RSS

Daily Archives: December 27, 2013

మహిళా టీచర్లకు సన్మానం 3న


కర్నూలు విద్య: జిల్లాలో గత 5 సంవత్సరాల నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల సహాయకులు, పాఠశాలల మహిళా ప్రధానోపాధ్యాయులకు జనవరి 3న సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈవో కే నాగేశ్వరరావు డిసెంబరు 27న ఒక ప్రకటనలో తెలిపారు. సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

Advertisements
 
Comments Off on మహిళా టీచర్లకు సన్మానం 3న

Posted by on December 27, 2013 in Uncategorized

 

ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగులకు ఆరోగ్యకార్డులు!


హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర ఎయిడెడ్ కళాశాలల్లో పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్ కార్డులను ఇచ్చే విషయం పరిశీలనలో ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చెప్పారు. తెలంగాణ ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగుల సంఘం (టాక్సా) అధ్యక్షుడు వి.రాజమహేందర్‌రెడ్డి న్యాయకత్వంలోని ఓ ప్రతినిధి బృందం డిసెంబరు 27న మంత్రిని కలిసి హెల్త్ కార్డులు ఇవ్వాలంటూ వినతిపత్రం సమర్పించింది. సానుకూలంగా స్పందించిన ఆయన మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ‘టాక్సా ప్రధాన కార్యదర్శి డి.వెంకటరమణ తెలిపారు.

 
Comments Off on ఎయిడెడ్ కళాశాలల ఉద్యోగులకు ఆరోగ్యకార్డులు!

Posted by on December 27, 2013 in Uncategorized

 

అన్ని విశ్వవిద్యాలయాల పరిస్థితి అంతంతే..


 

* రాష్ట్రఉన్నతవిద్యామండలిఛైర్మన్ఆచార్యవేణుగోపాలరెడ్డి

 

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఒక్క పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయమే కాదు.. ఉస్మానియా, ఆంధ్ర, ఎస్వీ విశ్వవిద్యాలయాలూ నిధుల కొరత ఎదుర్కొంటున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య వేణుగోపాలరెడ్డి అన్నారు. ఆయా విశ్వవిద్యాలయాలు కనీసం తమ ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చే పరిస్థితిలోనూ లేవని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో డిసెంబరు 27న నిర్వహించిన ‘ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవం’లో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని వేణుగోపాలరెడ్డి తెలిపారు. వచ్చే వారంలో సీఎంతో జరగనున్న మరో సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తానన్నారు. మాతృభాష, సంస్కృతుల్ని పరిరక్షించడానికి తెలుగువర్సిటీ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. తెలుగువర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ తెలుగు విశ్వవిద్యాలయం సాంస్కృతిక విశ్వవిద్యాలయమన్నారు.

 
Comments Off on అన్ని విశ్వవిద్యాలయాల పరిస్థితి అంతంతే..

Posted by on December 27, 2013 in Uncategorized

 

ప్రతి విద్యార్థీ ‘ఇండియా అంబాసిడర్‌’గా నిలవాలి


* యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా ప్రొఫెసర్‌ సూర్యనారాయణ
ఈనాడు, హన్మకొండ: అమెరికాలో ఉన్న విద్యార్థులకు, భారతదేశం నుంచి అమెరికా వస్తున్న విద్యార్థులకు మధ్య క్రమశిక్షణలోనే తేడాలున్నాయని యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా మెకానికల్‌, మెటీరియల్‌, ఏరోస్పేస్‌ ప్రొఫెసర్‌ సి.సూర్యనారాయణ పేర్కొన్నారు. మన విద్యార్థులు ఆ తేడాను చెరిపేసుకునేలా ఎదగాలని ఆకాంక్షించారు. వరంగల్‌ ఎన్‌ఐటీలో డిసెంబరు 26న సాయంత్రం ‘టెక్నోజియాన్‌-13’ వేడుకలను ప్రారంభించడానికి వచ్చిన ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఇక్కడి ప్రతి విద్యార్థీ ‘ఇండియా అంబాసిడర్‌’గా నిలవాలన్నారు. దేశ ప్రతినిధులుగా విదేశాల్లో గౌరవం అందుకోవాలని సూచించారు. యువత తమ పరిశోధనలపై సొంత ముద్ర వేయాలని చెప్పారు.

 
Comments Off on ప్రతి విద్యార్థీ ‘ఇండియా అంబాసిడర్‌’గా నిలవాలి

Posted by on December 27, 2013 in Uncategorized

 

* కళాశాల స్థాయిలోనే బృందాలు; ఉపాధికి బాటలు


* కళాశాల స్థాయిలోనే బృందాలు; ఉపాధికి బాటలు
ఈనాడు, హైదరాబాద్‌: విద్యనభ్యసిస్తూనే అభిరుచి కొద్దీ ఏదో ఓ వాయిద్యం నేర్చుకొనే ధోరణి యువతలో పెరుగుతోంది. కారణం- అభిరుచిని ఉపాధిగా మార్చుకొని ఆ విభాగంలో నెగ్గుకు రావాలనుకొనే వాళ్లకి అవకాశాలు కల్పిస్తోంది వాద్య సంగీతం. కేవలం సినిమా సంగీతంలోనే కాదు రాక్‌, ఫ్యూజన్‌ బ్యాండ్‌ రంగంలోనూ పాశ్చాత్య వాద్యాలపై రాగాలు పలికించే వాళ్లకి బోలెడన్ని అవకాశాలున్నాయి.

హైదరాబాద్‌లో అయిదారుగురు ఒక బృందంగా ఏర్పడి నిర్వహించే బ్యాండ్‌కి ఒక కార్యక్రమానికి రూ.50 వేల వరకూ దక్కుతోంది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరుల్లో రూ.లక్ష పైనే పారితోషికంగా తీసుకొంటున్న వాళ్లూ ఉన్నారు. సినిమాల్లో అయితే వర్థమాన గాయకులకు పాటకు రూ.10 వేలు అటూ ఇటూగా ఇస్తారు. విషయం ఉన్న వాద్య కళాకారులకి పాటకు రూ.50 వేల రూపాయలుపైనే ఇస్తున్న సందర్భాలూ ఉన్నాయి. కేవలం కొన్ని నిమిషాల పాటు తమ వాద్యంతో రాగం పలికించే వాళ్లకు రూ.10 వేల వరకూ ఇస్తున్నారు. కీ బోర్డు, గిటార్‌, డ్రమ్స్‌ కళాకారులకు రాక్‌ సంగీత కార్యక్రమాల్లోనో, సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.
చదువుకొంటూనే…
అయితే నవతరంలో పాశ్చాత్య సంగీతమ్మీద ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు తగ్గ వాద్యాలు నేర్చుకొనే వాళ్లూ కనిపిస్తున్నారు. గిటార్‌, కీబోర్డ్‌, డ్రమ్స్‌పై మక్కువ చూపుతున్నారు. వీరికి రాక్‌, హిప్‌హాప్‌, పాప్‌ పాడే గాయకులూ తోడవుతున్నారు. వీరంతా కళాశాల దశ నుంచే రాక్‌ బ్యాండ్‌ బృందాలుగా ఏర్పడి ప్రదర్శనలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ తరహా బృందాలు 25 దాకా ఉన్నాయి. స్టార్‌ హోటళ్లలోనూ, ప్రధానమైన ఈవెంట్లలోనూ, వారాంతాల్లోనూ వీళ్ల ప్రదర్శనలుంటున్నాయి. అంతేకాకుండా కాలేజీల్లో కార్యక్రమాలకూ పిలుపులందుతున్నాయి. వీరి సంగీతానికి యువత నుంచీ మంచి స్పందన వస్తోంది. కొందరు వీ, ఎమ్‌, వీహెచ్‌1 లాంటి మ్యూజిక్‌ ఛానెళ్లలోనూ ప్రదర్శనలిస్తూ గుర్తింపు పొందుతున్నారు.
కొద్ది సమయంలోనే….
కార్యక్రమాలు ఒకెత్త్తెతే…. సినిమా అవకాశాలు మరో ఎత్తు! కీ బోర్డులో నైపుణ్యం సాధించిన వాళ్లకు పాటకు రూ.25 వేల నుంచి రూ.50 వేలు వరకూ దక్కుతోంది. కాస్త పేరున్న వారు రూ. లక్షల్లోనే డిమాండ్‌ చేస్తున్న సందర్భాలున్నాయి. గాయకుల తరహాలోనే వాద్యకారులకీ విదేశాల్లో ప్రదర్శనలిచ్చే అవకాశాలు వస్తున్నాయి. అయితే చెన్నైతో పోల్చుకొంటే హైదరాబాద్‌లో పాశ్చాత్య, సంప్రదాయ వాద్యాలపై శిక్షణ ఇచ్చే గురువుల కొరత లేకపోలేదు. గమ్మత్తేమంటే దీన్ని యువతరం అంతర్జాలంతో అధిగమించటం! మన దగ్గర ఉన్న రాక్‌, ఫ్యూజన్‌ బ్యాండ్లలో గిటార్‌, డ్రమ్స్‌లాంటివి పలికించే వాళ్లలో కొందరు నెట్‌ ద్వారా సంగీతం నేర్చుకొన్న వాళ్లూ ఉంటున్నారు. లండన్‌లోని ట్రినిటీ కాలేజ్‌లాంటి సంస్థలు వివిధ దశలో పరీక్షలు నిర్వహిస్తాయి. వాటికి సంబంధించిన సిలబస్‌ ప్రకారం చదువుకొని గిటార్‌, పియానో లాంటి వాద్యాలకు సంబంధించిన పరీక్షలకు హాజరవుతున్నవాళ్లూ ఉన్నారు. ఈ కొరతను దృష్టిలో ఉంచుకొనే ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ తను నిర్వహిస్తున్న సంగీత శిక్షణ సంస్థలో వాద్యకారులకు సంబంధించిన కోర్సులు ప్రారంభించారు.
ప్రావీణ్యంతోపాటు టెక్నిక్‌ కూడా తెలియాలి
”ఎక్కువగా సినిమాకు పని చేస్తున్నాను. శాస్త్రీయ కచేరీల్లో మాండలిన్‌పై సంగీతం పలికిస్తాను. అరబ్బీ, చైనీస్‌ వాద్యాలపైనా పట్టు ఉంది కాబట్టే సినిమా సంగీతంలో ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. ఆ రంగంలో పని చేసేందుకు సంగీతంలో ప్రావీణ్యంతోపాటు టెక్నిక్‌ కూడా తెలియాలి. ఇక హైదరాబాద్‌లో రాక్‌ బ్యాండ్‌ సంస్కృతి కొద్ది సంవత్సరాలుగా వూపందుకొంటోంది. యువత అటు వైపు వెళ్తే నెగ్గుకు రావచ్చు. ఒక వాద్యంపైన పట్టు రావాలంటే అందుకు ఏడేళ్ల నుంచి పదేళ్లపాటు సాధన చేయాలి.”     – సుభానీ (10 వాద్యాలు పలికించే కళాకారుడు)
దేని ప్రత్యేకత దానిదే
”స్టింగ్స్‌ విభాగానికి చెందిన వయోలిన్‌, చెల్లో, వయోలా, డబుల్‌ బేస్‌ వాద్యాలకు తగిన కళాకారులు లేరు. వాటి విషయంలోనూ తగిన శిక్షణ పొందితే యువకులకు అవకాశాలు దక్కుతాయి. కీ బోర్డులోనే అన్నీ ఉన్నాయనుకోవడం సరికాదు. ఏ వాద్యం ప్రత్యేకత దానిదే.”   – కోడూరి కల్యాణి (సంగీత దర్శకుడు)

