RSS

Daily Archives: December 28, 2013

పరిశోధనాత్మక ఆవిష్కరణలు అవసరం


* ప్రముఖ ఆర్థికవేత్త మహేంద్రదేవ్

ఏఎన్‌యూ (గ్రామీణమంగళగిరి), న్యూస్‌టుడే: సమాజాభివృద్ధికి పరిశోధనాత్మక ఆవిష్కరణలు ఎంతో అవసరమని, ఈ దిశగా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు తమ మేథకు పదునుపెట్టి ముందడుగు వేయాలని ప్రముఖ ఆర్థికవేత్త, ఇందిరాగాంధీ అభివృద్ధి విషయాల పరిశోధనాత్మక సంస్థ సంచాలకులు ఆచార్య సూర్యదేవర మహేంద్రదేవ్ ఆకాంక్షించారు. డిసెంబరు 28న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన 33, 34 స్నాతకోత్సవాల్లో గౌరవ డాక్టరేట్‌ను మహేంద్రదేవ్‌కు ఉపకులపతి కోదాటి వియన్నారావు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవ్ స్నాతకోత్సవ సందేశమిచ్చారు. పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థులు పరిశోధనలు, ఆవిష్కరణలవైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు. వీసీ వియన్నారావు మాట్లాడుతూ వర్సిటీలోని పీజీ కోర్సులు అన్నిటికీ అమలయ్యే విధంగా ఛాయిస్ క్రెడిట్ విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేశామని చెప్పారు. బోధన పరిశోధన అభివృద్ధిలో భాగంగా వర్సిటీలో వివిధ విభాగాలు కేంద్రాలు అనేక సదస్సులను నిర్వహించాయన్నారు. వర్సిటీలో వివిధ విభాగాల్లో మొత్తం 241 మంది ఎంఫిల్, 115 మంది పీహెచ్‌డీ డిగ్రీల కోసం పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 232 మందికి బంగారు పతకాలు, 165 మందికి పీహెచ్‌డీ డిగ్రీలు, 40 మందికి ఎంఫిల్ డిగ్రీలను వీసీ కె.వియన్నారావు ప్రదానం చేశారు.

Advertisements
 
Comments Off on పరిశోధనాత్మక ఆవిష్కరణలు అవసరం

Posted by on December 28, 2013 in Uncategorized

 

నోబెల్ విజేతల పేరిట విశ్వవిద్యాలయాల్లో పీఠాలు


న్యూఢిల్లీ: దేశంలోని యువతకు స్ఫూర్తి కలిగించేలా అన్ని విశ్వవిద్యాలయాల్లో నోబెల్ విజేతల పేరిట పీఠాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 28న ప్రకటించింది. నోబెల్ బహుమతులు గెలుచుకున్న భారతీయులు రవీంద్రనాథ్ ఠాగూర్, సి.వి.రామన్, హరగోవింద్ ఖొరానా, మదర్ థెరిసా, సి.చంద్రశేర్, అమర్త్యసేన్, వి.రామకృష్ణన్ పేరిట వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ‘ఈ పీఠాల ఏర్పాటు ద్వారా విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభావంతులైన యువతను గుర్తించి స్ఫూర్తినివ్వాలన్నదే లక్ష్యమని’ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ప్రకటించారు. దేశ రాజధానిలో జరిగిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వజ్రోత్సవ సంబరాల్లో ఆయన మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజికశాస్త్రం తదితర అంశాల్లో మెరుగైన ప్రతిభ చూపిన వ్యక్తులకు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట పురస్కారాలు ఇవ్వాలన్న యూజీసీ ప్రతిపాదనను ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్ స్వాగతించారు. అత్యంత నాణ్యమైన పరిశోధనలు చేసేలా యువతను ప్రేరేపించేందుకు ఈ పురస్కారాలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

 
Comments Off on నోబెల్ విజేతల పేరిట విశ్వవిద్యాలయాల్లో పీఠాలు

Posted by on December 28, 2013 in Uncategorized

 

అధ్యాపకుల కొరతపై దృష్టి సారించాలి


యూజీసీ వజ్రోత్సవ వేడుకల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్

న్యూఢిల్లీ: ఉన్నత విద్య నాణ్యతను దెబ్బతీస్తున్న అధ్యాపకుల కొరతకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తక్షణం నూతన పరిష్కార మార్గాలు కనుక్కోవాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. యూజీసీ వజ్రోత్సవ వేడుకల్లో డిసెంబరు 28న ఆయన మాట్లాడుతూ… దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలు ప్రపంచంలోని ఉత్తమ సంస్థల సరసన నిలవలేకపోతున్నాయన్నారు. ఇక్కడ ఉన్నత విద్యలో ప్రమాణాలు సాధారణ స్థాయిలోనే ఉండటం విచారకరమని ఆయన పేర్కొంటూ ఈ పరిస్థితిని మార్చడానికి సరైన పరిష్కారాలు చూపాలని యూజీసీ, భాగస్వామ్య సంస్థలను కోరారు. గణాంకాల ప్రకారం ఒక్క ఐఐటీల్లోనే 32 శాతం బోధనా సిబ్బంది కొరత ఉంది. దాదాపుగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలన్నీ ఈ లోటును ఎదుర్కొంటున్నాయి. అధ్యయన విద్యకు ప్రాధాన్యమివ్వాలని, పరిశోధక కోర్సుల (డాక్టోరల్ ప్రోగ్రాం)ను పెంచాలని ప్రధాని సూచించారు. ఇటీవల ప్రారంభించిన రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) రాష్ట్రాల్లో ఉన్నత విద్యాసంస్థల ప్రాముఖ్యాన్ని గుర్తించిందని పేర్కొన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాలు, అధ్యయనంపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. గత పదేళ్లలో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) దాదాపు రెట్టింపు అయిందని.. ప్రస్తుతం ఆ నిష్పత్తి 19.4 శాతంగా ఉందని చెప్పారు. ఉన్నత విద్యలో మహిళల జీఈఆర్ 9.4 నుంచి 17.9 శాతానికి చేరిందని తెలిపారు. ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి గత పదేళ్లలో చేపట్టిన చర్యలను ఆయన వివరించారు.

 
Comments Off on అధ్యాపకుల కొరతపై దృష్టి సారించాలి

Posted by on December 28, 2013 in Uncategorized

 

జనవరిలో టెట్‌, మార్చిలో డీఎస్‌సీ


* మంత్రి పార్థసారథి
నార్పల, న్యూస్‌టుడే: రానున్న జనవరిలోనే ఏపీ టెట్‌ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. డిసెంబరు 27న అనంతపురం జిల్లా నార్పలలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. జనవరి ప్రారంభంలోనే టెట్‌ పరీక్ష నిర్వహించి నెలాఖరుకల్లా ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఒప్పంద అధ్యాపకులను తొలగించకుండా ఇంకా అవసరమైన వారిని ఏపీపీఎస్‌సీ ద్వారానే ఎంపిక చేస్తామని చెప్పారు.

 
Comments Off on జనవరిలో టెట్‌, మార్చిలో డీఎస్‌సీ

Posted by on December 28, 2013 in Uncategorized

 

వీఆర్ఏ, వీఆర్వో నోటిఫికేష‌న్ల విడుదల


వీఆర్ఏ, వీఆర్వో నోటిఫికేష‌న్ల విడుదల

* ‘జిల్లాల వారీగా జారీ – మొత్తం 5,962 పోస్టులు
రాష్ట్రంలో ఖాళీగాఉన్న 1657 గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో ), 4305 గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు జిల్లాల వారీగా డిసెంబ‌ర్ 28న కలెక్టర్లు విడుద‌ల చేశారు. మొత్తం 5,962 పోస్టుల నియామకానికి గాను ప్రకటనలు వెలువడ్డాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ నియామక ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్ననెన్స్ (సీజీజీ) ఈ ఉద్యోగాల నియామకానికి అవసరమైన సాంకేతిక పరమైన అంశాల తోడ్పాటును అందిస్తుంది. ఈ సారి ప‌రీక్ష తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి మీసేవ, ఈసేవ, ఏపీ ఆన్‌లైన్ ద్వారా జర్నల్ నెంబర్లను జనవరి 12 వరకు పొందవచ్చు. ఆన్‌లైన్ ద్వారా జనవరి 13లోగా దరఖాస్తు చేయాలి. ఫిబ్రవరి 2న రాత పరీక్ష జరుగుతుంది.
పోస్టులకు అర్హతలు…
వీఆర్‌వో
* కనీస విద్యార్హత ఇంటర్/మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
* వయోపరిమతి: 18-36 సంవత్సరాలు.
* ఇంటర్/ డిప్లొమా పూర్తయ్యేనాటికి వరుసగా నాలుగేళ్లు సంబంధిత జిల్లాలో చదివినవారు మాత్రమే ఆ జిల్లాలో పోస్టులకు అర్హులు.
వీఆర్ఏ
* కనీస విద్యార్హత పదోతరగతి
* వయోపరిమితి 18-37 సంవత్సరాలు.
* సంబంధిత రెవెన్యూ గ్రామపరిధిలో నివసించేవారు అర్హులు. రేషన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు తదితర ధ్రువీకరణపత్రాల నకలు దరఖాస్తుకు జతపరచాలి.
పరీక్ష రుసుం
* పరీక్ష ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150, వికలాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జిల్లాల వారీగా నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు
వెబ్‌సైట్‌: ccla.cgg.gov.in

 
Comments Off on వీఆర్ఏ, వీఆర్వో నోటిఫికేష‌న్ల విడుదల

Posted by on December 28, 2013 in Uncategorized

 
 
%d bloggers like this: