ్లంపై పట్టుఇలా…
    
ఆంగ్లపరీక్ష కోసం వ్యాకరణంపై పూర్తిస్థాయి పరిజ్ఞానం సంపాదించాలి. ఇందులో కాంప్రహెన్షన్‌, వకాబులరీ, భాషాభాగాలు వంటివి కసరత్తు చేయాలి. సినోనియమ్స్‌(ఒకే అర్థాన్నిచ్చే పదాలు) కోసం ఆంగ్లపదాలు, అర్థాలు తెలుసుకోవాలి. ఇవి తెలిస్తేనే అప్పుడే ఆంటోనియమ్స్‌(వ్యతిరేక పదాలు) రాసే అవకాశముంటుంది. హోమోనియమ్స్‌ రాయటం కూడా అలవాటు చేసుకోవాలి. ఆంగ్లపత్రికల సంపాదకీయాలు చదవాలి. అందులో క్లిష్టమైన పదాలను ఎంపిక చేసుకుని వాటి అర్థాలను తెలుసుకోవాలి. ఆంగ్లభాష నుంచి తెలుగులోకి… తెలుగులో నుంచి ఆంగ్లభాషలోకి తర్జుమా చేసే సామర్థ్యం సాధించాలి. ఇతరులతో మాట్లాడే విధంగా సాధన చేయాలి… అలానే వారు చెప్పేది అర్థం చేసుకోవాలి. ప్యాసేజీలను చదివి… వాటికి సంబంధించి మాదిరి ప్రశ్నపత్రాలను చూసి సాధన చేయాలి.
* జనరల్‌ అవేర్‌నెస్‌
     
జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, క్రీడ, తదితర అంశాలపై స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇందుకోసం వార్తాపత్రికలను క్రమం తప్పకుండా చదవాలి. అవార్డు గ్రహీతలను గుర్తుంచుకోవాలి. పత్రికలు క్షుణ్నంగా చదవడంతోపాటు సొంతంగా బిట్స్‌ రాసుకోవడం అలవాటు చేసుకుంటే ఆయా విషయాలు బాగా గుర్తుంటాయి. రోజూ టీవీల్లో వార్తలు చూడాలి. అంతర్జాలంలో ఎప్పటికప్పుడు దొరికే తాజా జనరల్‌నాలెడ్జి అంశాలు చదవాలి.
* కంప్యూటర్‌ నాలెడ్జి… మార్కెటింగ్‌ అనాలసిస్‌
బ్యాంకు కొలువులలో తప్పనిసరిగా కంప్యూటర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటున్నాయి. కొన్ని కేంద్రప్రభుత్వ శాఖలు నిర్వహించే పరీక్షలలో కంప్యూటర్స్‌పై ప్రశ్నలు అడుగుతున్నారు. వీటి కోసం బేసిక్స్‌ డేటా ఇన్‌ఫర్‌మేషన్స్‌పై పట్టు సాధించాలి. అవుట్‌పుట్‌, ఇన్‌పుట్‌ డిజైన్స్‌పై పరిజ్ఞానం అవసరం. స్టోరేజి పరికరాలు, మెమోరీ స్టోరేజి అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్‌, హార్డువేర్‌, సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌, అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ల మధ్య తేడాలను గుర్తించి వాటిపై పరిజ్ఞానం పెంచకోవాలి. ఎం.ఎస్‌. వర్డ్‌, ఎక్స్‌ఎల్‌, ఈమెయిల్‌, బిట్‌, బైట్‌ వంటి వాటిని నేర్చుకోవాలి.
* నాలుగు సబ్జక్టులపై పట్టుతో 40పైగా అవకాశాలు : కె.శ్రీధర్‌, అర్థమెటిక్‌ నిపుణులు
బ్యాంకింగ్‌లో ఉన్న నాలుగు సబ్జక్టులపై పూర్తిస్థాయిలో సాధన చేస్తే మిగిలిన ఉద్యోగాల పరీక్షలను కూడా సులువుగా రాయవచ్చు. అయితే సాధనకు తగిన సమయం కేటాయించటం ముఖ్యం. ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలు రాసేలా సాధన చేయాలి. అరిథ్‌మెటిక్‌ మీద పట్టుసాధించాలంటే…. సమస్యలను సాధించటం, సూత్రాలు గుర్తుంచుకోవటం ఒక్కటే మార్గం.
* రీజనింగ్‌ పై పట్టు చాలా కీలకం : కె.రామకృష్ణ, రీజనింగ్‌ నిపుణులు
రీజనింగ్‌ ప్రస్తుతం బీటెక్‌ నుంచి ఇంటర్‌ వరకు ప్రతివిద్యార్థినీ ఏదో ఓ సందర్భంలో పలకరిస్తుంది. బీటెక్‌ ప్రాంగణ ఎంపికల నుంచి… సాధారణ క్లర్కు పోస్టుల వరకు ఈ రీజనింగ్‌ది కీలకపాత్ర. అందులో ప్రాథమికసూత్రాలను అవగతం చేసుకోవాలి. నమూనా ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. లాజికల్‌ థింకింగ్‌ను పెంచుకోవాలి.
* అన్ని పరీక్షలకు మూలం ఆంగ్లం : శ్రీనివాసరావు, ఆంగ్లఅధ్యాపకులు
      
పోటీపరీక్ష చూసినా అందులో ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. వ్యాకరణంపై పట్టు సాధించడంతో పాటు… అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండాలి. జాతీయపత్రికలు చదవటం… బీబీసీలో వార్తలు వినటం వంటివి ఉపయుక్తంగా ఉంటాయి.

 
Comments Off on నలభై ద్వారాలకు ఒకటే తాళం!

Posted by on November 4, 2013 in Uncategorized

 

సీమాంధ్రలోనూ తెలంగాణ స్థాయి విద్యాసంస్థలు


* నిట్‌, సెంట్రల్‌ వర్సిటీతో పాటు ఐఐటీ లేదా ఐఐఎంలలో ఏదైనా ఒక్కటి
*
విశాఖలో ప్రపంచస్థాయి వర్సిటీ!
ఈనాడు – హైదరాబాద్‌: రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రులకు నష్టం జరగనీయబోమన్న హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యావకాశాలపై దృష్టి సారించింది. కేంద్రీయ విద్యాసంస్థల విషయంలో సమన్యాయం సాధించే చర్యల్లో భాగంగానే తెలంగాణ..సీమాంధ్ర ప్రాంతాల్లోని కేంద్ర విద్యాసంస్థలు, వాటి ప్రాధాన్యం గురించి ఉన్నత విద్యాశాఖ అధికారులతో తొలిదఫా చర్చలు పూర్తిచేసింది. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ఏర్పాటు ఆయా రాష్ట్రాల పరిధిలోనే జరుగుతున్నందున ఉన్నత విద్యా రంగానికి చెందిన విషయాలపైనే నవంబరు 3న ఢిల్లీలో జరిపిన చర్చల్లో దృష్టిని కేంద్రీకరించింది. కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో అనుసరించే విధానపరమైన నిర్ణయాలను పరిగణనలోనికి తీసుకుని మానవ వనరుల శాఖ తగిన ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖకు తెలియచేయనుంది. అక్కడి నుంచి కేంద్ర మంత్రుల బృందానికి పూర్తి స్థాయి నివేదిక వెళ్లనుంది. కొత్త విద్యా సంస్థల స్థాపన వ్యయం గురించీ నివేదికలో పొందుపరిచే అవకాశం ఉందని సమాచారం.
కేంద్రీయ విద్యాలయాలపైనే ప్రధాన దృష్టి: హైదరాబాద్‌లో సెంట్రల్‌, మౌలానా, ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ విశ్వవిద్యాలయాలు, మెదక్‌లో ఐఐటీ నడుస్తున్నాయి. వీటితో సరితూగగల విద్యాసంస్థలు సీమాంధ్రలో లేనందున వీటి ఏర్పాటుకు ప్రాధాన్యం చేకూరింది.
రాష్ట్ర స్థాయి వర్శిటీల్లో ప్రవేశాలపై ప్రభావం: ప్రస్తుతం వివిధ శాఖల కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. వీటిలో తెలంగాణలో 13, సీమాంధ్రలో 21 విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. విశ్వవిద్యాలయాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మేరకు జరుగుతున్నా యూజీసీ నుంచి నిధులు పొందే అవకాశం ఉంది. వీటిల్లో.. రాష్ట్ర స్థాయిలోనివి.. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్‌ విశ్వవిద్యాలయం (హైదరాబాద్‌), ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం (విజయవాడ), పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (హైదరాబాద్‌), ఏపీ హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయం (తూర్పుగోదావరి), పద్మావతి విమెన్స్‌ విశ్వవిద్యాలయం (తిరుపతి), ద్రవిడ విశ్వవిద్యాలయం (చిత్తూరు), వెంకటేశ్వర వేదిక్‌ విశ్వవిద్యాలయం (తిరుపతి), దామోదరం సంజీవయ్య లా విశ్వవిద్యాలయం (వైజాగ్‌), రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (కడప), డాక్టర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ విశ్వవిద్యాలయం (హైదరాబాద్‌), జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఆర్జీయూకేటీ ద్వారా మూడు ప్రాంతాల్లో ట్రిఫుల్‌ఐటీలు నడుస్తున్నాయి. డాక్టర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం దూరవిద్యను అధ్యయన కేంద్రాల ద్వారా కోర్సులు నిర్వహిస్తోంది.
నిట్‌ తప్పనిసరి: సీమాంధ్రలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ-నిట్‌) తప్పనిసరి కానుంది. దాదాపుగా ప్రతి రాష్ట్రంలో ఎన్‌ఐటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మన రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం వరంగల్‌లో నడుస్తోంది. ఈ విద్యా సంస్థలోని 50% సీట్లను ఆయా రాష్ట్రాల్లో చదివే విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ఇదే క్రమంలో సీమాంధ్రలోనూ తప్పనిసరిగా నిట్‌ ఏర్పాటుకానుందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మాదిరిగానే చిత్తూరు జిల్లా సత్యవేడులో కిందటి విద్యా సంవత్సరం నుంచి ట్రిపుల్‌ఐటీ నడుస్తోంది. మరొకటి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రాబోతుంది. 2014-15 విద్యా సంవత్సరం నుంచి దీనిని నడిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదిపులు జరుగుతున్నాయి.
ఐఐటీ లేదా ఐఐఎం: సీమాంధ్రలో ఐఐటీ లేదా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో ఒకదానికి మాత్రమే కేంద్రం సమ్మతించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా రాష్ట్రాల అభ్యర్థనలను అనుసరించి రెండింట్లో ఒక దానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ వస్తున్నందున సీమాంధ్రలోనూ అదే జరగవచ్చునని చెబుతున్నారు. వైజాగ్‌లో నల్సార్‌ విశ్వవిద్యాలయం ఉండగా..ఇందులో 20% సీట్లను రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తున్నారు.

 
Comments Off on సీమాంధ్రలోనూ తెలంగాణ స్థాయి విద్యాసంస్థలు

Posted by on November 4, 2013 in Uncategorized