 
Comments Off on * కళాశాల స్థాయిలోనే బృందాలు; ఉపాధికి బాటలు

Posted by on December 27, 2013 in Uncategorized

 

ప్రతిభను నమ్ముకోండి…దళారులను నమ్మకండి!


ప్రతిభను నమ్ముకోండి…దళారులను నమ్మకండి!

* ఒక్క పైసా ఎవ్వరికీ ఇవ్వకండి
* 28న వీఆర్వో… వీఆర్ఏ ఉద్యోగాల భర్తీ ప్రకటన
– మంత్రి రఘువీరారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాల భర్తీని వందశాతం పారదర్శకంగా, ప్రతిభకు గుర్తింపు ఉండేలా నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి డిసెంబరు 27న స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చే వారి మాటలు విశ్వసించవద్దని ఎవ్వరికీ ఒక పైసా కూడా ఇవ్వద్దన్నారు. కేవలం రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుందని అన్నారు. నియామకపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ‘ఈనాడు’కు తెలిపారు.
రాష్ట్రంలో గ్రామరెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాల భర్తీకి ప్రకటన డిసెంబరు 28న వెలువడనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. శనివారం జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) 1657, గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) 4305 పోస్టులను భర్తీ చేయనున్నారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ నియామక ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్ననెన్స్ (సీజీజీ) ఈ ఉద్యోగాల నియామకానికి అవసరమైన సాంకేతిక పరమైన అంశాల తోడ్పాటును అందిస్తుంది. వంద మార్కులకు అబ్జెక్టివ్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. జిల్లాల వారీగా ఉన్న వీఆర్ఏ, వీఆర్వో పోస్టుల, రిజర్వేషన్లు తదితర అంశాలతో ఆయా జిల్లాల్లో శనివారం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగప్రకటన వెలువడుతుంది.
ఇతర వివరాలు:
వీఆర్వో మొత్తం ఉద్యోగాలు: 1657
విద్యార్హత: ఇంటర్మీడియట్ పాస్ లేదా మూడేళ్ల డిప్లొమా
వయోపరిమితి: 18 నుంచి 36 సంవత్సరాలు
ఎస్సీ,ఎస్టీ,బీసీలకు: 41 సంవత్సరాలు
వికలాంగులు: 46 సంవత్సరాలు
వీఆర్ఏ మొత్తం ఉద్యోగాలు: 4305
వయోపరిమితి: 18 నుంచి 37 ఏళ్లు
ఎస్సీ,ఎస్టీ,బీసీలకు: 42 ఏళ్లు
వికలాంగులు: 47
* ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలి. వీఆర్ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు ఆ గ్రామానికి చెందినవారై ఉండాలి.
* పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2
* ఫలితాల విడుదల: ఫిబ్రవరి 20

 
Comments Off on ప్రతిభను నమ్ముకోండి…దళారులను నమ్మకండి!

Posted by on December 27, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: