RSS

Daily Archives: November 27, 2013

‘రూసా’ అమలుకు సమగ్ర ప్రణాళిక


ఈనాడు-హైదరాబాద్: ఉన్నత విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ‘రూసా’ (రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) ద్వారా అధిగమించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను పకడ్బందీగా రూపొందిస్తోంది. ఇప్పటివరకు ప్రాథమిక విద్యాభివృద్ధిపై వేల కోట్ల రూపాయలను వెచ్చించిన కేంద్రం తొలిసారిగా ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూసా ద్వారా 25వేల కోట్ల రూపాయలను వెచ్చించేందుకు సిద్దమైంది. ఉన్నత విద్య బలోపేతానికి 11వ పంచవర్ష ప్రణాళిక ద్వారా కొన్ని చర్యలను తీసుకుంది. 12వ పంచవర్ష ప్రణాళిక ద్వారా మరిన్ని చర్యలను విస్తృతస్థాయిలో చర్యలు తీసుకోబోతుంది.

 
Comments Off on ‘రూసా’ అమలుకు సమగ్ర ప్రణాళిక

Posted by on November 27, 2013 in Uncategorized

 

మహిళా వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాల దరఖాస్తుకు గడువు 30


తిరుపతి (మహిళా విశ్వవిద్యాలయం): శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పలు విభాగాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశానికి ఆసక్తిగల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుకు నవంబరు 30 ఆఖరు గడువని వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఆచార్య జయశ్రీ తెలిపారు. 2013-14 విద్యాసంవత్సరానికిగాను ఎంఫిల్, పీహెచ్‌డీల్లో ప్రవేశానికి నిర్వహించే పరిశోధన ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. అప్త్లెడ్ మ్యాథమేటిక్స్, అప్త్లెడ్ మైక్రోబయాలజి, బయోటెక్నాలజి, కంప్యూటర్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, సెరికల్చర్, బోటనీ, జువాలజి తదితర సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, ఎంఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 55శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 2014, జనవరి 6న ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆచార్య జయశ్రీ సూచించారు.

 
Comments Off on మహిళా వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాల దరఖాస్తుకు గడువు 30

Posted by on November 27, 2013 in Uncategorized

 

నైపుణ్యాల వృద్ధికి త్రైపాక్షిక భాగస్వామ్యాలు అవసరం


నైపుణ్యాల వృద్ధికి త్రైపాక్షిక భాగస్వామ్యాలు అవసరం

* మంత్రి కపిల్ సిబల్ సూచన
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో ప్రత్యేక కోర్సులను అభివృద్ధి చేయడం ద్వారా నైపుణ్యాలను పెంచేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి త్రైపాక్షిక భాగస్వామ్యాలు ఏర్పడాలని టెలికం శాఖ మంత్రి కపిల్ సిబల్ సూచించారు. ఇందులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్‌డీ), ఐటీ శాఖ, ప్రైవేటు రంగం భాగస్వాములుగా ఉండాలన్నారు. ఏఐసీటీఈ ఆమోదం ఉన్న సంస్థల్లోని విద్యార్థులు బీఎస్ఎన్ఎల్‌కు చెందిన శిక్షణ సౌకర్యాలను వినియోగించుకునేందుకు రెండు సంస్థల మధ్య నవంబరు 26న ఇక్కడ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిబల్ ప్రసంగించారు. పరిశ్రమల కోసం నిపుణులైన కార్మికులను తయారుచేసేందుకు కమ్యూనిటీ కాలేజీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నైపుణ్యాలను మెరుగపరచేందుకు ప్రైవేటు రంగానికి క్రియాశీల భాగస్వామ్యాన్ని కల్పించాలన్నారు. త్రైపాక్షిక భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాలు అవసరమైన చోట ప్రత్యేక కోర్సులను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని చెప్పారు. ఇందులో పాల్గొన్న హెచ్ఆర్‌డీ మంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ.. తాజా ఒప్పందం వల్ల ఐటీ, టెలికం రంగాల్లో 25 వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతారని చెప్పారు. టెలికం రంగంలో ఇది పెద్ద ముందడుగుగా ఆయన పేర్కొన్నారు.

 
Comments Off on నైపుణ్యాల వృద్ధికి త్రైపాక్షిక భాగస్వామ్యాలు అవసరం

Posted by on November 27, 2013 in Uncategorized

 

100 శాతం మందికి ఉద్యోగావకాశాలు


100 శాతం మందికి ఉద్యోగావకాశాలు

* అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అవకాశాలు
* ‘ఈనాడు’కు వివరించిన సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌
ఈనాడు, హైదరాబాద్‌: పగటిపూట తరగతులు..రాత్రిపూట పరీక్షలు..ఉదయానికే మార్కుల వెల్లడి. సమయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ..అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న బోధన తీరిది. విద్యార్థులను చైతన్యవంతుల్ని పరిచేలా ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో బోధన సాగుతోంది. ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశించే తొలి సంవత్సరంలోనే వారు ఎంచుకున్న కోర్సులను అనుసరించి ప్రయోగాత్మకంగా (ప్రాక్టికల్స్‌‌) బోధన చేస్తూ ఆచార్యులు వారిని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఇక్కడ చదువుతున్న రాష్ట్ర విద్యార్థులతో రాష్ట్రం నుంచి వెళ్లిన అధికారిక బృందం ముచ్చటించింది. సాంకేతిక విద్యా ప్రమాణాల పెంపుపై అధ్యయనంలో భాగంగా ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ అజయ్‌ జైన్‌, టెక్విప్‌ పర్యవేక్షణాధికారి మురళీధర్‌రెడ్డి ఇటీవల షికాగో స్టేట్‌ యూనివర్శిటీ (షికాగో), యూనివర్శిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ (ఇల్లినాయిస్‌), స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయం (కాలిఫోర్నియా), యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (కాలిఫోర్నియా, బర్కిలీ)లను సందర్శించి వచ్చారు. షికాగో విశ్వవిద్యాలయంతో జేఎన్‌టీయూ కాకినాడ (ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో) ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకోని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌ ‘ఈనాడు’తో అమెరికా విశ్వవిద్యాలయాల్లో గమనించిన అంశాలను వివరించారు. * బోధన 70% నుంచి 80% వరకు ప్రయోగాత్మకం(ప్రాక్టికల్‌)గానే కొనసాగుతోంది. మిగిలిందే థియరీ విధానంలో. దీనివల్లే అక్కడి విద్యార్థులు ప్రాక్టికల్‌గా కనిపిస్తున్నారు. విద్యను పూర్తిచేసిన అనంతరం నూటికి నూరు శాతం మంది ఉద్యోగావకాశాలను పొందుతున్నారు.
* ఆచార్యుడు రాజుగా చలామణి అవుతున్నారు. ఈయన ఓ పక్క పరిశోధనలు కొనసాగిస్తూనే విద్యార్థులకు బోధన చేస్తున్నారు. ప్రతి విభాగంలోనూ ఆయా రంగాల్లో నిపుణులైన విదేశీ ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు విద్యార్థులకు బోధన చేస్తున్నారు.
* విద్యార్థులకు పగటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే విద్యార్థులు తరగతి గదులకు వచ్చేసరికి వారు సాధించిన మార్కులు గురించి తెలియబరుస్తున్నారు. జవాబుపత్రాల మూల్యాంకనంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నారు.
* ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే సుమారు 250 పరిశ్రమలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. ఇవి విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నాయి. మౌలిక సదుపాయాలను విశ్వవిద్యాలయమే కల్పిస్తోంది. ప్రజలు చెల్లించే పన్నులు విద్యా సంస్థలకు నేరుగా బదిలీ అవుతున్నాయి.
* విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యతోపాటు సాంఘిక, సామాజిక రంగాలకు సంబంధించిన అంశాలపై పట్టుసాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తరగతి గదులన్నీ సాధన సంపత్తితో ఉంటాయి. విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి చర్చలు, ప్రజెంటేషన్లను చేస్తున్నారు.
* విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉమ్మడిగా గెలిచేలా అమెరికాలో విద్యాబోధన సాగుతోంది.
దక్షిణాది నుంచి ఎక్కువ మంది ఆచార్యులు
విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంవల్ల ఇవన్నీ చేయడం సాధ్యమవుతోందని అజయ్‌జైన్‌ అభిప్రాయపడ్డారు. మనలాంటి రాష్ట్రాల్లో కూడా కొన్ని విషయాల్లో అవసరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బోధన చేసే అధ్యాపకుల్లో భారతదేశం నుంచి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువమంది ఉన్నారని వెల్లడించారు.

 
Comments Off on 100 శాతం మందికి ఉద్యోగావకాశాలు

Posted by on November 27, 2013 in Uncategorized